ఇందులో 16,23,774 నోటీసులపై క్షేత్రస్థాయి విచారణ పూర్తి
అక్టోబరు 3న తుది జాబితా ప్రచురణ
దోషరహితమైన ఓటర్ల జాబితాకు కృషి చేయండి
జిల్లా కలెక్టర్లతో ఈసీఐ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డా.పవన్‌కుమార్ శర్మ
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ప్రతీ దశలోనూ నాణ్యతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ దోషరహితమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకు సమిష్టిగా కృషి చేయాల్సిందిగా రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డా.పవన్‌కుమార్ శర్మ కోరారు. అక్టోబరు 3న తుది జాబితా ప్రచురణ వరకు సమష్టి కృషితో ముందుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో సర్ పురోగతిపై రాష్ట్ర సీఈఓ వివేక్ యాదవ్, అదనపు సీఈఓ డిల్లీరావుతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో పవన్‌కుమార్ శర్మ సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 43,71,397 మంది ఓటర్లకు నోటీసులు పంపిణీ కాగా.. ఇందులో 16,23,774 నోటీసులపై క్షేత్రస్థాయిలో విచారణ పూర్తిచేసినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో.. నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియలో ముందంజలో ఉన్న జిల్లాలను అభినందిస్తూ.. మిగిలిన జిల్లాలోనూ నాణ్యంగా, వేగంగా, పారదర్శకంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు, రాజకీయ పార్టీల మధ్య సమన్వయం, సహకారం అనేవి ఈ ప్రక్రియను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కీలకమని.. ఎవరికే సందేహమున్నా నివృత్తి చేయడం, సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని పవన్‌కుమార్ సూచించారు. ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు సంతృప్తికరంగా అందించడంలో ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు.
విచారణకు రాలేని వారి ఇళ్లకు వెళ్లండి..
వృద్ధాప్యం, అనారోగ్యం వంటి వివిధ కారణాలవల్ల విచారణకు హాజరుకాలేని పక్షంలో ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓ, బీఎల్‌ఓను సమన్వయం చేసుకుంటూ ఇంటి సందర్శనతోపాటు వివిధ మార్గాల ద్వారా ఓటర్లకు సహాయ సహకారాలు అందించాలన్నారు. అలాగే, నోటీసులపై విచారణ అనంతరం క్వాసీ జ్యుడీషియల్ అధికారి అయిన ఏఈఆర్‌ఓలు సమస్యను అర్ధంచేసుకుని న్యాయమైన తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. నోటీసుల విచారణలో వెనుకబడిన శ్రీ సత్యసాయి, తిరుపతి, విశాఖపట్నం, బాపట్ల, మార్కాపురం జిల్లాలతో పాటు విశాఖపట్నం వెస్ట్, పెందుర్తి, నెల్లూరు సిటీ, కదిరి, హిందూపూర్, ఉదయగిరి, పెనుకొండ, ఎర్రగొండపాలెం, తిరుపతి, సర్వేపల్లి తదితర నియోజకవర్గాలు సెప్టెంబరు 5న జరిగే ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నాటికి ప్రగతి సాధించాలని పవన్‌కుమార్ శర్మ సూచించారు.


