ఇంజినీరింగ్‌ ట్రేడ్స్‌లో బాలికలు నామమాత్రమే.. | Girls are barely represented in engineering trades | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ ట్రేడ్స్‌లో బాలికలు నామమాత్రమే..

Aug 28 2026 5:38 AM | Updated on Aug 28 2026 5:38 AM

Girls are barely represented in engineering trades

ఐటీఐలో చేరికలు కేవలం 3 నుంచి 7 శాతం

సంప్రదాయ కోర్సుల్లో మాత్రం ఇది 99 శాతం

నీతి ఆయోగ్‌ వర్కింగ్‌ పేపర్‌ వెల్లడి    

దేశంలో మహిళా ఉపాధి కల్పన పరిస్థితులకు అద్దం

సాక్షి, అమరావతి: దేశంలో మహిళల ఉపాధికి సంబంధించి మరో కీలక అంశాన్ని నీతి ఆయోగ్‌ వర్కింగ్‌ పేపర్‌ వెలుగులోకి తెచ్చింది. ఇంజినీరింగ్, సాంకేతిక ట్రేడ్స్‌లో మహిళల ప్రాతినిధ్యం ఇప్పటికీ అత్యల్పంగానే ఉందని పేర్కొంది. ‘గరల్స్‌ అండ్‌ ఉమెన్‌ ఎట్‌ ద సెంటర్‌: అడ్వాన్సింగ్‌ నాన్‌–ట్రెడిషనల్‌ లైవ్లీహుడ్స్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో విడుదలైన ఈ పత్రం ప్రకారం కాస్మెటాలజీ, ఫ్యాషన్‌ డిజైన్, డ్రెస్‌ మేకింగ్, ఎంబ్రాయిడరీ వంటి సంప్రదాయ కోర్సుల్లో బాలికల ప్రవేశాలు 93 శాతం నుంచి 99 శాతం వరకు ఉంటున్నాయి. 

అదే సమయంలో మెకానిక్‌ (మోటార్‌ వెహికల్‌), ప్లంబర్, ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్‌ వంటి ఇంజినీరింగ్‌ ట్రేడ్స్‌లో వీరి భాగస్వామ్యం కేవలం 2.7 శాతం నుంచి 6.8 శాతం మధ్యే ఉంది. సంప్రదాయ వృత్తుల స్వీకరణకు మహిళలను ప్రోత్సహిస్తున్న సమాజం.. అధిక వేతనాలు, మెరుగైన కెరీర్‌ అవకాశాలు, ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్న సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లోకి వారిని తీసుకురావడంలో తగిన చొరవ చూపడంలేదని  వర్కింగ్‌ పేపర్‌ గణాంకాలు విశ్లేషించాయి. మహిళలను సంప్రదాయేతర జీవనోపాధి రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వర్కింగ్‌ పేపర్‌ స్పష్టం చేసింది. 

ఇంజినీరింగ్‌ ట్రేడ్‌ అంటే..
ఇంజినీరింగ్‌ ట్రేడ్లు అంటే యంత్రాల తయారీ, విడిభాగాల అమరిక, లోహపనులు, యంత్రాల తయారీలో వివిధ ప్రక్రియలు, అలాగే విద్యుత్, యాంత్రిక వ్యవస్థల నిర్వహణ వంటి ప్రత్యక్షంగా సాంకేతిక నైపుణ్యాలతో కూడిన వృత్తులు.  తయారీ, నిర్మాణం, మౌలిక వసతులు, యంత్రాల నిర్వహణ రంగాల్లో నైపుణ్య ఆధారిత ఉపాధికి ఈ ట్రేడ్స్‌ ప్రధాన వనరులుగా ఉన్నాయి.  

బాలురు 87.35%.. బాలికలు 12.65%
» 2019–24 మధ్య కాలంలో ఐటీఐలన్నింటిలో కలిపి సుమారు 44.79 లక్షల మంది అభ్యర్థులు నమోదయ్యారు. వీరిలో కేవలం 5.67 లక్షల మంది మాత్రమే (12.65 శాతం) బాలికలు ఉండగా, 39.1 లక్షల మంది (87.35 శాతం) బాలురు ఉన్నారు.
»   ఇక ఇదేకాలంలో ఐటీఐల్లో ఇంజినీరింగ్‌ ట్రేడ్లలో బాలికల ప్రవేశాలు సుమారు 2 లక్షలుకాగా,  బాలుర ప్రవేశాలు దాదాపు 36.5 లక్షలుగా ఉన్నాయి. ఈ ట్రేడ్లలో మొత్తం ప్రవేశాల్లో బాలికల వాటా కేవలం 5.5 శాతం మాత్రమే. 
»  ఇంజినీరింగ్‌యేతర ఐటీఐ కోర్సుల్లో మాత్రం బాలుర కంటే బాలికలే అధికంగా ఉన్నారు. ఈ కోర్సుల్లో బాలికల ప్రవేశాలు దాదాపు 3.5 లక్షలు కాగా, బాలుర ప్రవేశాలు 2.6 లక్షలుగా ఉన్నాయి. అంటే ఈ విభాగాల్లో మొత్తం ప్రవేశాల్లో బాలికల వాటా సుమారు 57 శాతం. 
»  బాలికల భాగస్వామ్యం అధికంగా ఉన్న కోర్సుల్లో  సర్ఫేస్‌ ఆర్నమెంటేషన్‌ టెక్నిక్స్‌– ఎంబ్రాయిడరీ  (98.8 శాతం) కాస్మెటాలజీ  (98.3 శాతం), ఫ్యాషన్‌ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ  (97.9 శాతం), డ్రెస్‌ మేకింగ్‌ (95.3 శాతం), సీవింగ్‌ టెక్నాలజీ (93 శాతం) ఉన్నాయి. 
»   సాంకేతికతకు అనుసంధానమైన ఇంజినీరింగ్‌యేతర ఐటీఐ ట్రేడ్లలోనూ బాలికల భాగస్వామ్యం తక్కువగానే ఉంది. కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌లో 34.3 శాతం, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అండ్‌ నెట్‌వర్క్‌ మెయింటెనెన్స్‌లో 29.8 శాతం మాత్రమే బాలికలు ఉన్నారు.
»  స్టెనోగ్రాఫర్‌ అండ్‌ సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌–హిందీ  (52.2 శాతం), స్టెనోగ్రాఫర్‌ –సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌–ఇంగ్లీష్‌ (57.3 శాతం),  హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ (40.5 శాతం) వంటి కొన్ని ట్రేడ్‌లలో  సమతుల్య లింగ భాగస్వామ్యం కనిపిస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement