ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
గుజరాత్ రూ.14,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం
పీఎం–కిసాన్ 24వ విడత నిధులు విడుదల
దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ప్రతిపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయని ధ్వజం
భిల్దీ: తుదిశ్వాస విడిచే దాకా దేశ ప్రజలకు సేవలందిస్తూనే ఉంటానని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ప్రతిపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయని, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఎరువులు, వంటగ్యాస్ లభ్యతపై భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’నిర్మాణానికి రైతులు, యువత, మహిళలు ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. కానీ, మన దేశ ప్రగతి కొందరికి నచ్చడం లేదని, అసౌకర్యంగా భావిస్తున్నారని విమర్శించారు.
ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు చేరుకున్నారు. తొలిరోజు బనస్కాంత జిల్లాలోని భిల్దీ పట్టణంలో భారత్ బోవైన్ బ్రీడింగ్, రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించారు. స్వదేశీ పశువుల జాతులను మెరుగుపరచడం, పాల ఉత్పత్తిని పెంచడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం. 127 ఎకరాల విస్తీర్ణంలో రూ.325 కోట్ల వ్యయంతో బనాస్ డెయిరీ ఈ కేంద్రాన్ని నిర్మించింది. అలాగే రూ.14,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను సైతం మోదీ ప్రారంభించారు.
మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) 24వ విడత నిధులు కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగించారు. దేశ సేవకే తన జీవితం అంకితమని ఉద్ఘాటించారు. ప్రతిపక్షాల తీరుపై ధ్వజమెత్తారు. దేశం కష్టాల్లోనే ఉండాలని కోరుకునే వ్యక్తులు కొందరు ఉన్నారని విమర్శించారు. దేశం ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు వారు ఆనందం పొందుతారని, దేశానికి ఏదైనా సంక్షోభం ఎదురైనప్పుడల్లా వారు అందులో సంతోషాన్ని వెతుక్కుంటారని దుయ్యబట్టారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే...
నన్ను అప్రతిష్టపాలు చేయడానికి కుట్రలు
‘‘పశ్చిమాసియాలో చాలారోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. యుద్ధం వల్ల తలెత్తిన పరిస్థితులను ఎదుర్కోవడంలో మన దేశం మొత్తం ఏకతాటిపై నిలుస్తోంది. కొందరు వ్యక్తులు మాత్రం పుకార్లు వ్యాప్తి చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఎరువులు దొరకవంటూ రైతులను భయపెట్టారు. ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించారు. నన్ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించాయి.
వంటగ్యాస్ విషయంలోనూ తప్పుడు ప్రచారం సాగించారు. మహిళలను భయపెట్టాలని చూశారు. మోదీకి చెడ్డపేరు తీసుకురావాలన్న కుట్రతో దేశమంతటా గందరగోళం సృష్టించడమే ప్రతిపక్షాల పని. ప్రజలకు అండగా నిలుస్తానని నేను హమీ ఇచ్చాను. పశ్చిమాసియాలో సంఘర్షణ కొనసాగుతున్నప్పటికీ మన రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు, వాటి తయారీకి అవసరమైన రసాయనాల వ్యయాలు భారీగా పెరిగాయి. ఆ అదనపు భారం మన రైతులపై పడకుండా చూస్తున్నాం.
రైతులకు రూ.24 లక్షల కోట్లు
పీఎం–కిసాన్ పథకం కింద 24వ విడతలో భాగంగా సుమారు 10 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.18,000 కోట్లకు పైగా నగదును బదిలీ చేశాం. 2019 ప్రారంభంలో ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు రైతులకు సుమారు రూ.4.5 లక్షల కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి బదిలీ చేశాం. ఎరువుల ధరల పెరుగుదల నుంచి రైతులను కాపాడేందుకు ప్రభుత్వం రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేసింది.
గత 12 ఏళ్లలో కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) విధానం ద్వారా గోధుమలు, వరి సాగు చేసే రైతులకు రూ.24 లక్షల కోట్లు అందాయి’’అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. భిల్దీ పట్టణంలో ప్రధానమంత్రి పాల్గొన్న బహిరంగ సభలో నిర్వాహకులు ప్రజల కోసం కుర్చిలకు బదులుగా చార్పాయిలను(మంచాలను) ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటును మోదీ అభినందించారు. తాను ప్రసంగించిన సభల్లో ఇదే అతిపెద్ద ‘చార్పాయి సభ’కావొచ్చని చెప్పారు.
భిల్దీలో మోదీ రోడ్ షో
ప్రధాని మోదీ భిల్దీ టౌన్‌లో శుక్రవారం రోడ్ షోలో పాల్గొన్నారు. హెలిప్యాడ్ నుంచి బనాస్ డెయిరీ ప్లాంట్ వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. మోదీ వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్‡్ష సంఘవి కూడా ఉన్నారు. జనం రోడ్డుకు ఇరువైపులా నిల్చొని మోదీకి స్వాగతం పలికారు. ఆయన వారికి అభివాదం చేస్తూ ఓపెన్ టాప్ జీపులో ముందుకు సాగారు. ‘భారత్ అభివృద్ధి చెందేవరకూ మోదీ ఎక్కడికీ వెళ్లరు’అని రాసి ఉన్న ప్లకార్డులను జనం ప్రదర్శించారు.


