శ్రీనివాసరావు , అజయ్
వల్లూరి వారింట కామన్వెల్త్ పతకాల పంట
2010 గేమ్స్‌లో కాంస్యం గెలిచిన తండ్రి శ్రీనివాసరావు
2026 గేమ్స్‌లో రజతం సాధించిన తనయుడు అజయ్
ఆ అబ్బాయికి అప్పటికి ఆరేళ్ల వయసు... తన తండ్రి సాధించిన ఘనత ఏమిటో అతనికేమీ తెలేదు... కానీ తర్వాతి రోజుల్లో అదే అతనికి స్ఫూర్తిగా నిలిచింది. ఎంత వద్దనుకున్నా మనసు వెయిట్‌లిఫ్టింగ్ వైపు మళ్లింది. చివరకు తండ్రి బాటలో పతకాల వేట మొదలు పెట్టిన ఆ కుర్రాడు ఇప్పుడు తన నాన్న ఘనతను పునరావృతం చేశాడు. సరిగ్గా చెప్పాలంటే తండ్రికంటే మరో అడుగు ముందుకు వేశాడు. కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం, రజతం గెలిచిన తండ్రీకొడుకుల గాథ ఇది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో వల్లూరి శ్రీనివాసరావు పతకధారి కాగా....16 ఏళ్ల తర్వాత వల్లూరి అజయ్ బాబు మెడల్ సొంతం చేసుకొని సగర్వంగా నిలిచాడు.
శ్రీనివాసరావు 2010 క్రీడల్లో 56 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్యం గెలుచుకున్నాడు. ఆర్మీలో ఉద్యోగిగా ఉన్న ఆయన తన ఆరేళ్ల అబ్బాయిని కూడా తనతో పాటు పుణేలోని శిక్షణా కేంద్రానికి తరచుగా తీసుకువెళ్లేవాడు. తండ్రి మాట ప్రకారం ఆరంభంలో ఆటల వైపు కాకుండా చదువు పైనే అజయ్ దృష్టి పెట్టాడు. కానీ ఇంట్లో కనిపిస్తున్న కామన్వెల్త్ క్రీడల పతకం అతడిని పదే పదే వెయిట్‌లిఫ్టింగ్ వైపు మళ్లించింది. దాంతో సహజంగానే శ్రీనివాసరావు తొలి కోచ్‌గా మారి ఆటలో ఓనమాలు నేర్పించాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కొండవెలగాడ స్వస్థలం కాగా, శిక్షణ కోసం అజయ్ విజయవాడకు చేరుకున్నాడు. ఆ తర్వాత ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో అవకాశం లభించడంతో అతని కెరీర్ మారిపోయింది. ఈ క్రమంలో జాతీయ జూనియర్ చాంపియన్‌గా నిలవడంతో అతను మరింత పైకి ఎదిగాడు. కీలక సమయాల్లో తండ్రి అండగా నిలుస్తూ అందించిన ప్రోత్సాహం అజయ్‌ను సరైన దిశలో నడిపించింది. రెండేళ్ల క్రితం మోచేతికి గాయమై శస్త్ర చికిత్స జరిగినప్పుడు మళ్లీ కోలుకొని వెయిట్‌లిఫ్టింగ్‌పై దృష్టి పెట్టేందుకు నాన్న ఇచ్చిన చేయూతే ఫలితాలు అందించింది.
గత ఏడాది కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకోవడంతోనే ఈ మెగా ఈవెంట్‌లో అజయ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. తండ్రితో పోలిక కూడా మొదలైంది. గ్లాస్గోకు వెళ్లే ముందు స్వర్ణం సాధిస్తానని అతను తండ్రికి మాటిచ్చాడు. అయితే పసిడి దక్కకపోయినా వెండి పతక విలువేమీ తక్కువ కాదు. ప్రస్తుతం 21 ఏళ్ల వయసే ఉన్న అజయ్‌కు మున్ముందు మరిన్ని పెద్ద విజయాలు సాధించగల సత్తా ఉందని ఈ ప్రదర్శన నిరూపించింది.


