దోసకాయలపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు
కోరుకొండ/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఓ ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన వసతి గృహంలో 62 మంది విద్యార్థులు శనివారం అస్వస్థతకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పితాని కోమల శనివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం, రాత్రి పప్పుతో భోజనం చేసిన విద్యార్థులు, 28వ తేదీ ఉదయం అల్పాహారంలో మైసూర్ బజ్జీ తిన్నారు. దీంతో విద్యార్థులకు కడుపునొప్పి మొదలైంది.
రాత్రికి వాంతులు, విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురయ్యారు. దోసకాయలపల్లి పీహెచ్‌సీ వైద్య బృందం అందించిన వైద్య సేవలతో విద్యార్థులంతా కోలుకున్నారని చెప్పారు. వీరిలో ఆరో తరగతి విద్యార్థిని బండి భవానీశంకరి తీవ్ర అస్వస్థతకు గురవడంతో రాజమహేంద్రవరం లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సబ్‌కలెక్టర్, ఇతర అధికారులు వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర విభాగంలో వైద్య సేవల అనంతరం భవానీశంకరి కోలుకుంటున్నట్టు తెలిపారు.


