నేడు జ్ఞానేశ్‌ కుమార్‌ ‘అభిశంసన’  | Congress president Mallikarjun Kharge called Chief Election Commissioner Gyanesh Kumar | Sakshi
Sakshi News home page

నేడు జ్ఞానేశ్‌ కుమార్‌ ‘అభిశంసన’ 

Oct 30 2026 4:09 AM | Updated on Oct 30 2026 4:09 AM

Congress president Mallikarjun Kharge called Chief Election Commissioner Gyanesh Kumar

ఢిల్లీలో ఖర్గే నివాసంలో మాక్‌ పార్లమెంట్‌  

సభాపతిగా వ్యవహరించనున్న మీరా కుమార్‌

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ను ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి శుక్రవారం బహిరంగంగా అభిశంసించబోతోంది. ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మాక్‌ పార్లమెంట్, అభిశంసన కార్యక్రమం నిర్వహించబోతున్నారు. సీఈసీ అభిశంసనకు లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ సభాపతిగా వ్యవహరిస్తారు. ఖర్గే ప్రారం¿ోపన్యాసం చేస్తారు. జ్ఞానేశ్‌కు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారు. 

తీర్మానాన్ని ఆమోదించడానికి ముందు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. విపక్ష కూటమి నేతలు గురువారం ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై చేపట్టబోయే అభిశంసన ఏర్పాట్లపై చర్చించారు. కాంగ్రెస్‌ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, జైరామ్‌ రమేశ్, కేసీ వేణుగోపాల్, మీరా కుమార్, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డెరెక్‌ ఓబ్రెయిన్, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు హరేంద్ర మాలిక్, జేఎంఎం సభ్యుడు మహువా మాఝీ, సీపీఎం నేత జాన్‌ బ్రిట్టాస్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఓట్ల చోరీపై పోరాటం కొనసాగిస్తామని ఖర్గే తేల్చిచెప్పారు. శుక్రవారం మాక్‌ పార్లమెంట్‌ నిర్వహించబోతున్నామని, నవంబర్‌ 1న భారీ ర్యాలీ చేపట్టబోతున్నామని పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రజలు ఢిల్లీకి తరలివస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో పోరాడకపోతే ప్రజల్లో చైతన్యం రాదని ఉద్ఘాటించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌)లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, సీఈసీని పదవి నుంచి తప్పించాలని విపక్ష కూటమి డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. జ్ఞానేశ్‌ కుమార్‌ను అభిశంసించాలని పార్లమెంట్‌లో విపక్షాలు నోటీసు ఇవ్వగా, స్పీకర్‌ అంగీకరించలేదు. అందుకే మాక్‌ పార్లమెంట్‌ నిర్వహించి, అందరి సమక్షంలో బహిరంగంగా అభిశంసించాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement