రేపు రేషన్‌ డీలర్ల ధర్నా | - | Sakshi
Sakshi News home page

రేపు రేషన్‌ డీలర్ల ధర్నా

Aug 30 2026 12:09 AM | Updated on Aug 30 2026 12:09 AM

అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బుంగా రాజు

దేవరపల్లి: రేషన్‌ పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని జిల్లా రేషన్‌ డీలర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు బుంగా రాజు అన్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్‌ వద్ద సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా రేషన్‌ డీలర్లు శాంతియుత ధర్నా చేస్తారని, దీనిని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే అంతంత మాత్రం ఆదాయంతో కుటుంబాలను నెట్టుకొస్తున్న డీలర్ల బతుకుల గురించి పట్టించుకోని ప్రభుత్వం, నూతన విధానాలతో పనిభారం పెంచుతుందని వాపోతున్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి రేషన్‌ డిపోకు సరఫరా చేస్తున్న ప్రతి బియ్యం బస్తాను దిగుమతి సమయంలో డీలర్లు క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ చేసిన అనంతరం దుకాణంలో దించుకోవాల్సి వస్తుందన్నారు. కార్డుదారులకు బియ్యం పంపిణీ సమయంలో బస్తాను కాటాపై ఉంచి మరోసారి స్కానింగ్‌ చేసి, తూకం నమోదైన తర్వాత కార్డుదారులకు పంపిణీ చేయాలన్నారు. ఈ విధంగా ప్రతి బస్తాను రెండు సార్లు డీలర్‌ స్కానింగ్‌ చేయాల్సి వస్తుందన్నారు. ఈ విధానం వల్ల డీలర్లపై పనిభారం పెరగడంతో పాటు, కార్డు దారులకు సకాలంలో బియ్యం అందని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఈ విధానాన్ని నిలుపుదల చేయాలని, కిలో బియ్యానికి రూ. 1 నుంచి రూ.3 ఇవ్వాలని, ఇంటింటికి రేషన్‌ పంపిణీకి రవాణా ఖర్చులు చెల్లించాలని, ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లోనే బియ్యం బస్తాను క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ చేసి పంపించాలని, తదితర డిమాండ్లతో ఈ ధర్నా జరుగుతుందని రాజు తెలిపారు.

నత్తనడకన పొగాకు విక్రయాలు

దేవరపల్లి: వర్జీనియా పొగాకు అమ్మకాలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ ఏడాది పొగాకు అమ్మకాలు ప్రారంభించి 5 నెలలు కావస్తున్నా నత్తనడకన జరుగుతున్నాయి. గరిష్ఠ ధర కిలో రూ.293 పలుకుతున్నా, కనిష్ఠ ధర రూ.145 వస్తుంది. ఎక్కువ శాతం బేళ్లు కిలో రూ.145 నుంచి రూ.160 మధ్య ధర పలుకుతుండడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. శనివారానికి టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో రూ. 503.88 కోట్ల విలువైన 20.56 మిలియన్ల కిలోల వర్జీనియా పొగాకు విక్రయాలు జరిగినట్టు రిజినల్‌ మేనేజర్‌ జె.సురేంద్రకుమార్‌ తెలిపారు. దేవరపల్లి వేలం కేంద్రంలో 3.16 మిలియన్ల కిలోల విక్రయాలు జరగ్గా, కిలో సగటు ధర రూ. 239.84, జంగారెడ్డిగూడెం–1 వేలం కేంద్రంలో 4.45 మిలియన్ల కిలోల విక్రయాలు జరగ్గా, కిలో సగటు ధర రూ. 245.38, జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రంలో 4.82 మిలియన్ల కిలోల విక్రయాలు జరగ్గా, కిలో సగటు ధర రూ. 245.67, కొయ్యలగూడెం వేలం కేంద్రంలో 4.24 మిలియన్ల కిలోల విక్రయం జరగ్గా, కిలో సగటు ధర రూ 245.67, గోపాలపురం వేలం కేంద్రంలో 3.87 మిలియన్ల కిలోల విక్రయం జరగ్గా, కిలో సగటు ధర రూ. 250.67 రైతులకు లభించినట్టు ఆయన తెలిపారు. శనివారం ఐదు వేలం కేంద్రాలకు 3,979 బేళ్లు అమ్మకానికి రాగా, 2696 బేళ్లు కొనుగోలు చేశారు. 1,283 బేళ్లను తిరస్కరించారు.

ఏసీబీ వలలో వీఆర్వో

రూ.16,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం

ఆత్రేయపురం : మండలంలోని ర్యాలి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) చొల్లంగి నాగేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కారు. మ్యూటేషన్‌ కోసం దరఖాస్తు చేసిన రైతు లక్ష్మీ ప్రసన్న నుంచి రూ.16,500 లంచం డిమాండ్‌ చేయడంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం పక్కా ప్రణాళికతో దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి రాజమహేంద్రవరం ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ భవ్య కిషోర్‌ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ర్యాలి గ్రామానికి చెందిన బాధిత రైతు చిన్నం లక్ష్మీ ప్రసన్నకు సర్వే నంబర్‌ 381/6లో తొమ్మిది ఎకరాల భూమికి సంబంధించిన మ్యూటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సమస్య పరిష్కరించేందుకు వీఆర్వో నాగేశ్వరరావు ఆమె నుంచి లంచం డిమాండ్‌ చేశారు. అందుకు అనుమతించిన లక్ష్మీ ప్రసన్న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారి సూచన మేరకు శనివారం ర్యాలి గ్రామ సచివాలయంలో వీఆర్వోకు రూ.16,500 నగదు అందించారు. ఆ మొత్తాన్ని ఆయన తీసుకొని తన చొక్కా జేబులో పెట్టుకున్నారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్వోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు భవ్యకిషోర్‌ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ అధికారులు వి.భాస్కరరావు, గోవిందరాజులు, వాసు కృష్ణ, సతీష్‌, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్వో నాగేశ్వరరావు స్వస్థలం ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామ శివారు పాటిచెరువు. ఆయన ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని అపార్ట్‌మెంట్‌లో సొంత ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఆయన భార్య రాజమమేంద్రవరంలో వీఆర్వోగా పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement