భారత టెస్టు జట్టులో చోటు
న్యూఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం దక్కింది. దశాబ్ద కాలానికి పైగా దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న ఆఫ్‌స్పిన్నర్ సారాంశ్ జైన్‌కు ఎట్టకేలకు భారత టెస్టు జట్టు నుంచి పిలుపు వచ్చింది. వచ్చే నెల శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 33 ఏళ్ల సారాంశ్ ఎంపికయ్యాడు. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలెలో... రెండో టెస్టు కొలంబోలో ఆగస్టు 23 నుంచి 27 వరకు జరుగుతాయి. ఈ సిరీస్ కోసం బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం శుబ్‌మన్ గిల్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
గాయాలతో ఇబ్బంది పడుతున్న స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్‌ను కూడా ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే పర్యటన ప్రారంభానికి ముందు ఈ ఇద్దరూ ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానాన్ని సారాంశ్‌తో భర్తీ చేశారు. మధ్యప్రదేశ్ జట్టు రంజీ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన ఈ ఆల్‌రౌండర్... ఇటీవల శ్రీలంక ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్ ‘ఎ’ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చాడు.
జట్టులో ఉన్న రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ ముగ్గురూ లెఫ్టార్మ్ స్పిన్నర్‌లు కావడంతో... వైవిధ్యం కోసం కుడిచేతి వాటం స్పిన్నర్ సారాంశ్‌ను ఎంపిక చేశారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 54 మ్యాచ్‌లు ఆడిన సారాంశ్ 27.30 సగటుతో 188 వికెట్లు పడగొట్టాడు.
భారత టెస్టు జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్ ), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్‌పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, బుమ్రా, సిరాజ్, ప్రసిధ్, గుర్‌నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్.


