సాక్షి,ఢిల్లీ: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ఇండియా కూటమి పీపుల్స్ ఇంపీచ్‌మెంట్ నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సీఎం రేవంత్ సహా పలువురు ఎంపీలు, విపక్ష నేతలు పాల్గొన్నారు.
ఇందులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. దేశంలో ఓటు హక్కుకు తీవ్ర ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కును కాపాడేందుకు ప్రతిపక్షాలన్నీ పోరాటం కొనసాగిస్తాయని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 కల్పించిన ఓటు హక్కును పరిరక్షించాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ పనిచేస్తున్నారని ఖర్గే తీవ్రంగా ఆరోపించారు. ఆయనను సీఈసీ పదవి నుంచి తొలగించాలని ఏడు నెలల క్రితమే ఉభయ సభల్లో 193 మంది ప్రతిపక్ష ఎంపీలు నోటీసులు ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు.
ప్రతిపక్ష పార్టీల ఓటర్ల పేర్లను తొలగించి అధికారాన్ని మళ్లీ వాళ్లే కొనసాగించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన విమర్శించారు. అంతేకాదు 145 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన తర్వాతే సీఈసీకి సంబంధించిన చట్టాన్ని ఆమోదించారని ఖర్గే ఆరోపించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు 40 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చారని, ఎస్ఐఆర్ ప్రక్రియలో అంతకంటే ఐదు రెట్లు ఎక్కువ మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఖర్గే పేర్కొన్నారు. ఓటర్లను చేర్చడం కంటే తొలగించడమే ఎస్ఐఆర్ లక్ష్యంగా మారిందని విమర్శిస్తూ, ఈ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఓట్ల చోరీకి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ప్రతిపక్ష ఎంపీలను నిర్బంధించడం, జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. తమ నిరసనలను రామ్‌లీలా మైదాన్‌లో కొనసాగిస్తామని ప్రకటించారు.
దళితులు, మహిళలు, పేదలు, అణగారిన వర్గాల ఓటు హక్కులను కాపాడటమే తమ పోరాట లక్ష్యమని ఖర్గే స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: ట్రంప్‌కు ఏమైంది? ర్యాలీలో కంటి సమస్య.. ఆరోగ్యంపై కలకలం


