చరిత్రలోనే మెగా డీల్‌ ఇది.. వెనెజువెలా చమురుకు ట్రంప్‌ స్కెచ్‌! | Biggest Oil Deal in History: Trump Strikes Mega Deal with Venezuela | Sakshi
Sakshi News home page

చరిత్రలోనే మెగా డీల్‌ ఇది.. వెనెజువెలా చమురుకు ట్రంప్‌ స్కెచ్‌!

Aug 29 2026 6:57 AM | Updated on Aug 29 2026 6:57 AM

Biggest Oil Deal in History: Trump Strikes Mega Deal with Venezuela

65 బిలియన్‌ బ్యారెళ్ల చమురు.. $100 బిలియన్‌ డీల్‌!

ప్రపంచ చమురు రంగంలో సంచలనం రేపే ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. వెనెజువెలాకు చెందిన 65 బిలియన్‌ బ్యారెళ్లకు చమురు నిల్వలపై దాదాపు నియంత్రణ లభించేలా.. ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో భారీ ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. దీన్ని ‘ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద చమురు ఒప్పందం’గా ఆయన అభివర్ణించారు.

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్‌తో కలిసి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సెత్‌ ఈ ఒప్పందం కోసం చర్చలు జరిపినట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. వారాలపాటు కొనసాగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరిందని చెప్పారు. అమెరికా పన్ను చెల్లింపుదారులపై అదనపు భారం లేకుండానే ఈ ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. వచ్చే వారం వెనెజువెలా అధికారులు పలు కంపెనీలకు, ముఖ్యంగా అమెరికా సంస్థలకు, చమురు అన్వేషణ, ఉత్పత్తి హక్కులు కల్పించే ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్లు సమాచారం.

అమెరికా లక్ష్యం ఇదే..
వెనెజువెలా వద్ద ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్నాయి. మొత్తం 303 బిలియన్‌ బ్యారెళ్ల వరకు ముడి చమురు నిల్వలు ఉన్నట్లు అంచనా. ఇది ప్రపంచ చమురు నిల్వల్లో దాదాపు 17 శాతానికి సమానం. అయినప్పటికీ అక్కడి చమురు పరిశ్రమ సంవత్సరాల తరబడి పెట్టుబడుల కొరత, నిర్వహణ లోపాలు, ఆంక్షల కారణంగా తీవ్రంగా దెబ్బతింది. దీంతో భారీ నిల్వలు ఉన్నప్పటికీ ప్రస్తుతం రోజుకు సుమారు 12.5 లక్షల బ్యారెళ్ల చమురును మాత్రమే ఉత్పత్తి చేస్తోంది.

ఈ పరిస్థితిని మార్చి వెనెజువెలా చమురు ఉత్పత్తిని పెంచడం, అమెరికా రిఫైనరీలకు అదనపు ముడి చమురును అందుబాటులోకి తీసుకురావడం ట్రంప్‌ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా సంస్థలకు వెనెజువెలా చమురు క్షేత్రాల్లో దీర్ఘకాలిక ప్రాప్యత కల్పించడం ద్వారా ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోంది.

దాదాపు 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు?
ఈ ఒప్పందం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని రూబియో పేర్కొన్నారు. అమెరికాకు స్థిరమైన, తక్కువ ధరకు ముడి చమురు లభించే అవకాశం ఉంటుందని, తద్వారా పెట్రోల్‌ ధరలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు వెనెజువెలాలో దాదాపు 100 బిలియన్‌ డాలర్ల మేర ప్రైవేటు పెట్టుబడులు రావచ్చని, వేలాది అధిక వేతన ఉద్యోగాలు ఏర్పడటంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు.

పెట్రోల్‌ ధరలు వెంటనే తగ్గుతాయా?
అయితే అమెరికా ప్రజలకు తక్షణమే చమురు ధరల రూపంలో ప్రయోజనం దక్కుతుందా అన్నదానిపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వెనెజువెలాలోని చమురు మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీగా పెట్టుబడులు పెట్టి చమురు ఉత్పత్తిని పెంచడం, దాన్ని రవాణా చేయడం, భారీ ముడి చమురును శుద్ధి చేయడానికి అవసరమైన రిఫైనింగ్‌ సామర్థ్యాన్ని పెంచడం వంటి పనులకు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఒప్పందం వల్ల అమెరికాలో పెట్రోల్‌ ధరలు స్వల్పకాలంలోనే గణనీయంగా తగ్గుతాయని చెప్పలేమని విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్పత్తి పెరిగి, సరఫరా స్థిరపడిన తర్వాతే దాని ప్రభావం వినియోగదారులపై కనిపించే అవకాశం ఉంది.

చట్టపరమైన చిక్కులు కూడా..
అసలు ఈ ఒప్పందం ఏ రూపంలో అమలు కానుందనే దానిపై మాత్రం ట్రంప్‌ స్పష్టత ఇవ్వలేదు. ఏ చమురు క్షేత్రాలు ఇందులో భాగం కానున్నాయి? ఏ కంపెనీలు పాల్గొంటాయి? అమెరికా మెజారిటీ నియంత్రణను ఎలా చేపడుతుంది? వంటి కీలక అంశాలను ఆయన వెల్లడించలేదు.

ఇదే సమయంలో వెనెజువెలా చట్టాల ప్రకారం చమురు పరిశ్రమలో కీలక కార్యకలాపాలపై ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతోంది. అందువల్ల అమెరికా ప్రభుత్వం నేరుగా లీజు విధానంలో చమురు క్షేత్రాలను నిర్వహించేలా ఒప్పందం చేసుకుంటే దానికి వెనెజువెలా రాజ్యాంగం, హైడ్రోకార్బన్స్‌ చట్టాల ప్రకారం చట్టబద్ధత ఉంటుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి విధానానికి గతంలో స్పష్టమైన ఉదాహరణ లేదని నిపుణులు చెబుతున్నారు.

అడ్డంకులెన్నో..
చమురు నిల్వలు అపారంగా ఉన్నప్పటికీ వెనెజువెలాలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. రాజకీయ అనిశ్చితి, బలహీనమైన విద్యుత్‌ వ్యవస్థ, పరిమిత ఎగుమతి సామర్థ్యం, చమురు రంగంపై ప్రభుత్వ నియంత్రణ వంటి అంశాలు గతంలో పెట్టుబడిదారులను వెనక్కి తగ్గించాయి. కేవలం ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే భారీ స్థాయిలో పెట్టుబడులు వెంటనే రావడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.

చమురు జాతీయీకరణ నుంచి..
వెనెజువెలా చమురు పరిశ్రమకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1970లలో ఆ దేశం చమురు పరిశ్రమను జాతీయీకరించి ప్రభుత్వ ఆధీనంలోని పీడీవీఎస్‌ఏను (PDVSA) కేంద్రంగా మార్చింది. ఆ తర్వాత హ్యూగో చావెజ్‌ పాలనలో విదేశీ చమురు సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ మరింత పెరిగింది. విదేశీ కంపెనీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాయింట్‌ వెంచర్లలోకి తీసుకురావడంతోపాటు కొన్ని ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో అమెరికా చమురు సంస్థల ప్రయోజనాలు దెబ్బతిన్నాయి.

మదురో తొలగింపు తర్వాత వేగం..
నికొలస్‌ మదురోను అమెరికా సైనిక చర్య అధ్యక్ష ద్వారా పదవి నుంచి తొలగించిన తర్వాత వెనెజువెలా చమురు రంగంపై వాషింగ్టన్‌ దృష్టి మరింత పెరిగింది. అమెరికా రిఫైనరీలకు వెనెజువెలా నుంచి స్థిరమైన ముడి చమురు సరఫరా ఉండేలా చూడటంతోపాటు అమెరికా కంపెనీల పెట్టుబడులను ప్రోత్సహించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మదురోను అమెరికాకు తరలించి నార్కోటెర్రరిజం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై కేసులు ఎదుర్కొనేలా చేసిన దాదాపు తొమ్మిది నెలల తర్వాత తాజా చమురు ఒప్పంద ప్రకటన రావడం గమనార్హం.

అమెరికాకు మరో అవసరం..
అమెరికాలో పెట్రోల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంధన ధరలను అదుపులోకి తీసుకురావడం కీలకంగా మారింది. ఇప్పటికే అమెరికా వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి భారీగా చమురును విడుదల చేసింది. ఆగస్టు ప్రారంభంలో ఆ నిల్వలు 30 కోట్ల బ్యారెళ్ల కంటే దిగువకు పడిపోయాయి. 2026 ప్రారంభంతో పోలిస్తే 10 కోట్ల బ్యారెళ్లకు పైగా తగ్గాయి.

ఈ నేపథ్యంలో వెనెజువెలా నుంచి అదనపు చమురు సరఫరాను పొందడం అమెరికాకు రెండు విధాలుగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఒకవైపు రిఫైనరీలకు ముడి చమురు సరఫరా పెరుగుతుంది. మరోవైపు భవిష్యత్తులో వ్యూహాత్మక చమురు నిల్వలను తిరిగి నింపేందుకు కూడా ప్రత్యామ్నాయాలు లభిస్తాయి.

ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు, చట్టపరమైన నిర్మాణం, పెట్టుబడుల విధానం, చమురు క్షేత్రాల ఎంపిక వంటి అంశాలు స్పష్టమైన తర్వాతే ఈ డీల్‌ అసలు ప్రభావం ఎంత ఉంటుందో అంచనా వేయగలమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను కలిగిన వెనెజువెలా.. వాటిని వెలికితీసే సామర్థ్యాన్ని తిరిగి సాధిస్తే ప్రపంచ ఇంధన మార్కెట్‌పై కూడా గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ట్రంప్‌కు బిగ్‌ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement