ఓటుకు సరిహద్దు అడ్డంకులు! | Border barriers for Kotia tribal community for voting | Sakshi
Sakshi News home page

ఓటుకు సరిహద్దు అడ్డంకులు!

Nov 17 2026 12:59 PM | Updated on Nov 17 2026 1:10 PM

Border barriers for Kotia tribal community for voting

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి ఉన్న ముఖ్యమైన హక్కు. అయితే ఆంధ్రప్రదేశ్‌–ఒడిశా సరిహద్దులో నివసిస్తున్న కొటియా ఆదివాసీలకు మాత్రం ఓటు హక్కు రాజకీయ గుర్తింపు సమస్యగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగు తున్న సరిహద్దు వివాదం కారణంగా అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దులోని కొటియా ప్రాంతంలో మొత్తం 28 గ్రామాలు ఉన్నాయి. వాటిలో 21 గ్రామాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలకు ప్రత్యేకమైన భాష, సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. కానీ నేటికీ వారి గ్రామాల పరిపా లనా హక్కుల విషయంలో స్పష్టత లేకపోవడం విచారకరం.

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరువాత ఈ ప్రాంతంలోని గ్రామాలపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య వివాదం ప్రారంభమైంది. 1968లో ఒడిశా ప్రభుత్వం ఈ భూభాగ వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2026 నవంబర్‌ 5న ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కొటియా ప్రాంత ఓటుహక్కు సమస్య మరో సారి చర్చకు వచ్చింది. ఎన్నికల సమయంలో మాత్రమే ఈ ప్రాంతం రాజ కీయ చర్చల్లోకి రావడం, మిగతా సమయంలో ప్రజల రోజు వారీ సమస్య లకు తగిన ప్రాధాన్యత లేకపోవడం ఆలోచించాల్సిన విషయం.

భారత రాజ్యాంగంలోని 326వ అధికరణం ప్రకారం 18 ఏళ్లు నిండిన అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు ఉండాలి. అర్హులైన వారు అందరూ ఓటు హక్కును కోల్పోకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఎలాంటి ఒత్తిడి, భయం లేకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థి తులు ఉండాలి. పేద ఆదివాసీ కుటుంబాలకు అందాల్సిన సంక్షేమ పథకాలు రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడే సాధనాలుగా మారకూడదు. కొటియా సమస్యను కేవలం ఓటు హక్కు, భూభాగ వివాదంగా మాత్రమే చూడకూడదు. ఇది ఆదివాసీల అస్తిత్వం, రాజకీయ గుర్తింపు, ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం. భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్, ఆదివాసీ ప్రాంతాలకు కల్పించిన ప్రత్యేక రక్షణలు, వర్తించే ప్రాంతాల్లో పంచాయతీల విస్తరణ చట్టం (పీసా) ప్రకారం గ్రామసభల పాత్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. కొటియా ప్రజలతో నేరుగా చర్చలు జరిపి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి. వారి ఓటు హక్కు, రాజకీయ గుర్తింపు, ఆత్మగౌరవం కాపాడటం ప్రభుత్వాల బాధ్యత.

– చేవూరి సతీష్‌ కుమార్‌ 
పోస్ట్‌ డాక్టొరల్‌ ఫెలో, బాబాసాహెబ్‌భీంరావ్‌ అంబేడ్కర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, లక్నో 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement