పంచదార్ల కొండ ‘నో మైనింగ్ జోన్’గా ప్రభుత్వం ప్రకటన
జీవో ఇచ్చి 48 గంటలు గడవక ముందే బేఖాతరు
భారీ యంత్రాలతో మళ్లీ మొదలైన అక్రమ మైనింగ్
స్థానిక ఎంపీ సీఎం రమేష్ బంధువు బరితెగింపు
సాక్షి, అనకాపల్లి: పవిత్ర పంచదార్ల కొండపై అక్రమ మైనింగ్ ఆగడం లేదు. ప్రభుత్వం జీవో జారీ చేసి 48 గంటలు కూడా గడవక ముందే అక్రమార్కులు మళ్లీ భారీ యంత్రాలతో తవ్వకాలు ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలోని శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రమైన పంచదార్ల కొండపై రెండు నెలలుగా కూటమి నేతలు అక్రమ తవ్వకాలకు పాల్పడడం.. దీనిపై గ్రామస్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడం తెలిసిందే. ఈ దందాపై ‘సాక్షి’ వరుస కథనాలు ఇవ్వడం.. వైఎస్సార్‌సీపీ ఢిల్లీ దాకా ఉద్యమించడంతో ప్రభుత్వం దిగొచ్చింది.
ఈ నెల 27న పంచదార్ల కొండను ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటిస్తూ జీవో 226 జారీ చేసింది.అయితే, ప్రభుత్వం ఇచ్చిన జీవోను సైతం అక్రమార్కులు లెక్కచేయడం లేదు. జీవో వచ్చిన రెండు రోజుల్లోనే, స్థానిక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బంధువు మైనింగ్ చేస్తున్న ప్రాంతానికి పక్కనే శనివారం మళ్లీ అక్రమ తవ్వకాలు మొదలుపెట్టినట్లు స్థానిక ప్రజలు వెల్లడించారు. ఈ విషయం అధికారులకు తెలిసినా, ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి ముసుగులో, పారిశ్రామిక పార్కు పేరుతో మైనింగ్ శాఖ కనీస అనుమతులు కూడా లేకుండా రెండు నెలలుగా రాత్రి, పగలు తేడా లేకుండా 3 నుంచి 4 లక్షల క్యూబిక్ మీటర్ల మేర గ్రావెల్‌ను తవ్వేశారు. ప్రశ్నించిన వారిని లారీలతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ తతంగంపై సాక్షి, వైఎస్సార్‌సీపీ పోరాటంతో ప్రభుత్వం దిగొచ్చి జీవో జారీ చేసినా, స్థానిక మాఫియా దానిని ఏ మాత్రం ఖాతరు చేయక పోవడం గమనార్హం. దీనిపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్, పోలీసు శాఖ అధికారులు తక్షణం స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


