న్యూఢిల్లీ: తన జీవితంలో జరిగిన సంఘటనలు, అనుభవాలను ఇతరులు చెప్పడం కంటే తన మాటల్లో తానే వివరించాలనే ఉద్దేశంతో ఆత్మకథ రాయాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వెల్లడించారు. తన జీవిత కథను ఇతరులు రాస్తున్నారని, వాటన్నింటినీ అనుసరిస్తూ ఉండాల్సిన అవసరం లేదని గతంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, తాను భావించేవారమని తెలిపారు. అయితే ఒకానొక సమయంలో తన కథను తానే చెప్పాలని అనిపించిందని పేర్కొన్నారు.
నా కథను నేనే చెప్పాలనుకున్నా..
సోనియా గాంధీ తన వ్యక్తిగత జ్ఞాపకాలతో రూపొందించిన బిలోంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం రాయడానికి గల కారణాలను శనివారం వివరించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలోని తన వ్యాఖ్యలను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేశారు. ‘‘చాలా ఏళ్ల క్రితమే రాజీవ్, నేను మా గురించి రాసిన విషయాలన్నింటినీ అనుసరిస్తూ ఉండటంలో అర్థం లేదని గ్రహించాం. అయితే నా పుస్తకంలో చెప్పినట్లుగా.. ఒకానొక సమయంలో నా జీవిత కథను నేనే చెప్పాలని అనిపించింది’’ అని సోనియా గాంధీ పేర్కొన్నారు.
తల్లికి రాహుల్ గాంధీ అభినందనలు
మరోవైపు లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ తన తల్లి జీవిత ప్రయాణాన్ని ప్రశంసించారు. ప్రజా జీవితంలో ఆరు దశాబ్దాలు గడిచినా ఆమె వ్యక్తిత్వం మారలేదని కొనియాడారు. ‘‘ప్రజా జీవితంలో 60 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ అదే వ్యక్తిత్వం. అమ్మా.. నిన్ను చూసి గర్విస్తున్నాను’’ అని ఎక్స్‌లో రాహుల్ గాంధీ రాసుకొచ్చారు.
తన తల్లి జీవితానికి మార్గనిర్దేశం చేసిన విలువల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘నేను పెరుగుతున్న సమయంలో నేర్చుకున్న విలువలు ఇప్పటికీ నాలో ఉన్నాయి. వాటికి కట్టుబడి ఉండేందుకు నా వంతు ప్రయత్నించాను. కుటుంబ సభ్యులు, స్నేహితుల పట్ల నిబద్ధత, ఇతరుల పట్ల నిజాయితీ, సానుభూతి, కర్తవ్యభావం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం.. ఈ విషయాల్లో 60 ఏళ్ల క్రితం రాజీవ్ కలిసిన వ్యక్తినే ఇప్పటికీ నేను’’ అని సోనియా చెప్పిన మాటలను రాహుల్ పంచుకున్నారు.
తన పుస్తకం కేవలం రాజీవ్ గాంధీతో తన ప్రేమకథ మాత్రమే కాదని సోనియా గతంలో ‘ది హిందూ’కు వివరించారు. రాజీవ్ కుటుంబంపై, ఆయనకు చెందిన దేశంపై తనకు ప్రేమ ఎలా పెరిగిందో, ఆ అనుబంధమే చివరకు తనను ప్రజా జీవితంలోకి ఎలా తీసుకొచ్చిందో ఈ పుస్తకంలో వివరించినట్లు తెలిపారు.


