తెల్లవారుజాములోగా తీరం దాటుతుందని అధికారులు వెల్లడి
సోమవారం అర్ధరాత్రికి ఒంగోలుకు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వస్తున్న తుపాను
110 కిలోమీటర్ల వేగంతో గాలులు
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను సోమవారం అర్ధరాత్రి ఒంగోలుకు అతి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మంగళవారం తెల్లవారుజుములోగా ఒంగోలు వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం అర్ధరాత్రికి ఈ తుపాను ఒంగోలుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉందని, అప్పటికి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ క్రమంగా వేగాన్ని పెంచుకుంటోందని వాతావరణ శాఖ వర్గాలు వెల్లడించాయి. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపాయి.
వేగంగా కదిలిన తుపాను
సోమవారం ఉదయం నుంచి మురసు తుపాను వేగంగా కదిలి ఆ తర్వాత కొద్దిగా నెమ్మదించింది. ఉదయం గంటకు 22 కిలోమీటర్ల వేగంతో కదలగా మధ్యాహ్నానికి ఆ వేగం 14 కిలోమీటర్లకు తగ్గింది. సాయంత్రానికి వేగం గంటకు 12 కిలోమీటర్లకు తగ్గింది. రాత్రికి 13 కిలోమీటర్ల వేగానికి పెరిగింది. రాత్రికి ఇది కావలికి 70 కిలోమీటర్లు, నెల్లూరుకు 80 కిలోమీటర్లు, ఒంగోలుకు 90 కిలోమీటర్లు, బాపట్లకు 120 కిలోమీటర్లు, మచిలీపటా్ననికి 170 కిలోమీటర్లు, తిరుపతికి 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర తుపాను ఇదే వేగంతో కదులుతూ రాత్రి 11.30 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము 4 గంటల మధ్య ఒంగోలుకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.
ఇప్పటికే తీరం వెంబడి గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా అర్థరాత్రి వాటి వేగం 100 నుంచి 110 కిలోమీటర్లకు పెరుగుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తీవ్ర తుపానుగా మారినా సోమవారం రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల తప్ప ఎక్కడా పెద్దగా వర్షాలు కురవలేదు. మంగళవారం కూడా అక్కడక్కడా తప్ప విస్తృత భారీ వర్షాలకు ఆస్కారం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీరం దాటిన తర్వాత కొద్ది గంటల్లోనే తుపాను బలహీనపడే అవకాశం ఉంది.
కాకినాడలో 3 సెంటీమీటర్ల వర్షం
సోమవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. కాకినాడలో 3, నరసాపురంలో 2.2, తిరుపతిలో 1.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నేడు 8 ఇండిగో విమాన సర్వీసులు రద్దు
విమానాశ్రయం (గన్నవరం): మురసు తుపాను కారణంగా విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రతికూల వాతావరణ కారణంగా భద్రత రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. మంగళవారం ఇండిగోకు చెందిన ఎనిమిది విమానాలను రద్దు చేశారు.
అంతర్జాతీయ విమాన సర్వీస్ సింగపూర్, దేశీయ సర్వీస్‌లు న్యూఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కడప విమానాలు రద్దయ్యినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లడానికి ముందే సంబంధిత ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్లలో తమ విమానాల స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించారు. అలాగే సోమవారం 12 విమాన సర్వీసులను రద్దు చేశారు.


