ఒడిశాకు చెందిన దినేశ్ తన కుటుంబ డెయిరీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. బెంగళూరులో రాపిడో బైక్ నడుపుతూ డబ్బు సంపాదించడంతో పాటు, తన భవిష్యత్ డెయిరీ ఉత్పత్తుల కోసం వినియోగదారుల అభిప్రాయాలను నేరుగా తెలుసుకుంటున్నాడు. దినేశ్ గతంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సీసీఐ)లో పనిచేశాడు. అయితే ఒడిశాలోని తన కుటుంబ డెయిరీ ఫార్మ్ ఆధారంగా వ్యాపారం ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదిలేశాడు.
వ్యాపారం ప్రారంభించే ముందు మార్కెట్‌లో వినియోగదారులకు ఏం కావాలో తెలుసుకోవాలని దినేశ్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం స్వగ్రామానికి వెళ్లకుండా బెంగళూరులో ఏడాది గడపాలని భావించాడు. ముఖ్యంగా తన భవిష్యత్ డెయిరీ ఉత్పత్తులకు లక్ష్య వినియోగదారులుగా భావిస్తున్న ఐటీ ఉద్యోగులతో మాట్లాడేందుకు రాపిడో రైడర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. రైడ్‌లో తనను కలిసిన వారిలో లక్ష్య వినియోగదారులు ఉన్నప్పుడు వారితో మాట్లాడుతున్నాడు. పాలు కాకుండా ఎలాంటి డెయిరీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు? ఎలాంటి ఉత్పత్తులు కావాలి? వంటి ప్రశ్నలు అడుగుతూ వారి అభిప్రాయాలను సేకరిస్తున్నాడు.
లింక్డ్‌ఇన్ యూజర్ వరుణ్ రాజ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. రైడ్ సమయంలో దినేశ్ తనను కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగాడని తెలిపారు. తన విధానాన్ని వివరిస్తూ దినేశ్.. ‘ఇలా చేస్తే డబ్బూ వస్తుంది.. ఫీడ్‌బ్యాక్ కూడా వస్తుంది’ అని చెప్పినట్లు రాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం దినేశ్ తన వ్యాపార నమూనాను రూపొందించుకునేందుకు ఏడాది సమయం కేటాయించుకున్నాడు. ఈ కాలంలో సంపాదనతో పాటు వినియోగదారుల అభిప్రాయాలను సేకరించి, ఆ తర్వాత ఒడిశాకు తిరిగి వెళ్లి డెయిరీ వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నాడు.
దినేశ్ ఆలోచనా విధానాన్ని లింక్డ్‌ఇన్ వినియోగదారులు ప్రశంసించారు. వినియోగదారులను నేరుగా కలిసి వారి అవసరాలు తెలుసుకోవడం అత్యంత వాస్తవికమైన మార్కెట్ పరిశోధన విధానమని పలువురు వ్యాఖ్యానించారు. పెద్ద వ్యాపార ప్రణాళికలు, మార్కెట్ నివేదికలకు బదులుగా నేరుగా కస్టమర్లతో మాట్లాడుతున్న దినేశ్ విధానం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కాల్ తీయగానే న్యూడ్ వీడియో.. ఖాతాలో 50 లక్షలు మాయం!


