జూడాల స్టైపెండ్‌పై సర్కారు అదే పాట | AP Junior Doctors Association rejects govt stipend revision | Sakshi
Sakshi News home page

జూడాల స్టైపెండ్‌పై సర్కారు అదే పాట

Aug 28 2026 5:56 AM | Updated on Aug 28 2026 5:56 AM

AP Junior Doctors Association rejects govt stipend revision

అధికారులతో కమిటీ సమావేశానికి హాజరైన జూడా ప్రతినిధులు

మూడు శాతం మించి పెంచబోమంటున్న ప్రభుత్వం

అసంతృప్తి వ్యక్తంచేసిన జూనియర్‌ డాక్టర్లు

ఉన్నతాధికారుల కమిటీ సమావేశంలోనూ కొలిక్కిరాని పెంపు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జూనియర్‌ డాక్టర్ల (జూడా) స్టైపెండ్‌ పెంపుపై ప్రభుత్వం అదే మూ­డు శాతం పాట పాడుతోంది. ఇటీవల జూడాలు స్టైపెండ్‌ పెంపు డిమాండ్‌తో సమ్మె చేసిన విషయం తెలిసిందే. రెండు వారాల్లో వీరి సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని హైకోర్టు గడువు పెట్టింది. ఈ నేపథ్యంలో గురువారం ఏపీ జూడా అసోసియేషన్‌ ప్రతినిధులతో వైద్యశాఖ అధికారుల కమిటీ భేటీ అయింది. తమ స్టైపెండ్‌ను 13 శాతం చొప్పున పెంచాలని జూడా ప్రతినిధులు కోరారు. అయితే, యథావిధిగా పీజీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకు మూడు శాతం చొప్పున మాత్రమే పెంచుతామని అధికారుల కమిటీ తేల్చిచెప్పింది.

ఈ ఒక్క ఏడాదికి ఇంటర్న్స్‌కు 10 శాతం పెంచుతామని తెలిపింది. దీంతో పీజీ, సూపర్‌ స్పెషాలిటీలకు ప్రభుత్వం సూచించిన పెంపుపై జూడాలు అసంతృప్తి వ్యక్తంచేశారు. దీంతో మరోమారు సమావేశమవుదామని అధికా­రుల కమిటీ వారికి సూచించింది. రెండేళ్లకు ఓసారి జూడాలకు ప్రభుత్వం స్టైపెండ్‌ పెంచాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి నుంచి పెంపు వర్తించాల్సి ఉండగా జూన్‌ వరకూ ప్రభుత్వం స్పందించనేలేదు.

దీంతో 30 శాతం పెంపు డిమాండ్‌తో జూడాలు సమ్మెలోకి వెళ్లారు. కానీ, కేవలం మూడు శాతం మాత్రమే పెంచుతామని అంతకుమించి పెంచలేమని ప్రభుత్వం చెప్పడంతో తొలుత 20 శాతం, ఆ తర్వాత 15 శాతం, ఇప్పుడు కనీసం 13 శాతం చొప్పున పెంచాలని జూడాలు కోరుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టువీడకపోవడంతో జూడాలు రగిలిపోతున్నారు.

మిగిలిన డిమాండ్లపై అధికారుల కమిటీ స్పందన ఇలా..
డీఎంఈలో వైద్యుల ఉద్యోగ విరమణను పెంచాలని వైద్యశాఖ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ విరమణ వయస్సును 63కు మించి పెంచొద్దని జూడాలు కోరారు. ఈ అంశంపై ఇంకా విధానపరమైన నిర్ణయం తీసుకోలేదని అధికారులు వెల్లడించారు. 

నాన్‌ క్లినికల్‌ వైద్యుల పోస్టుల్లో ఎంఎస్సీ, పీ­హెచ్‌డీ, ఇతర అర్హతలున్న వారికి అవకాశం కల్పించడంపైనా జూడాలు పలు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఈ అంశంలో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాల ప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైద్య­శాఖ కార్యదర్శి వీరపాండియన్‌ స్పష్టంచేశారు. 30 శాతం వరకూ అవకాశం ఇవ్వచ్చని ఎన్‌ఎంసీ చెబుతుంటే ఇప్పటివరకు 11.05 శాతం పోస్టులను మాత్రమే ఈ విధానంలో భర్తీ చేసినట్లు వెల్లడించారు.

 జూడాలకు నిర్ణీత పనివేళలు, కనీస సౌకర్యా­ల కల్పనకు సంబంధించి ఇప్పటికే డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) ద్వారా అన్ని ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీచేసినట్టు ఆయన తెలిపారు. ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహించే సూపరింటెండెంట్లపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
 సీనియర్‌ రెసిడెంట్ల స్టైపెండ్‌ అంశాన్ని ప్రభుత్వం వేరుగా పరిశీలిస్తుందని, వారు జూడాల పరిధిలోకి రారని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎంఈ డాక్టర్‌ ఎ. విష్ణువర్థన్, జూడా రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్, భార్గవ్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement