సాక్షి, కాకినాడ జిల్లా: చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు. హైకోర్టు ఆదేశాలతో ఏడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు ఉంటున్న 40 ఎకరాల ఆయిల్‌ఫామ్ తోట సమీపంలోని 500 ఎకరాల కొండ ప్రాంతంలోని మళ్లీ గాలిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 6న చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైంది.
హైకోర్టు ఆదేశాలతో తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్‌ఐలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్ 6న తుని మండలం సీహెచ్ అగ్రహరంలో ఇంచి నుంచి బయటకు వెళ్లిన జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. జ్ఞానేశ్వరితో పాటుగా వెంట వెళ్లిన పెంపుడు కుక్క కూడా అదృశ్యమవ్వగా.. మూడు రోజుల తరువాత తిరిగి వచ్చి అనారోగ్యంతో పెంపుడు కుక్క చనిపోయింది.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, పోలీసులు గాలించినా కానీ జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకలేదు. జ్ఞానేశ్వరి ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష బహుమతి ఇస్తామని కూడా పోలీసులు ప్రకటించారు. 160 రోజులుగా జ్ఞానేశ్వరి తిరిగి వస్తుందన్న ఆశతో తల్లిదండ్రులు జీవిస్తున్నారు. రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన వ్యవహారంపై దృష్టిసారించాలని హైకోర్టు రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను ఆదేశించింది.
చిన్నారి ఆచూకీ తెలుసుకునేందుకు తగిన చర్యలు తీసుసుకోవాలని స్పష్టంచేసింది. అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను అధికారులు అమలుచేయడంలేదని, చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ విషయంలో తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది జి. శ్రీకాంత్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు. దీనిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం చిన్నారి ఆచూకీ తెలుసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది.
ఇదీ చదవండి: ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్..


