ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులతో పాటు పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదం జరగడానికి ముందు టేకాఫ్ అయ్యే ముందు అందులోని ప్రయాణికుడు తీసుకున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. హెలికాప్టర్ టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఆ ప్రయాణికుడు చిరునవ్వుతో వీడియో రికార్డ్ చేశారు. అయితే, ఆ ప్రయాణమే ఆయనకు చివరి ప్రయాణంగా మారడం విషాదాన్ని నింపింది.
టేకాఫ్‌కు ముందు సెల్ఫీ వీడియో
మృతుల్లో ఒకరైన 41 ఏళ్ల ప్రతాప్ బచిహళ్లి నింగరాజు ఈ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశారు. బద్రీనాథ్ హెలిప్యాడ్ నుంచి డెహ్రాడూన్‌కు వెళ్లేందుకు హెలికాప్టర్ సిద్ధమవుతున్న సమయంలో ఆయన ఈ వీడియో తీశారు. వీడియోలో నింగరాజు చిరునవ్వుతో కనిపిస్తున్నారు. ఈ వీడియో హెలికాప్టర్ ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత బయటకు వచ్చింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులతో పాటు హెలికాప్టర్ పైలట్ హిమాంశు సబర్వాల్ మరణించారు. మృతులను ప్రతాప్ బచిహళ్లి నింగరాజు, అరుణ్ సాలుంఖే, సుధీర్ కె., హెచ్.ఎస్. నటరాజ్, శంకర్‌గౌడ వి.బి.గా గుర్తించారు. వీరంతా కర్ణాటకలోని బెంగళూరుకు చెందినవారు. పైలట్ హిమాంశు సబర్వాల్ ఢిల్లీ నివాసి.
ఏం జరిగింది?
ఎం/ఎస్ ట్రాన్స్ భారత్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న ఈ హెలికాప్టర్ మధ్యాహ్నం సుమారు 1.14 గంటలకు బద్రీనాథ్ నుంచి బయలుదేరింది. ఆ సమయంలో ప్రాంతంలో మంచు కురుస్తోంది. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హాథీ పర్వత్ ప్రాంతం సమీపంలో అధికారులతో సంబంధాలు తెగిపోయాయి.
చివరకు మధ్యాహ్నం సుమారు 2.20 గంటల సమయంలో జోషిమఠ్ పరిధిలోని చాయ్ గ్రామం సమీపంలో కొండ వాలుపై హెలికాప్టర్ కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా ప్రమాదానికి గురై అందులో ఉన్న ఆరుగురూ మరణించారు.
దర్యాప్తు ప్రారంభం
ఈ ఘటనపై ప్రాథమిక అంచనా వేయడానికి భారత విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) ప్రత్యేక బృందాన్ని డెహ్రాడూన్‌కు పంపించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను పూర్తిస్థాయిలో విచారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పదేళ్లలో 12 హెలికాప్టర్ ప్రమాదాలు
ఉత్తరాఖండ్‌లో తాజాగా జరిగిన ఈ ప్రమాదం గత పదేళ్లలో చోటుచేసుకున్న హెలికాప్టర్ ప్రమాదాల పరంపరలో మరో విషాద ఘటనగా నిలిచింది. 2016 నుంచి 2026 వరకు రాష్ట్రంలో శుక్రవారం జరిగిన ప్రమాదంతో కలిపి మొత్తం 13 హెలికాప్టర్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వీటిలో ఆరు ప్రమాదాల్లో కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఏడు ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. తాజాగా జరిగిన ప్రమాదంలో ఆరుగురు మరణించడంతో మరోసారి హెలికాప్టర్ ప్రయాణాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: తుకారం ముండే ఎంట్రీతో


