ఎయిర్‌మార్షల్ జితేంద్ర మిశ్రా వెల్లడి
ఆపరేషన్ సింధూర్‌లో ఎస్–400లదే కీలకపాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన ఎస్–400 రక్షణ వ్యవస్థల కోసం పాకిస్థాన్ తెగ ప్రయత్నం చేసిందని, ఆఖరికి ప్రత్యేక గూడచారులు, స్లీపర్ సెల్‌ల సాయంతో వాటిని గుర్తించే ప్రయత్నం జరిగిందని విశ్రాంత ఎయిర్‌మార్షల్ జితేంద్ర మిశ్రా వెల్లడించారు. ఎస్–400ల కారణంగానే పాకి స్థాన్ ఫైటర్‌జెట్లు సరిహద్దుకు 200 కిలోమీట్ల దగ్గరకు కూడా రాలేకపోయాయని ఆయన ఏఎన్‌ఐకి ఇచి్చన ఇంటర్వ్యూలో తెలిపారు.
అత్యాధునిక ఎస్–400లు ఆపరేషన్ సింధూర్‌లో అత్యంత సమర్థంగా పనిచేశాయని, పాకిస్థాన్‌లోని సర్గోదా నుంచి నింగికి ఎగిరిన అవాక్ రాడార్ విమానాన్ని 314 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి కూల్చేసిందని ఆయన తెలిపారు. అంత దూరంలోని విమానాన్ని కూల్చేయడం సైనిక చరిత్రలో ఒక రికార్డు అని చెప్పారు. భారత వాయుసేన మొదట పాకిస్తాన్ గ్రౌండ్ రాడార్లు, కమాండ్–అండ్–కంట్రోల్ కేంద్రాలను ధ్వంసం చేసిందని, దాంతో పాక్ సేనలకు ఏమీ కనిపించని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
దీంతో పాక్ రాడార్ విమానాలపై ఆధారపడ్డాయని, ఎస్–400లు వాటిని కూడా కూల్చేయడంతో విజయం సులభమైందని వివరించారు. ఈ ఆపరేషన్‌లో మహిళా ఫైటర్ పైలట్లు ఒకటి కంటే ఎక్కువ మిషన్లు నిర్వహించారని, మురిద్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కేంద్రం, వైమానిక స్థావరాలు, కమాండ్–అండ్–కంట్రోల్ కేంద్రాలను నాశ నం చేయడంలో కీలకపాత్ర పోషించారని మిశ్రా తెలిపారు. పహల్‌గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గత ఏడది మేలో ఆపరేషన్ సింధూర్‌ను చేపట్టింది.
భారత్ నూర్ ఖాన్, భోలారి వంటి కీలక స్థావరాలు సహా 11 మిలిటరీ స్టేషన్లను ధ్వంసం చేసిన తరువాత పాకిస్తాన్ కాల్పుల విరమణకు అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురు కాలేదని జితేంద్ర మిశ్రా స్పష్టం చేశారు. పౌర నష్టాలు నివారించాలని, ఉగ్రవాదులు, హ్యాండ్లర్లనే లక్ష్యంగా చేసుకోవాలన్న సూచనలు మాత్రం వచ్చాయన్నారు. 2018లో భారత్–రష్యాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా మనకు ఎస్–400 వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి.


