దేశంలో ఉన్నత విద్య, ఉపాధి మధ్య భారీ అంతరాలు
డిగ్రీకి, ఉద్యోగానికి అసలు పొంతనే లేదు
ప్రాక్టికల్ శిక్షణ, పరిశ్రమలతో అనుసంధానంలో పూర్తిగా విఫలం
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చాలి
నైపుణ్యాభివృద్ధిలో సమూల మార్పులు అవసరం: నీతి ఆయోగ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువతకు, ఉద్యోగ మార్కెట్ అవసరాలకు మధ్య తీవ్ర అంతరం ఉందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. డిగ్రీలు పూర్తి చేసినవారిలో తమ విద్యార్హతలకు అనుగుణమైన ఉద్యోగాల్లో చేరుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. దేశంలో కేవలం 8.25 శాతం మంది పట్టభద్రులకే వారి అర్హతలకు సరిపోయే ఉద్యోగాలు లభిస్తున్నాయని పేర్కొంది. ఉన్నత విద్యా వ్యవస్థలో పాఠ్యాంశాలు, పరిశ్రమ అవసరాలు, ప్రాక్టికల్ నైపుణ్యాల మధ్య అనుసంధానమే లేదని తేల్చిచెప్పింది.
ఇంకా పాతకాలపు పాఠ్యాంశాలే
‘వికసిత్ భారత్–2047కు నైపుణ్యాభివృద్ధిలో సమూల మార్పులు’పేరిట నీతి ఆయోగ్ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. చదువు పూర్తిచేసిన తర్వాత యువత తమ విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు పొందలేకపోవడానికి అనేక కారణాలున్నాయని వెల్లడించింది. అనేక ఉన్నత విద్యా సంస్థల్లో ఇప్పటికీ పాతకాలపు, సాధారణ పాఠ్యాంశాలే కొనసాగుతున్నాయని తెలిపింది.
బీఏ, బీఎస్సీ, బీకాం వంటి సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో నేటి పరిశ్రమలకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలకు తగిన అవకాశాలు పరిమితంగా ఉన్నాయని, ఫలితంగా డిగ్రీ ఉన్నప్పటికీ ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం సమస్యగా మారుతోందని పేర్కొంది. విద్యార్థులకు తరగతి గది బోధనతోపాటు వాస్తవ పని వాతావరణంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. చాలాచోట్ల ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు నామమాత్రంగానే కొనసాగుతున్నాయని గుర్తుచేసింది.
పరిశ్రమల్లో ప్రత్యక్షంగా పనిచేసే అవకాశం, ప్రాజెక్టులు చేయడం, నైపుణ్యాన్ని నిరూపించుకునే ‘ప్రూఫ్ ఆఫ్ వర్క్’వంటి అంశాలకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని అభిప్రాయపడింది. ఈ కారణంగానే దేశంలో ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థుల్లో కేవలం 8.25 శాతం మందికే వారి విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు లభిస్తున్నాయని నీతి ఆయోగ్ నివేదిక కుండబద్ధలు కొట్టింది.
నైపుణ్యమే కొలమానం కావాలి
అభ్యర్థులకు డిగ్రీ ఉన్నదా లేదా అన్నదానికంటే.. ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యం ఉందా లేదా అన్నదానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నీతిఆయోగ్ అభిప్రాయపడింది. డిగ్రీ తప్పనిసరి కాని ఉద్యోగాల్లో నైపుణ్య ఆధారిత నియామకాలను ప్రోత్సహించాలని ప్రతిపాదించింది. ఉన్నత విద్యా కార్యక్రమాలకు నిధులు కేటాయించే విధానంలోనూ మార్పులు అవసరమని సూచించింది. కేవలం విద్యార్థుల సంఖ్య లేదా కోర్సుల సంఖ్య ఆధారంగా కాకుండా.. ఉద్యోగ నియామకాలు, వేతనాల పెరుగుదల, నైపుణ్యాల అభివృద్ధి ఫలితాల ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని వెల్లడించింది.
పరిశ్రమలతో అనుసంధానం బలహీనం
విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం మరింత బలపడాల్సి ఉందని సూచించింది. పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాఠ్యాంశాలను రూపొందించడం, పరిశ్రమల్లో అనుభవం ఉన్న నిపుణులను బోధనలో భాగస్వాములను చేయడం, ఆధునిక ల్యాబ్‌లు నెలకొల్పడం వంటి చర్యలు పరిమితంగానే ఉన్నాయని తెలిపింది. దీనివల్ల విద్యార్థులు ఉద్యోగంలో అడుగుపెట్టే సమయానికి వాస్తవ పరిస్థితులను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతున్నారని వివరించింది.
ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాల కంటే.. కేవలం డిగ్రీ ఉండటం వల్ల పోటీ పరీక్షలు, ఇతర నియామకాలకు అర్హత సాధించవచ్చన్న భావన యువతలో ఉందని, ఫలితంగా ఉద్యోగ అవకాశాలున్న ప్రత్యేక కోర్సుల కంటే సాధారణ డిగ్రీలకు వారే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలియజేసింది. దీనికి తోడు పట్టభద్రుల్లో నిరుద్యోగ సమస్య తీవ్రంగానే ఉందని, దేశంలో మొత్తం గ్రాడ్యుయేట్లలో 13 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని నీతి ఆయోగ్ స్పష్టంచేసింది. గ్రాడ్యుయేట్ మహిళల్లో నిరుద్యోగం 20.4 శాతంగా ఉందని వెల్లడించింది.
అప్రెంటీస్‌షిప్ విస్తరణ.. పరిశ్రమ ఆధారిత డిగ్రీలు
ఇప్పుడున్న పరిస్థితిని మార్చేందుకు ‘అప్రెంటిస్‌షిప్ ఫర్ ఆల్’విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలన్న ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయని నివేదిక పేర్కొంది. రాష్ట్రస్థాయిలో ఏకీకృత అప్రెంటీస్‌షిప్ వేదికలను ఏర్పాటు చేయడం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, పరిశ్రమల భవిష్యత్ ఉద్యోగ అవసరాలను ముందుగానే గుర్తించి విద్యార్థులను వాటితో అనుసంధానం చేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచించింది.
ఉన్నత విద్యలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచి వర్క్ ఇంటిగ్రేటెడ్, అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను విస్తరించాలని ప్రతిపాదించింది. సంప్రదాయ కోర్సులతోపాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని, ఉదాహరణకు బీఏ రిటైల్, బీకాం అనలిటిక్స్ వంటి కోర్సుల ద్వారా విద్యార్థులకు డిగ్రీతోపాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు అందించవచ్చని తేల్చిచెప్పింది.


