పూజలు చేసి.. డబ్బులు రెట్టింపు చేస్తానని.. | Assassination in Markapuram district | Sakshi
Sakshi News home page

పూజలు చేసి.. డబ్బులు రెట్టింపు చేస్తానని..

Aug 30 2026 5:15 AM | Updated on Aug 30 2026 5:15 AM

Assassination in Markapuram district

మహిళను నమ్మించి రూ.25లక్షలు తీసుకున్న మరో మహిళ 

డబ్బులు స్వాహా చేసి మహిళ హత్య 

మార్కాపురం జిల్లాలో దారుణం 

బేస్తవారిపేట: తాను పూజలు చేసి డబ్బును రెట్టింపు చేస్తానని నమ్మించి రూ.25లక్షలు తీసుకుని ఓ మహిళను మరో మహిళ దారుణంగా హత్య చేసి పొలంలో పూడ్చిపెట్టింది. ఈ ఘటన మార్కాపురం జిల్లా అర్థవీడు మండలం వీరభద్రాపురంలో జరిగింది. కంభం పోలీస్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మల్లికార్జున శనివారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం... వీరభద్రాపురానికి చెందిన గుమ్మా రాజమ్మ తాను డబ్బులు పెట్టి పూజలు చేస్తే రెట్టింపు అవుతాయని పెద్దారవీడు మండలం ప్రగళ్లపాడుకు చెందిన ముడమంచు ఆదిలక్ష్మి(33)ని నమ్మించింది.

రాజమ్మకు ఆదిలక్ష్మి రూ.25లక్షలు ఇచ్చి పూజలు చేసి డబ్బులు రెట్టింపు చేయాలని కోరింది. అయితే, జూన్‌ 21 నుంచి ఆదిలక్ష్మి కనిపించకపోవడంతో ఆమె భర్త బాలగురవయ్య పెద్దారవీడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణలో గుమ్మా రాజమ్మను అనుమానితురాలిగా పోలీసులు గుర్తించారు. డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని గుమ్మా రాజమ్మ తన భర్త బుజ్జి గురవయ్యతో కలసి ఆదిలక్ష్మిని హత్య చేసి వీరభద్రాపురంలోని తమ పంటపొలంలో పూడ్చిపెట్టారని నిర్ధారించారు. ఆమె సెల్‌ఫోన్‌ను సమీపంలోని చెక్‌డ్యామ్‌లో పడేశారని గుర్తించారు.

ఆదిలక్ష్మి మృతదేహాన్ని శనివారం పోలీసులు బయటకు తీసి తహశీల్దార్, జిల్లా ఫోరెన్సిక్‌ అధికారుల సమక్షంలో శవపంచనామా నిర్వహించారు. నిందితులు రాజమ్మ, బుజ్జి గురవయ్యను సోమ­వారం కోర్టులో హాజరుపరుస్తామని సీఐ తెలిపారు. నారాయణరెడ్డిపల్లెకు చెందిన రవిని కూడా రాజమ్మ ఇదే తరహా­లో నమ్మించి రూ.45లక్షలు తీసుకున్నారని చెప్పారు. దా­ని­లో రూ.16లక్షల మేర ఆదిలక్ష్మికి ఇచ్చారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement