పులివెందులలో రీ పోలింగ్‌కు ఆదేశాలివ్వండి | Pramilamma and Avinash Reddy file urgent petition in High Court | Sakshi
Sakshi News home page

పులివెందులలో రీ పోలింగ్‌కు ఆదేశాలివ్వండి

Nov 3 2026 6:01 AM | Updated on Nov 3 2026 6:01 AM

Pramilamma and Avinash Reddy file urgent petition in High Court

హైకోర్టులో ప్రమీలమ్మ, అవినాష్‌రెడ్డి అత్యవసర పిటిషన్‌    

అధికార పార్టీ యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడింది

పోలింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే రిగ్గింగ్‌ మొదలుపెట్టారు

వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు గెంటేశారు

బయటి ప్రాంతాల నుంచి వ్యక్తులను తెచ్చి బెదిరింపులకు దిగారు

అధికార పార్టీ ఆగడాలకు పోలీసులు పూర్తిగా సహకరించారు

సీసీటీవీ ఫుటేజీ, వెబ్‌క్యాసింగ్‌ రికార్డులను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయి

ఎన్నికల అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారు

వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా కేవలం 4 వార్డుల్లో రీ పోలింగ్‌ జరిగింది

ఇది పూర్తిగా కంటి తుడుపు చర్యే.. రీ పోలింగ్‌ అన్ని వార్డుల్లో జరగాలి

హైకోర్టుకు నివేదించిన సీనియర్‌ న్యాయవాది సుబ్రమణ్య శ్రీరాం

నేడు ఉదయం 7.30 గంటలకు నిర్ణయం వెలువరిస్తామన్న హైకోర్టు

సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల్లో అధికార యంత్రాంగం చేష్టలుడిగిన వేళ అధికార పచ్చమూకలు చెలరేగి యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడిన నేపథ్యంలో పులివెందుల మునిసిపాలిటీకి చెందిన అన్ని వార్డుల్లో రీపోలింగ్‌ జరపాలని ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ) ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ మునిసిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి వైఎస్‌ ప్రమీలమ్మ, కడప పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి సోమవారం హైకోర్టులో అత్యవసరంగా అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి విచారణ జరిపారు.  ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, మంగళవారం ఉదయం 7.30 గంటలకు రీ పోలింగ్‌పై నిర్ణయం వెలువరిస్తానని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతక్రితం పులివెందులలో అధికారపక్షం అరాచకాలు, అక్రమాలపై  పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సుబ్రమణ్య శ్రీరాం సుదీర్ఘ వాదనలు వినిపించారు. మంగళవారం జరగనున్న కౌంటింగ్‌ ప్రక్రియను నిలుపుదల చేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు.  వాదనల్లో ముఖ్యాంశాలు..

హైకోర్టు ఆదేశాలపై ఎన్నికల సంఘం స్పందన శూన్యం
పులివెందులలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగిన ముందస్తు రక్షణ చర్యలు తీసుకొనేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరుతూ గత వారం ఇదే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాం.  ఎంపీ అవినాష్‌రెడ్డి ఆ మేరకు ఇచ్చిన వినతిపై తగిన నిర్ణయం తీసుకోవాలని ఈ కోర్టు ఎస్‌ఈసీని ఆదేశించింది. అయితే ఎస్‌ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  దీంతో అధికార పార్టీ నేతలు పులివెందులలో బూత్‌లను ఆక్రమించి యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. 

ఇందుకు ఆధారాలు సమర్పించినా ఎన్నికల సంఘం స్పందించ లేదు. అధికార పార్టీతో కుమ్మక్కైన అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా  కంటి తుడుపు చర్యగా కేవలం నాలుగు వార్డుల్లోనే రీపోలింగ్‌కు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల సంఘం తన రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించడంలో దారుణంగా విఫలమైంది.  అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్, వెబ్‌ కాస్టింగ్, ఇతర ఆధారాలను పరిశీలిస్తే అధికార పార్టీ అక్రమాలు వెలుగులోకి వస్తాయి. ఇందుకుగాను  సీసీటీవీ ఫుటేజ్, వెబ్‌కాస్టింగ్‌ రికార్డులను భద్రపరచాలి. 

ఓటు హక్కును వినియోగించుకోలేకపోయిన నిజమైన ఓటర్లు
పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతారని ముందే ఫిర్యాదులు చేసినా అటు పోలీసులు, ఇటు ఎన్నికల అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో పోలింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే పోలింగ్‌ స్టేషన్లు పూర్తిగా అధికార పార్టీ మద్దతుదారుల నియంత్రణలోకి వెళ్లిపోయాయి.  మొత్తం 70 బూత్‌లలో వైసీపీ పోలింగ్‌ ఏజెంట్లు లేకుండా బయటకు నెట్టివేశారు. వారి నియామక పత్రాలను చింపివేశారు. 

అన్ని వార్డుల్లో అధికార పార్టీ నాయకులు, బయటి ప్రాంతాల నుండి వచ్చిన వ్యక్తులు పోలింగ్‌ కేంద్రాల వద్ద కర్రలు, రాడ్లతో దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేని వ్యక్తులు, నిజమైన ఓటర్లు కానివారు పోలింగ్‌ స్టేషన్లలోకి ప్రవేశించి, నిజమైన ఓటర్లకు బదులుగా దొంగ ఓట్లు వేసినప్పటికీ పోలింగ్‌ సిబ్బంది, పోలీసులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.  అంతిమంగా ఓటర్లను, వైఎస్సార్‌సీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేశారు.  దీనివల్ల భారీ సంఖ్యలో నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. 

వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమంగా నిర్బంధించారు
అధికార పార్టీ నాయకుల సూచన మేరకు, పోలీసు అధికారులు పిటిషనర్లతో పాటు వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు ముఖ్య నాయకులను, కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించారు. దీనివల్ల వారు పోలింగ్‌ స్టేషన్లకు చేరుకోలేకపోయారు. తద్వారా పెద్ద ఎత్తున జరుగుతున్న ఎన్నికల అక్రమాలను ప్రశ్నించలేకపోయారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద జరుగుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలను గ్రామస్తులు,  వైఎస్సార్‌సీపీ  పోలింగ్‌ ఏజెంట్లు వీడియో తీయకుండా అధికార పార్టీ మద్దతుదారులు, కొందరు పోలీసు అధికారుల ప్రత్యక్ష సహకారంతో అడ్డుకున్నారు. 

ఈ రకమైన అడ్డంకుల వెనుక ప్రధాన ఉద్దేశం చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు రికార్డు కాకుండా, ఎలక్ట్రానిక్, సోషల్‌ మీడియాలో ప్రచారం కాకుండా అణచివేయడమే. అయినప్పటికీ, కొంతమంది గ్రామస్తులు, మీడియా సిబ్బంది ధైర్యంగా.. అధికార పార్టీ నేతలు నిజమైన ఓటర్లను అడ్డుకోవడం, భౌతికంగా బెదిరించడం, పోలింగ్‌ ఏజెంట్లను బలవంతంగా బయటకు గెంటడం వంటి అక్రమాలను వీడియో రికార్డ్‌ చేయగలిగారు. 

అరాచకాలపై ఆర్వోకి వైఎస్‌ జగన్‌ ఫిర్యాదు
అధికార పార్టీ నేతల దురాగతాలపై, అధికారులు ముఖ్యంగా పోలీసుల నిర్లిప్తతపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా 70 మందికి పైగా పోలింగ్‌ ఏజెంట్లతో కలిసి పులివెందుల మున్సిపాలిటీ రిటర్నింగ్‌ అధికారికి 01.11.2026 లిఖితపూర్వక ఫిర్యాదు చేశారని సీనియర్‌ న్యాయవాది సుబ్రమణ్య శ్రీరాం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

పులివెందులలోని మొత్తం 80 పోలింగ్‌ బూత్‌లలో ఎన్నికలను రద్దుచేసి, రీ పోలింగ్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరారన్నారు. కడప కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థి బండి దీప్తి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌ రెడ్డి కూడా ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, బోగస్‌ ఓటింగ్, పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకోవడంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదులు సమర్పించారని తెలిపారు. అర్ధరాత్రి పోలీసుల సోదాలు, బెదిరింపులను కూడా శ్రీరాం కోర్టు దృష్టికి తెచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement