ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా ‘ఇండియా’కూటమి నిర్ణయం
ఎస్‌ఐఆర్ పేరిట ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆగ్రహం
ఢిల్లీ వరకు రాకుండా ప్రజలను అడ్డుకుంటున్నారని మండిపాటు
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అభిశంసన కార్యక్రమాన్ని శనివారానికి వాయిదా వేసినట్లు ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి ప్రకటించింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా నగరంలో భారీ వర్షాల కారణంగా మరుసటి రోజుకు వాయిదా వేసినట్లు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై వస్తున్నాయని తెలిపారు.
ఓట్ల చోరీపై తాము చేస్తున్న నిరసనలు వేర్వేరు కాదని, అదంతా ఒక్కటేనని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఖర్గే నివాసం వద్ద విపక్ష కూటమి నాయకులతో కలిసి రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. సీఈసీ బహిరంగ అభిశంసనను వర్షం కారణంగా వాయిదా వేయాలని అందరం కలిసి నిర్ణయించినట్లు చెప్పారు. శనివారం ఇదే కార్యక్రమాన్ని యథాతథంగా నిర్వహిస్తామన్నారు.
నవంబర్ 1న రామ్‌లీలా మైదానం వరకు ‘చలో దిల్లీ’పాదయాత్ర చేపడుతున్నామని, ఇందులో రాజకీయ, రాజకీయేతర వర్గాలు పాల్గొనవచ్చని, అందరికీ స్వాగతం పలుకుతున్నామని స్పష్టంచేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) పేరిట ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానే‹శ్ కుమార్, ఆయన బృందం కలిసి విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఢిల్లీ వరకు రాకుండా అడ్డుకోవడానికి హోంమంత్రి కుతంత్రాలు సాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. తమ పార్టీ శ్రేణులకు, సామాన్య ప్రజలకు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
అందుకోసమే పోరాడుతున్నాం
దేశంలో ఏం జరుగుతోందో అందరూ గుర్తించాలని రాహుల్ గాంధీ కోరారు. అదానీ, అంబానీ, మోదీ, అమిత్ షా, మోహన్ భాగవత్‌లకు మేలు చేసేందుకు లక్షలాది మందికి హక్కులకు దూరం చేస్తూ, ఓటును దొంగిలిస్తున్నారని దుయ్యబట్టారు. దీనిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, మానసిక వేదన నెలకొన్నాయని చెప్పారు. హక్కుల కోసం నిరసన తెలపాలనుకునే ఎవరైనా తమతో చేతులు కలపవచ్చని సూచించారు. రాజ్యాంగాన్ని, ‘భారతదేశం’అనే భావనను, భారతీయులందరి అభిప్రాయానికి ప్రతీక అయిన ఓటు హక్కును కాపాడేందుకు పోరాడుతున్నామని రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి–హోంమంత్రి ద్వయం ఆదేశాల మేరకు భారత రాజ్యాంగాన్ని అత్యంత బహిరంగంగా, నిర్లజ్జగా నీరుగార్చి, దెబ్బతీసిన జ్ఞానేశ్ కుమార్ ని్రష్కమణకు సమయం వేగంగా దగ్గరపడుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు.


