ఎస్‌ఐఆర్‌లో అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపిస్తాం
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరిక
మోదీ ఎక్కడికీ వెళ్లరంటూ సభలో అరిచిన ఓ వ్యక్తి
మోదీ తండ్రి కూడా వెళ్తాడంటూ ఖర్గే ఆగ్రహం
ఖండించిన బీజేపీ నేతలు, ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్
పట్నా: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహనం కోల్పోయారు. ఒక్కసారిగా ఆవేశానికి లోనయ్యారు. ప్రధాని మోదీ పట్ల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. బీజేపీ నాయకులు ఖర్గేపై విరుచుకుపడ్డారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం బిహార్ రాజధాని పట్నాలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ శ్రీకృష్ణ సింగ్ జయంతి కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)లో అక్రమాలకు పాల్పడిన వారిని కచ్చితంగా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఇంతలో సభలో ఓ వ్యక్తి గట్టిగా అరిచాడు.‘మోదీ ఎక్కడికీ వెళ్లరు’అంటూ వ్యాఖ్యానించాడు. దాంతో ఖర్గే అతడిపై మండిపడ్డారు. మోదీ కా బాప్ భీ జాయేగా(మోదీ తండ్రి కూడా వెళ్తాడు) అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. నల్లధనాన్ని తిరిగి తీసుకొస్తానని మాట ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. రాష్రీ్టయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సిద్ధాంతాన్ని ఖర్గే తప్పుపట్టారు.
సంఘ్ సిద్ధాంతం కొనసాగుతున్నంత కాలం ఈ దేశంలో శాంతి ఉండదని తేల్చిచెప్పారు. తన ప్రసంగం సందర్భంగా, మతపరమైన ఉద్రిక్తతలకు ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతమే కారణమని ఖర్గే వాదించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావం దేశంలో కొనసాగుతున్నంత కాలం శాంతి లభించడం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు రాజ్యాంగ వ్యతిరేక దృక్పథాలను కలిగి ఉన్నాయని విమర్శించారు. ముఖ్యంగా అస్పృశ్యత విషయంలో వాటి వైఖరి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని ఆరోపించారు. ఇప్పటికి కూడా ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీల్లో అస్పృశ్యతను సమర్థించేవారు చాలామంది ఉన్నారని ఆక్షేపించారు.
ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను ‘రెండో స్వాతంత్య్ర పోరాటం’గా ఖర్గే అభివరి్ణంచారు. ఈ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, గత రెండేళ్లలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు ఉపయోగించాలని అన్నారు. పశ్చిమ బెంగాల్, హరియాణా, బిహార్, మహారాష్ట్రలలో ‘ఓట్ల చోరీ’ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను తొలగించాలని స్పష్టంచేశారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ హక్కుల కోసం పోరాడాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే: బీజేపీ
మోదీ పట్ల ఖర్గే చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, చిరాగ్ పాశ్వాన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర తదితరులు స్పందించారు. నరేంద్ర మోదీ తండ్రికి వ్యతిరేకంగా ఖర్గే చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రధాని కుటుంబం పట్ల కాంగ్రెస్‌కు దురభిప్రాయం ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు.
ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? లేక కాంగ్రెస్ అభిప్రాయాలా? అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పెద్దలు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఖర్గే మాటలను ‘నేరం’గా అభివరి్ణంచారు. ప్రధాని తండ్రిపై ఉపయోగించిన అవమానకరమైన భాషకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. మర్యాదకు సంబంధించిన అన్ని హద్దులను ఖర్గే దాటేశారని అమిత్ షా దుయ్యబట్టారు.
గత 12 ఏళ్లుగా వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో కాంగ్రెస్ నేతల్లో నిరాశ నెలకొందని, అందుకే ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారని ఆరోపించారు. మోదీతోపాటు ఆయన కుటుంబంపై పదేపదే అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తున్నారని తప్పుపట్టారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీతోపాటు జేడీ(యూ), లోక్ జనశక్తి పారీ్ట(రామ్ విలాస్), హిందుస్థానీ అవామ్ మోర్చాలకు చెందిన సీనియర్ నాయకులు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ‘గూండాలు, దుండగులు ఉపయోగించే తరహా’భాషను వాడుతున్నారని విమర్శించారు.
దళితుడని అవమానిస్తున్నారు: కాంగ్రెస్
ఖర్గేను కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా సమర్థించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు కాంగ్రెస్ అధ్యక్షుడిని పదేపదే అవమానిస్తున్నాయని ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో ఖర్గే పాల్గొన్న కాంగ్రెస్ ర్యాలీ అనంతరం వేదికపై నిర్వహించిన బీజేపీ శుద్ధి కార్యక్రమాన్ని ప్రస్తావించారు. ఖర్గే దళితుడు కాబట్టే వేదికను శుద్ధి చేశారని ఆక్షేపించారు. మోదీ, అమిత్ షాల ఆదేశాల మేరకే ఖర్గేను అవమానిస్తున్నారని పేర్కొన్నారు. భూపేష్ బఘేల్ సైతం ఖర్గేకు అండగా నిలిచారు. పట్నాలో జరిగిన కార్యక్రమంలోని సందర్భాన్ని బట్టి ఖర్గే చేసి న వ్యాఖ్యలను చూడాలని చెప్పారు. ప్రధాని రాజకీయ ప్రత్యర్థులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు పట్టించుకోని బీజేపీ ఇప్పుడు ఖర్గే వాడిన భాషపై ఎందుకు అభ్యంతరం అని ప్రశ్నించారు.
నేడు దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలు
ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన ‘అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం దేశవ్యాప్త ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో భారీగా నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.


