ఒప్పందం కుదుర్చుకున్న భారత్
న్యూఢిల్లీ: సైనిక పోరాట సామర్థ్యాన్ని పెంచుకొనే దిశగా భారత్ మరో కీలకమైన ముందడుగు వేసింది. అమెరికా నుంచి జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థలను కొను గోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం భారత్, అమెరికా మధ్య మరింత గాఢంగా, ప్రభావవంతంగా మారుతున్న ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తోందని అమెరికా రాయబారి సెర్గియో గోర్ అన్నారు.
అమెరికా నుంచి భారత్ ఎన్ని జావెల్ యాంటీ–ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్స్‌ను కొనుగోలు చేస్తుందన్నది ఇంకా తెలియరాలేదు. ఈ కొనుగోలు మొత్తం వ్యయం ఎంత అనేది కూడా స్పష్టత లేదు. అమెరికా విదేశీ సైనిక అమ్మకాల ప్రక్రియ ద్వారా జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత సైన్యం ‘ఆఫర్, అంగీకార పత్రం’పై సంతకం చేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు అమెరికా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పరిణామం అమెరికా, భారత సాయుధ దళాల మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని, అలాగే ఇరుదేశాల రక్షణ పరిశ్రమల మధ్య భవిష్యత్ సహకారానికి మార్గం సుగమం చేస్తుందని పేర్కొంది.


