● దోసకాయలపల్లిలోని
ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్‌లో ఘటన
● 62 మందికి ఆసుపత్రిలో చికిత్స
కోరుకొండ: కలుషిత ఆహారం తిని ఓ ప్రైవేట్ విద్యా సంస్థకు చెందిన హాస్టల్‌లో శనివారం 62 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారంతా వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. ఇందులో ఆరో తరగతి విద్యార్థిని బండి భవానీశంకరి రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కోరుకొండ మండలం దోసకాయలపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్‌లో మొత్తం 172 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 12–18 ఏళ్ల వయసు పిల్లల్లో బాలురు 20 మంది, బాలికలు 42 మంది అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి నుంచి అస్వస్థతకు గురవుతుండడంతో సంస్థ యాజమాన్యం స్థానిక పీహెచ్‌సీ వైద్యులను ఆశ్రయించింది. దీంతో దోసకాయలపల్లి పీహెచ్‌సీ వైద్యులు ఎం.తరణి ఆధ్వర్యంలో వైద్య సేవలందించారు. ముగ్గురు విద్యార్థులకు అక్కడి పీహెచ్‌సీలో చికిత్స చేశారు. అలాగే స్కూల్‌లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, మందులు, ఇంజెక్షన్లు, సిలైన్లు ఎక్కించారు. దీంతో శనివారం మధ్యాహ్నానికి పరిస్థితి అదుపులోకి వచ్చింది.
అదే కారణమా?
హాస్టల్‌లో విద్యార్థులకు ఇచ్చిన ఆహారం కలుషితం కావడంతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ నెల 27న తీసుకున్న కోడి మాంసం, 28న ఉదయం మైసూర్ బజ్జీలో ఉపయోగించిన పిండి, నూనె నాణ్యత విషయమై వైద్య, ఆరోగ్యశాఖాధికారులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
మెరుగైన పరిస్థితి
ఆరో తరగతి విద్యార్థిని బండి భవానీశంకరిని రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో చేర్పించగా వైద్య సేవల అనంతరం పరిస్థితి మెరుగుపడింది. రెండు రోజులుగా విరేచనాలతో ఆమె ఇబ్బంది పడింది. అత్యవసర విభాగంలో వైద్య సేవల అనంతరం ఆమె పరిస్థితి మెరుగుపడింది. ఇదిలా ఉంటే విద్యా సంస్థలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ పితాని కోమల తదితరులు పరిశీలించారు. ఓపీ రిజిస్ట్రేషన్ ప్రకారం 62 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు తెలిపారు. దోసకాయలపల్లి పీహెచ్‌సీ వైద్యులు ఎం.తరణి, సూపర్‌వైజర్ టీవీ నాగప్రసాద్, వర్మ, తదితర సిబ్బంది వైద్య సేవలు అందించారు. ఆర్‌ఐఓ శారద, డీఈఓ వాసుదేవరావు, కోరుకొండ తహసీల్దార్ ఎం.సునీత, ఎంపీడీఓ బత్తిన అశోక్‌కుమార్, ఎంఈఓ కుశలవదొర, కోరుకొండ సీఐ ఎస్‌వీవీఎస్ మూర్తి తదితరులు పరిస్థితిని పర్యవేక్షించారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణం
దోసకాయలపల్లిలోని ప్రైవేట్ విద్యా సంస్థలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అలాగే విద్యార్థులతో మాట్లాడారు. కలుషిత ఆహారం తీసుకోవడంతో చాలామంది రోగాలకు గురవుతున్నారని, అధికారుల తనిఖీలు లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కర్రి నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు గొల్లపల్లి ప్రవీణ్‌కుమార్, వైఎస్సార్ సీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కడవల శివ, నాయకుడు నీరుకొండ బాబ్జి పాల్గొన్నారు.


