ప్రభుత్వానికి జస్టిస్‌ చంద్రచూడ్‌ అతి విధేయత చూపించారు  | Ex-CJI Chandrachud was too deferential to Centre in judicial appointments | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి జస్టిస్‌ చంద్రచూడ్‌ అతి విధేయత చూపించారు 

Oct 26 2026 3:17 AM | Updated on Oct 26 2026 4:07 AM

Ex-CJI Chandrachud was too deferential to Centre in judicial appointments

త్వరలో విడుదల కానున్న ‘ఆత్మకథ’లో జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ సంచలన వ్యాఖ్యలు

కార్యనిర్వాహక వర్గం ఒత్తిడిని కొలీజియం తప్పక ప్రతిఘటించాలి

ప్రభుత్వంతో ముందస్తు చర్చల ద్వారా న్యాయమూర్తుల పేర్లను ఖరారు చేసే పద్ధతి తయారైందని ధ్వజం

న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకాల విషయంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అనుసరించిన వైఖరిని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వానికి ఆయన మరీ ఎక్కువ విధేయత చూపించారని ఆక్షేపించారు. త్వరలో విడుదల కానున్న తన ఆత్మకథ ‘వితౌట్‌ ఫియర్‌ ఆర్‌ ఫేవర్‌’అనే పుస్తకంలో జస్టిస్‌ కౌల్‌ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 

సుప్రీంకోర్టులో ఆరు ఖాళీలను భర్తీ చేయడానికి జరిగిన కొలీజియం సమావేశం గురించి ప్రత్యేకంగా వివరించారు. ముందుగానే ఐదు పేర్లను ఖరారు చేయగా, జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆరో అభ్యర్థిని ప్రతిపాదించి, ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిశీలించాలని భావించారని చెప్పారు. ఆయన తనను ఒక ప్రత్యేక గదిలోకి తీసుకువెళ్లి, ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఫోన్‌ చేయాలా వద్దా అని ఆలోచించారని కౌల్‌ తన పుస్తకంలో రాశారు. కొలీజియం అధికారికంగా చర్చించకముందే ప్రభుత్వ నుంచి ఆమోదం పొందాలనుకోవడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. 

కొలీజియంలో జరిగే సంప్రదింపులకు, ప్రభుత్వంతో మాట్లాడడమే ఒక అనుమతిగా భావించడానికి మధ్య తేడా ఉందన్నారు.   న్యాయమూర్తిగా తన జ్ఞాపకాల గురించి ‘ది వైర్‌’అనే న్యూస్‌ పోర్టల్‌తో జస్టిస్‌ కౌల్‌ మాట్లాడారు. న్యాయ వ్యవస్థ స్వాతంత్య్రాన్ని కాపాడటానికి కార్యనిర్వాహక వర్గం ఒత్తిడిని కొలీజియం తప్పక ప్రతిఘటించాలని స్పష్టంచేశారు. న్యాయం చేకూర్చే లక్ష్యాన్ని సాధించడంలో ఒకవైపు న్యాయపరమైన అంశాలు, మరోవైపు పరిపాలనాపరమైన అంశాలు ఉంటాయని గుర్తుచేశారు. జస్టిస్‌ చంద్రచూడ్‌కు మేధోపరమైన సామర్థ్యం, కష్టపడే తత్వం ఉన్నట్లు నమ్ముతున్నానని తెలిపారు. 

కానీ, ప్రభుత్వంతో సంప్రదింపులు, సహకారం విషయంలో ఆయన అవసరమైన దానికంటే ఎక్కువగా విధేయత చూపించినట్లు తాను భావిస్తున్నానని స్పష్టంచేశారు. పరిపాలనాపరమైన అంశాలపై ప్రభుత్వంతో మరీ ఎక్కువ చర్చలు జరిగాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రయత్నించారా? అని ప్రశ్నించగా.. ఇది ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే అంశంగా తాను అనుకోవడం లేదని జస్టిస్‌ కౌల్‌ బదులిచ్చారు. వాస్తవానికి ఆయన ఆ పేర్ల గురించి అంతకుముందే తనతో చర్చించారని చెప్పారు. 

ఐదు పేర్ల విషయంలో అంగీకారానికి వచ్చామని, కొలీజియంలోని ఇతర సభ్యులకు కూడా ఈ పేర్ల పట్ల అభ్యంతరం ఉండదని భావించానని తెలిపారు. అయితే, కొలీజియం సమావేశానికి వెళ్తున్న తరుణంలో చివరి నిమిషంలో ఆరో పేరును తన ముందు ఉంచారని గుర్తుచేసుకున్నారు. ఆ పేరు తనకు ఆమోదయోగ్యం కాదని స్పష్టంగా చెప్పానని వెల్లడించారు. నేను సహకరించాలని, ఆ పేరుతోనే ముందుకు వెళ్లాలని జస్టిస్‌ చంద్రచూడ్‌ కోరారని పేర్కొన్నారు. తాను అలా చేసినా కొలీజియంలోని మిగిలినవారు అంగీకరించరని చెప్పానని, సమావేశంలో సరిగ్గా అదే జరిగిందని స్పష్టంచేశారు. 

ఇది ఆమోదం పొందదని జస్టిస్‌ చంద్రచూడ్‌ దృష్టికి తీసుకెళ్లాలని వివరించారు. బహుశా ఆయన ఆరో పేరుతో సహా మిగిలిన పేర్ల విషయంలో అప్పటికే ఏదో ఒక అనుమతి తీసుకుని ఉండవచ్చని అనుమానం వ్యక్తంచేశారు. దురదృష్టవశాత్తూ, ప్రభుత్వంతో ముందస్తు చర్చల ద్వారా పేర్లను ఖరారు చేసే పద్ధతి ఒకటి తయారైందని వాపోయారు. ఇదే తనను కలవరపెడుతోందని వ్యాఖ్యానించారు. 2015లో ప్రభుత్వం నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ను ప్రవేశపెట్టినప్పుడు.. మనం ఒకచోట కూర్చొని దాని గురించి చర్చించి ఉండాల్సింది. దానిని మరింత మెరుగుపరిచే అవకాశం ఉండేదని, అవసరమైన మార్పులు చేర్పులు చేసే వీలుండేదంటూ ఒకచోట రాశానని వెల్లడించారు.  

ప్రభుత్వంతో వ్యవహరించేటప్పుడు దృఢంగా ఉండాలి  
జస్టిస్‌ చంద్రచూడ్‌ పట్ల ఎన్నో అంచనాలు ఉండేవని జస్టిస్‌ కౌల్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా జస్టిస్‌ చంద్రచూడ్‌ పదవీకాలం ప్రారంభంలోనే ‘మీకు సహాయపడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’అంటూ ఆయనతో చెప్పానని తెలిపారు. ప్రధాన న్యాయమూర్తిని పదేపదే విమర్శించడం లేదా ఇబ్బంది పెట్టడం రెండో న్యాయమూర్తి పని అని తాను ఏనాడూ భావించలేదన్నారు. 

ప్రభుత్వంతో వ్యవహరించేటప్పుడు, ముఖ్యంగా న్యాయమూర్తుల నియామకాల విషయంలో మనం మరింత దృఢంగా ఉండాలని, ఇదే తన అభిప్రాయమని జస్టిస్‌ కౌల్‌ తేల్చిచెప్పారు. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన మునుపటి తీర్పును దృష్టిలో ఉంచుకొని.. న్యాయ నియామకాల కోసం కాలపరిమితులను నిర్దేశించడానికి ప్రయత్నించామని వెల్లడించారు. 

దీనిపై ధిక్కార పిటిషన్‌ దాఖలైందని అన్నారు. దానిని ధిక్కార పిటిషన్‌గా కాకుండా న్యాయమూర్తుల నియామకాల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసేలా చూడమని జారీ చేసిన నోటీసుగా భావించానని తెలిపారు. జస్టిస్‌ కౌల్‌ 2023 డిసెంబర్‌లో పదవీ విరమణ చేశారు. కార్యనిర్వాహక వర్గంతో వ్యవహరించే విషయంలో వచ్చిన భేదాభిప్రాయాలు, తాను 2022 జూన్‌ నుంచి కొలీజియంలో కలిసి పనిచేసిన జస్టిస్‌ చంద్రచూడ్‌తో తన సంబంధాలను దెబ్బతీశాయని వెల్లడించారు. 

సుప్రీంకోర్టులో జడ్జీల నియామకాలు చేపట్టే ముందు ప్రభుత్వం ఒక నిర్దిష్ట పద్ధతికి అలవాటు పడిపోతుందని తాను భావించానని, అందుకే ప్రతి విషయాన్ని ముందే చర్చించకుండా ఉండేలా చూడటానికి ప్రయత్నించానని జస్టిస్‌ కౌల్‌ చెప్పారు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టానికి  (పీఎంఎల్‌ఏ) సంబంధించిన తీర్పులో ని అంశాల పునఃపరిశీలనకు సంబంధించిన కేసును తాను అధ్యక్షత వహించిన బెంచ్‌ నుంచి మరో బెంచ్‌కు బదిలీ చేయడంపై తన అభ్యంతరాలను కూడా ఆయన వెల్లడించారు. కేసుల్లో తీర్పు ఎలా ఉంటుందోనన్న భయాల కారణంగా వాటిని బెంచ్‌ల మధ్య బదిలీ చేయకూడదని అభిప్రాయపడ్డారు.  

న్యాయ వ్యవస్థ స్వతంత్రంగాపని చేయాలి: కాంగ్రెస్‌ 
ఇంకా విడుదల కాని జస్టిస్‌ కౌల్‌ ఆత్మకథ పుస్తకాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం ఒక ప్రకటన చేసింది. ‘‘మోదీ ప్రభుత్వ హయాంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఇది తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది’’అని పేర్కొంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగిన న్యాయ వ్యవస్థ అధికారంలో ఉన్నవారి ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని తేల్చిచెప్పింది. ‘‘న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వ జోక్యం, కొలీజియం సమావేశాలకు ముందే ప్రభుత్వ ఆమోదం పొందే ప్రయత్నాలు, మైనారిటీ వర్గానికి చెందిన న్యాయమూర్తి కులాన్ని ప్రభుత్వం అసంబద్ధంగా ప్రశ్నించడం వంటి అనేక ఆందోళనకరమైన సంఘటనలను జస్టిస్‌ కౌల్‌ బహిర్గతం చేశారు’’అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement