కోపమొచ్చినా.. గుండె ‘పగులుతుంది’! | anger, fear and shock can temporarily stun the heart says AIIMS Cardiologist | Sakshi
Sakshi News home page

కోపమొచ్చినా.. గుండె ‘పగులుతుంది’!

Oct 26 2026 3:47 AM | Updated on Oct 26 2026 4:04 AM

anger, fear and shock can temporarily stun the heart says AIIMS Cardiologist

టాకుట్స్‌బో కార్డియో మయోపతి అంటారు దీన్ని!

అరుదైన ఆరోగ్య సమస్య

గుండెజబ్బును పోలిన లక్షణాలు

హెచ్చరిస్తున్న వైద్యులు!

గుండె పగిలేలా ఏడ్చాడు!... ఆప్తుల మరణం, దూరం కావడం వంటి సందర్భాల్లో తరచూ ఈ పదం వినిపిస్తూంటుంది. తీవ్రమైన బాధను వ్యక్తం చేసేందుకు వాడతారని అనుకునేరు. వైద్య పరిభాషలోనూ ఇది అక్షరసత్యం. బాధ ఒక్కటే కాదు.. విపరీతమైన కోపం, భయం, షాక్‌ లాంటివి కూడా గుండెను పగిలిపోయేలా చేస్తాయని కొంచెం అరుదైన ఈ విషయాన్నే టాకుట్స్‌బో కార్డియో మయోపతి అంటారని నిపుణులు చెబుతున్నారు.  

భావోద్వేగపూరిత ఘటనలకు, ఒత్తిడికి, గుండెకు మధ్య దగ్గరి సంబంధాలున్నాయని ఈ టాకుట్స్‌బో కార్డియో మయోపతి చెబుతోంది. శరీరానికి పెద్ద గాయ మైనా.. లేదా భావేద్వేగాలు చుట్టుముట్టినా.. ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు అకస్మాత్తుగా పెరిగిపోతాయి. శక్తిమంతమైన హార్మోన్‌ అడ్రినలిన్‌ విడుదలైనప్పుడు గుండెకండరాలకు కుంచించుకుపోయే సామర్థ్యం తాత్కాలికంగా తగ్గిపోతుందని అంటున్నారు ఢిల్లీలోని ఎయిమ్స్‌ కార్డియాలజీ విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ రాజీవ్‌ నారంగ్‌. అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి, ఊపిరిఆడకపోవడం, చమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలతో ఇది గుండెజబ్బును పోలే లక్షణాలను చూపుతూంటుందని ఆయన తెలిపారు. 

ఇలాంటి సందర్భాల్లో ఈసీజీ తీసినా అది అచ్చం గుండెజబ్బు లక్షణాలనే చూపుతుందన్నారు. అయి తే వైద్యులు గుండె రక్తనాళాల్లో పూడికలేవీ లేవని నిర్ధారించుకున్న తరువాత అది గుండెజబ్బు కాదు.. టాకుట్స్‌బో కార్డియో మయోపతి అని తెలుసు కోగలుగుతారని చెప్పారు. గుండెజబ్బు లక్షణాలే కనిపిస్తున్నాయి కానీ ఇది ఒత్తిడితో వచ్చి ఉంటుందని నిర్లక్ష్యం చేయడం సరికాదని డాక్టర్‌ నారంగ్‌ స్పష్టం చేశారు. ఈసీజీలో తొలుత గుండెజబ్బు లక్షణాలు కనిపించాయి కాబట్టి వైద్య సమీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. టాకుట్స్‌బో కార్డియో మయోపతితో బాధ పడేవారు చాలామంది సమయం గడుస్తున్న కొద్దీ సాధారణ స్థితికి చేరుకుంటారని, గుండెజబ్బు వచ్చిన వారితో పోలిస్తే వీరికి దీర్ఘకాలంలో జరిగే నష్టమూ తక్కువే నని వివరించారు.

తెలియని కారణాలు..
టాకుట్స్‌బో కార్డియో మయోపతికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? సముద్రంలో అక్టోపస్‌లు పట్టేందుకు జపనీయులు వాడే ప్రత్యేక ఆకార మున్న కుండ ఈ టాకుట్స్‌బో. సముద్రగర్భంలో వీటిని ఏర్పాటు చేస్తారు. లోపలిభాగంలో ఉన్న ఖాళీలోకి ఆక్టోపస్‌లు వచ్చి చేరతాయి. అక్కడే పెరుగుతాయి. ఈ కుండలన్నింటినీ తాళ్లతో కట్టి ఉంటారు కాబట్టి... పైకి లాగేసి ఆక్టోపస్‌లను సేకరిస్తా రన్నమాట. దానికి... గుండెకు సంబంధం ఏమిటంటారా? ఉద్వేగపూరిత క్షణాల్లో గుండెలోని ఒక భాగం అక్టోపస్‌లను పట్టే కుండ మాదిరిగా ఉబ్బిపోతుంది. అందుకన్నమాట. అయితే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందన్నది పూర్తిగా తెలియదు. అకస్మాత్తుగా పెరిగిపోయే హార్మోన్లు గుండె కండరాలను షాక్‌కు గురి చేయడం వల్ల కావచ్చునని కోల్‌కతాలోని బి.ఎం.బిర్లా గుండె ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ అంచన్‌ సియోటియా చెబుతున్నారు. 

కోపమొస్తేనే సమస్య కాదు...
కోపం, బాధ వంటివి వచ్చాయంటే టాకుట్స్‌బో కార్డియో మయోపతి వచ్చినట్లు కాదన్నది సుస్పష్టం. ఈ రకమైన భావోద్వేగాలు తీవ్రంగా ఉండటం.. తరచూ రావడం గుండె కొట్టుకునే తీరులో తేడాలు తీసుకొస్తాయి. అలాగే రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాలను అర్థం చేసుకోవాలని అంటున్నారు డాక్టర్‌ కులకర్ణి. రక్తనాళాల్లో పూడికవల్ల వచ్చే గుండెజబ్బు గుండె కండరాలను నాశనం చేస్తే.. టాకుట్స్‌బో కార్డియో మయోపతిలో కండరాలు తాత్కాలికంగా బలహీనమవుతాయని వివరించారు. తగిన వైద్యంతో కొన్ని రోజుల్లో ఆరోగ్యం కుదుటపడుతుందని, కాకపోతే ఎవరికి ఎన్ని రోజుల సమయం పడుతుందన్నది కచ్చితంగా చెప్పలేమని గురుగ్రామ్‌లోని పీబీ హెల్త్‌ ఆసుపత్రి కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ నీరజ్‌ కుమార్‌ తెలిపారు. ప్రతి ఛాతీ నొప్పిని టాకుట్స్‌బో కార్డియో మయో పతి అనుకుని బెంగపడినా అది భావోద్వేగానికి దారితీస్తుందని గుర్తించాలని వైద్యులు స్పష్టం చేశారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement