విద్యుత్ ఉద్యోగుల సహకార సంఘంలో రూ.6.11 కోట్ల దోపిడీ!
వడ్డీతో కలిపి ఇప్పుడు ఈ మొత్తం విలువ రూ.17.47 కోట్లు
సభ్యులు కాని 40 మంది పేర్లపై రుణాలిచ్చేసిన పాత పాలకవర్గం
ఉద్యోగ విరమణ చేసిన, వైదొలగిన మరో 38 మంది పేరునా బకాయిలు
119 మంది బకాయిదారులకు నోటీసులివ్వాలని కొత్త పాలకవర్గం నిర్ణయం
సాక్షి, అమరావతి: విజయవాడ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో రుణాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. సొసైటీ ఆర్థిక పరిస్థితి, రుణాలు, డిపాజిట్లపై సహకార శాఖ విచారణలో అక్రమాల డొంక కదులుతోంది. తాజాగా విచారణ నివేదికలో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకూ పరిశీలించిన రికార్డుల ప్రకారం.. మొత్తం 78 రుణాలకు సంబంధించి అసలు బకాయి రూ.6,11,09,325గా ఉంది. దీనిపై వడ్డీ బకాయి రూ.11,36,09,877గా చూపించారు. దీంతో అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.17,47,19,202కు చేరింది. 78 రుణాల్లో 40 రుణాలు సొసైటీ సభ్యులు కాని వారి పేర్లపై ఉన్నాయి.
విచారణలో అత్యంత కీలకంగా గుర్తించిన అంశం ఇదే. ఉద్యోగ విరమణ చేసిన, సొసైటీ నుంచి వైదొలగిన (రిటైర్డ్, క్లోజ్డ్ సభ్యులు) మరో 40 మంది పేరునా బకాయిలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంటే రుణాలు మంజూరు చేసే సమయంలో సభ్యత్వ నిబంధనలు, సొసైటీ బైలాస్ పాటించలేదని స్పష్టమవుతోంది. ఈ రుణాలన్నీ కాలపరిమితి దాటినవి కావడం విశేషం. అయితే తాము ఎలాంటి రుణాలు తీసుకోలేదని, తమ పేరుమీద రుణాలు ఉన్నట్లు కూడా తమకు తెలియదని కొందరు ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు.
119 మందికి సమన్లు జారీ
ఇప్పటికే గుర్తించిన 78 మందితో పాటు మొత్తం 119 మంది రుణ రుణగ్రహీతలకు చట్టపరంగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఇందులో 78 టైమ్‌బార్డ్ రుణాలపై ప్రత్యేక రికవరీ డ్రైవ్ చేపట్టి, అవసరమైతే తక్షణమే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ రుణాల్లో అత్యధికంగా రూ.8 లక్షల చొప్పున బకాయి ఉన్న ఖాతాలు ఉన్నాయి. కొన్ని ఖాతాల్లో అసలు బకాయి రూ.7,96,600, రూ.7,69,079,రూ.7,62,124, రూ.7,60,000, రూ.8,02,130గా ఉంది. చాలా రుణాలకు 18 శాతం వడ్డీ రేటు విధించారు.
ఇలాంటి బకాయిలు ఉన్న వారికి ఇప్పటికే సమన్లు జారీ చేస్తున్నారు. వాటిని అందుకున్న వారు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఎఫ్‌డీ రుణాలు, స్వల్పకాలిక, మధ్యకాలిక రుణాలకు సంబంధించిన పత్రాలతో ఈ నెల 31న ఉదయం 11 గంటలకు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. కాగా ఈ రుణాల మంజూరులో సొసైటీ పాలకవర్గంలోని సభ్యులకూ పూర్తి సమాచారం లేకుండానే వ్యవహారం సాగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రుణాల మంజూరుకు సంబంధించి మేనేజింగ్ కమిటీ తీర్మానాలు కూడా లేవని విచారణలో తేలింది.
2018లో సాఫ్ట్‌వేర్ మార్పు.. పాత రికార్డులు మాయం
సొసైటీ 2018 జనవరి 1న కొత్త సాఫ్ట్‌వేర్‌ను అమలు చేశారు. అప్పటికి ఈ రుణాలు కంప్యూటర్ లోన్ లెడ్జర్‌లో ఓపెనింగ్ బ్యాలెన్స్‌లుగా కనిపించాయి. అయితే రుణాలు మంజూరు చేసిన అసలు తేదీలు లెడ్జర్‌లో నమోదు కాలేదని, పాత సాఫ్ట్‌వేర్ తొలగించడంతో పాత క్యాష్‌బుక్స్ అందుబాటులో లేవని చెబుతున్నారు. 2018కు ముందు రికార్డులు అందుబాటులో లేకపోవడంతో కొన్ని రుణాల అసలు మంజూరు తేదీలను ఇతర మార్గాల్లో విచారణ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో సొసైటీలో సభ్యుల రుణ బకాయిలతో పాటు డిపాజిటర్లకు చెల్లించాల్సిన మొత్తాలు, కెనరా బ్యాంకు వద్ద తీసుకున్న రుణాల బకాయిలు, డిపాజిట్ల చెల్లింపుల కోసం తీసుకున్న చర్యలపై సభ్యుల్లోసందేహాలు వ్యక్తమవుతున్నాయి.


