● గంజాయి తరలింపులో కొత్త ఎత్తుగడ
● హ్యాస్ ఆయిల్‌గా మార్చి అక్రమ రవాణా
● పోలీసుల కళ్లుగప్పి ఇతర రాష్ట్రాలకు చేరవేత
● జిల్లాలోనూ చిన్న ప్యాక్‌లుగా విక్రయాలు
● పోలీసుల నిఘా పెరిగితేనే అడ్డుకట్ట
సాక్షి, రాజమహేంద్రవరం: గంజాయి అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్త మార్గాలను సృష్టిస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. గంజాయిని సహజ రూపంలో భారీగా తరలించే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు ఈ మత్తు పదార్థాన్ని ద్రవ రూపంలోకి హ్యాస్ ఆయిల్‌గా మార్చేస్తున్నారు. ఫలితంగా భారీ మొత్తం సరకు తేలిగ్గా సరిహద్దులు దాటించేసి, ఇతర రాష్ట్రాలకు చేరవేస్తున్నారు. ఇదే సమయంలో రాజమహేంద్రవరం నగరంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ హ్యాస్ ఆయిల్ లభించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ కొత్త ఉపద్రవం పోలీసులకు సవాల్‌గా మారడంతో పాటు యువతరం ఉజ్వల భవిష్యత్‌ను అంధకారమయం చేసే ప్రమాదం ఉంది. తాజాగా బుధవారం గోకవరంలో ఆరు లీటర్ల లిక్విడ్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దొరికేది కొంతయితే, దొరకకుండా వేల లీటర్లు పోలీసుల కళ్లుగప్పి తరలిపోతోంది.
తనిఖీల నుంచి తప్పించుకునేందుకు...
ఒడిశాతో పాటు మన రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని విశాఖపట్నం, రాజమహేంద్రవరం మీదుగా ఇతర ప్రాంతాలకు భారీగా తరలిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. కిలో, రెండు కిలోల చొప్పున ప్యాకెట్లుగా మార్చి కార్లు, లారీల్లో రోడ్డు మార్గం ద్వారా, కొన్నిసార్లు రైళ్లలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ముంబయి, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాలకు నిత్యం రవాణా చేస్తున్నారు. అయితే ఇలా చేసే సమయంలో పోలీసుల తనిఖీలకు సులువుగా దొరికిపోతున్నారు. ఎక్కువ మొత్తంలో సరకు ఒక్కసారిగా తరలించడం సాధ్యం కావడం లేదు. అందుకని గంజాయిని ద్రవ రూపంలోకి మార్చి సరఫరా చేయడంపై దృష్టి సారించారు.
యువత భవిత అంధకారమే
సహజంగానే గంజాయి తీసుకున్న వారు ఉన్మాదంతో ప్రవర్తిస్తుంటారు. విచక్షణ కోల్పోయి భౌతిక దాడులకు పాల్పడడంతో పాటు లైంగిక దాడులకూ పాల్పడుతున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అంతకు పదింతలు మత్తునిచ్చే లిక్విడ్ గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుండడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. కొంత మంది స్మగ్లర్లు మరింత కిక్కు కోసం ద్రవ గంజాయిలో ఐసో ప్రోఫైల్ అనే ఆల్కాహాల్‌ను కలుపుతున్నారని తెలుస్తోంది. ఇటువంటి ద్రవ గంజాయిని స్వీకరించిన వారు సైకో మనస్తత్వంతో ప్రవర్తించడంతో పాటు త్వరగా అనారోగ్యానికి గురవుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన జిల్లాలోని చాలా ప్రాంతాల్లోనూ గంజాయితో పాటు ద్రవపు గంజాయి కూడా లభిస్తోంది. ముఖ్యంగా రాజమహేంద్రవరంలోని కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న ప్యాకెట్లు రూపంలో గంజాయి లభిస్తుండడంతో చారిత్రక నగరంలో నిత్యం అలజడి రేగుతోంది. యువతరం ఉజ్వల భవిష్యత్ నాశనం అవుతుండడంతో పాటు నగర వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి నెలకొంది. చారిత్రక ఆధ్యాతిక నగరంలో ప్రశాంతంగా బతకలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గతంలో గంజాయి అక్రమ రవాణాకు కూలీలను స్మగ్లర్లు నియమించుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యువకులు, విద్యావంతులు, చిరుద్యోగులు, మహిళలు డబ్బుకు ఆశపడి గంజాయి స్మగ్లింగ్‌లో భాగస్వాములవుతున్నారు. పోలీసులకు చిక్కి జైలుపాలై భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. పోలీసుల నిఘా మరింత పెరిగితేనే ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని పలువురు అంటున్నారు.
25 కిలోలతో లీటరు ద్రవ గంజాయి
ఏజెన్సీ నుంచి సేకరించిన గంజాయి ఆకులను స్మగ్లర్లు ప్రత్యేకంగా తయారు చేసుకున్న గానుగలో వేసి పిప్పు చేస్తున్నారు. కొద్దిసేపటికి అది ద్రవంగా మారితే క్యాన్లు, బాటిళ్లలో నింపుతున్నారు. నాణ్యతను బట్టి సుమారు 20 నుంచి 25 కిలోల గంజాయిని గానుగ ఆడితే ఒక లీటర్ హ్యాస్ ఆయిల్ తయారవుతుంది. అంటే ఒక లీటర్‌ను ఇతర రాష్ట్రాలకు తరలించారంటే, సుమారు 25 కిలోల గంజాయి తరలించినట్టే. ఇలా చేయడం వల్ల రవాణా సులువవుతోంది. అందుకనే స్మగ్లర్లు కొన్నాళ్లుగా ఈ పద్ధతిని ఎంచుకుని ఒడిశా సరిహద్దులోని కొన్ని ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలా మార్చేశారు. పోలీసుల కన్నుపడని చోట గానుగలు ఏర్పాటు చేసి ద్రవ గంజాయిని తయారు చేసి అక్రమంగా తరలిస్తున్నారు.


