సాక్షి, గుంటూరు: నిరుద్యోగుల నుంచి జనసేన నేతలు రూ. 7 కోట్లు వసూళ్ల కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కేసును సీఐడీకి అప్పగించారు. కోట రుక్మిణి, కల్యాణం శ్రీనివాస్‌ల పేరుతో 36 మంది నిరుద్యోగుల నుంచి డబ్బు వసూళ్ల కేసులో బోడపాటి ధరణి కృష్ణ, పెద్దిరాజులపై మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల విచారణ తర్వాత ధరణికృష్ణ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జనసేన నేత కేకేతో తనకు ప్రాణహాని ఉందన్న ధరణికృష్ణ.. తనకేం జరిగినా మంగళగిరి రూరల్ సీఐ వెంకట్ చౌదరి, ఎస్‌ఐ రవితేజలదే బాధ్యత అన్నారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతోనే తనను వదిలేశారని ధరణికృష్ణ అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో తనకు ఏ సంబంధం లేకపోయినా పోలీసులతో కలిసి జనసేన నాయకురాలు, సంస్థ డైరెక్టర్‌తో పాటు కేకే తనను ఇరికించారని ఆ సంస్థలో పని చేసిన ధరణి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె పలు దఫాలుగా సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. ఎక్కడ పోలీసులు మళ్లీ వచ్చి తనను తీసుకెళ్తారేమోననే భయంతో ఇలా ముక్కలు ముక్కలుగా వీడియోలు పెట్టానని తెలిపారు. తనకు ఏదైనా జరిగితే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సైలదే బాధ్యత అని తెలిపారు.
కాగా, ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ.7 కోట్లు దండుకోవడంలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక వ్యక్తులదే ప్రధాన పాత్ర అని ఆరోపణలు చేసిన నిందితురాలు ధరణి కృష్ణపై దాడి జరిగింది. ఆమెపై సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు సోషల్ మీడియాలో కొన్ని పత్రాలు వైరల్ అవుతున్నాయి.
నిరుద్యోగులను మోసం చేసిన వ్యవహారంపై ధరణి కృష్ణ ఆదివారం కొన్ని సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో కీలక బాధ్యతల్లో పని చేసిన నాయకురాలు, పార్టీ నాయకుడు కేకేలు తనను ఇందులో ఇరికించి, వారు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ధరణి కృష్ణ ఆరోపించారు. పోలీసులు తనను అనధికారికంగా అరెస్టు చేశారని ఆ వీడియోల్లో తెలిపారు.
హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైన తర్వాత ఆమెను పోలీసులు విడిచి పెట్టారని, ఆమె ఆరోపించిన విధంగా ఈ వ్యవహారంలో పెద్ద వ్యక్తులు పోలీసులను నడిపిస్తున్నట్టు తెలిసిపోతోదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 36 మందిని మోసం చేసిన ఈ వ్యవహారంపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని భావిస్తే, ఆ బాధితుల బ్యాంకు అకౌంట్లను పరిశీలించి, వారి నుంచి డబ్బులు ఎవరికి వెళ్లాయో విచారణ జరిపే వారని, పోలీసులు ఈ చర్యలు తీసుకోకపోగా, ఇతర అంశాలతో కేసును బలహీనపరిచి అసలు నిందితులను తప్పించే ఎత్తగడ కనిపిస్తోందని సోషల్ మీడియాలో పలువురు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: కోట రుక్మిణి పాత్రపై విచారణ చేయండి


