హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు
వైఎస్ జగన్ ప్రభుత్వ చట్ట నిబంధనల సవరణలకు సమరి్థంపు
గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల కొట్టివేత
గత సర్కార్ దాఖలు చేసిన అప్పీళ్లకు అనుమతి
భయం, సిగ్గు లేకుండా విచ్చలవిడిగా పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారు
మనిషి అత్యాశ వల్లే విధ్వంస పర్యవసానాలు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి
అక్రమ మైనింగ్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ అండదండలతో తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా కొండలను గుల్ల చేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్న నేపథ్యంలో అక్రమ మైనింగ్‌పై హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘అక్రమ మైనింగ్ అనేది సమాజాన్ని పీడిస్తున్న ఒక పెద్ద సామాజిక రుగ్మత. దీన్ని మనం అందరం తప్పనిసరిగా గుర్తించుకుని తీరాల్సిందే. ఎటువంటి భయం, సిగ్గు లేకుండా విచ్చలవిడిగా పర్యావరణ విధ్వంసం కొనసాగుతోంది. ఇందుకు మనిషి అత్యాశే ప్రధాన కారణం. ఆ విధ్వంస పర్యవసానమే ఇప్పుడు మనకు మన కళ్ల ముందు కనిపిస్తున్న వినాశకరమైన ఫలితాలు.’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
అక్రమ మైనింగ్, నిల్వ, రవాణాను అరికట్టేందుకు 2020లో అప్పటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట నిబంధనల సవరణలను హైకోర్టు సమర్థించింది. ఆ సవరణలు చట్టబద్ధమైనవేనని తేల్చి చెప్పింది. ఎంఎంఆర్‌డీ చట్టంలోని సెక్షన్ 15, 23సీ ప్రకారం మైనర్ మినరల్స్ అక్రమ మైనింగ్, నిల్వ, రవాణాను అరికట్టేందుకు నిబంధనలు తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. మైన్స్ అండ్ మినరల్ అభివృద్ధి, క్రమబద్దీకరణ చట్టం (ఎంఎండీఆర్), ఏపీ మైనర్ మినరల్స్ కన్సెషన్ (ఎంఎంసీ) రూల్స్‌ను ఉల్లంఘిస్తూ అక్రమ తవ్వకాలకు పాల్పడే కంపెనీలకు, వ్యక్తులకు జరిమానా విధించే అధికారం గనుల శాఖ అధికారులకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
అయితే శిక్ష విధించే అధికారం మాత్రం సంబంధిత న్యాయస్థానానికే ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఇటీవల అత్యంత కీలక తీర్పు వెలువరించింది. ఏపీ ఎంఎంసీ రూల్స్‌కు ప్రభుత్వం చేసిన సవరణలు కేంద్ర చట్టమైన ఎంఎంఆర్‌డీకి విరుద్ధంగా ఉన్నాయని, అందువల్ల అవి చెల్లుబాటు కావంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం రద్దు చేసింది.
సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ అప్పట్లో జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం అనుమతిస్తూ ఈ మేరకు తీర్పు వెలువరించింది. గనుల శాఖ అధికారుల నుండి డిమాండ్ నోటీసు అందుకున్న మైనింగ్ కంపెనీలు ఈ తీర్పు ప్రతి అందుబాటులోకి వచ్చిన 15 రోజుల్లో చట్ట నిబంధనల ప్రకారం సంబంధిత అప్పిలేట్ అథారిటీ వద్ద అప్పీల్ వేసుకోవచ్చని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది.
అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు జగన్ సర్కార్ కఠిన చర్యలు
రాష్ట్రంలో గనుల అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్‌కు సంబంధించి చట్ట నిబంధనల సవరణలు చేస్తూ అప్పటి జగన్ ప్రభుత్వం 2020 జూలై 1న జీవో 35 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం అక్రమ మైనింగ్‌కు పాల్పడినా, పర్మిట్ లేకుండా రవాణా చేసినా, భారీ జరిమానా, సీనరేజ్ ఫీజు విధించవచ్చు. అంతేకాక డిమాండ్ నోటీసు జారీ, మెరిట్ వసూలు, వాహనాలు, యంత్రాలు సీజ్ చేసే అధికారం గనుల శాఖ అధికారులకు ఉంటుంది.
ఈ నేపథ్యంలో భవనాల నిర్మాణాలకు అవసరమైన రాళ్లు, రహదారి మెటల్ కోసం అనుమతులకు మించి తవ్వకాలు చేసిన మైనింగ్ కంపెనీలకు జరిమానా నిమిత్తం అధికారులు డిమాండ్ నోటీసులు ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను సవాలు చేస్తూ శ్రీదుర్గా భవానీ గ్రానైట్స్, సల్సార్ గ్రానైట్స్, జీఎంబీ రాక్స్, జీఎస్‌ఆర్ స్టోన్ క్రషర్స్ తదితర కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. కేంద్ర చట్టమైన మైన్స్ అండ్ మినరల్ అభివృద్ధి, క్రమబద్ధీకరణ చట్టం (ఎంఎండీఆర్) 1957కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం సవరించిన ఏపీ ఎంఎంసీ నిబంధనలు చెల్లవని పేర్కొన్నాయి.
ఎంఎంఆర్‌డీ చట్టం కింద జరిమానాలు, శిక్షలు విధించే అధికారం కేవలం సంబంధిత క్రిమినల్ కోర్టులకు మాత్రమే ఉంటుంది తప్ప అధికారులకు లేదని ఆ కంపెనీలు వాదించాయి. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ రావు రఘునందన్‌రావు, డిమాండ్ నోటీసులు జారీ చేసే పరిధి మాత్రమే అధికారులకు ఉందని జరిమానాలు, శిక్షలు విధించే అధికారం సంబంధిత కోర్టులకు మాత్రమే ఉంటుందంటూ 2020లో తీర్పునిచ్చారు.
చట్ట నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ పలు కంపెనీలకు జరిమానా నిమిత్తం గనుల శాఖ అధికారులు జారీ చేసిన నోటీసులను రద్దు చేశారు. దీంతో తీర్పును సవాలు చేస్తూ జగన్ ప్రభుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. ఇదే సమయంలో ఎంఎంసీ నిబంధనల్లోని రూల్ 26(3)(2), 34(1) చట్టబద్ధతను సవాలు చేస్తూ అంజనీ స్టోన్ క్రషర్స్ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలన్నింటిపై సీజే జస్టిస్ లీసా గిల్ ధర్మాసనం విచారణ జరిపింది.


