చంద్రబాబు ప్రభుత్వంలో కుట్టు టెక్నాలజీ, పిన్నీస్ విప్లవం!
అత్యంత నాసిరకంగా ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్లు
చిరిగిన బ్యాగులకు కుట్లు, పిన్నీసులతో పిల్లల పాట్లు
చాలా చోట్ల స్కూళ్లలోనే మూలుగుతున్న కిట్లు
కాళ్లకు సరిపోని బూట్లతో విద్యార్థుల అవస్థలు
పథకం అమలుకు ఏకంగా రూ.867.56 కోట్లు
నాణ్యత తనిఖీలకు అదనంగా నిధులు కేటాయించినా ఫలితం శూన్యం
విద్యారంగంలో మంత్రి లోకేశ్ ఘోర వైఫల్యాలకు మరో నిదర్శనం
పిల్లలకు రెండున్నరేళ్ల క్రితం నాటి ‘జగనన్న బ్యాగులే’ దిక్కు
వైఎస్సార్‌సీపీ హయాంలో తొలిరోజే పిల్లలకు నాణ్యమైన కిట్లు
‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్
ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. క్వాంటమ్ కంప్యూటింగ్.. నాలుగో పారిశ్రామిక విప్లవం.. అంటూ తండ్రి కబుర్లు! గాలిలో మేడలు కట్టేస్తారు! మరోవైపు తనయుడు ఏసీ రూముల్లో రెడ్‌బుక్ లెక్కలు చూసుకుంటూ.. ‘ఎక్స్’ వేదికగా రాజకీయ ప్రత్యర్థులపై విషం చిమ్మే పనిలో మునిగి తేలుతుంటారు!! విద్యాశాఖ మంత్రిగా ఉంటూ రాష్ట్రంలో విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారు. గత ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి, విద్యార్థులకు ట్యాబ్‌లు అందించి చదువుల్లో రాణించేలా ప్రోత్సహిస్తే.. చంద్రబాబు సర్కారు అందించింది ‘కుట్టు టెక్నాలజీ’ ‘పిన్నీసు విప్లవం..’ అని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండున్నర నెలలు దాటుతున్నా విద్యార్థులకు అందించాల్సిన ‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌విద్యార్థి మిత్ర’ కిట్ల పంపిణీకి పూర్తి స్థాయిలో మోక్షం లభించలేదు. బ్యాగులకు జిప్పులు వేద్దామని ప్రయత్నిస్తే జారి చేతికొచ్చేస్తున్నాయి. పుస్తకాలు అమర్చి బ్యాగు పట్టుకుంటే అంచులు వదిలేస్తున్నాయి. భుజానికి తగిలించుకుంటే కాడలు తెగిపోతున్నాయి. దీంతో ఏ విద్యార్థి చేతిలో బ్యాగు చూసినా కుట్ల అల్లికలు.. పిన్నీసుతోనే దర్శనమిస్తున్నాయి. ఇక బూట్ల క్వాలిటీ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. పిల్లల పాదాల కొలతలతో సంబంధం లేకుండా ఇచ్చిన బూట్లలో ఒక్కో దాంట్లో రెండు కాళ్లు పెట్టవచ్చు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పాఠశాలలు తెరిచిన తొలిరోజే విద్యార్థుల చేతుల్లో మెరిసిన విద్యా కానుక కిట్లను గుర్తు చేసుకుంటూ చదువుల పట్ల చంద్రబాబు సర్కారు అలసత్వంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. గత్యంతరం లేక గత ప్రభుత్వంలో ఇచ్చిన ‘జగనన్న బ్యాగులు’ దుమ్ముదులిపి మళ్లీ భుజాన వేసుకుంటున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షిస్తున్న శాఖలో రూ.వందల కోట్లతో అమలు చేస్తున్న పథకం
డొల్లతనం చిరిగిన బ్యాగుల సాక్షిగా బట్టబయలైంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూటమి సర్కారు పంపిణీ చేసిన నాసిరకం ‘పచ్చ’ కిట్ల దయనీయ దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్!
– సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/నెట్‌వర్క్
పుస్తకాల బరువుకు తొలి రోజే ఫట్..
కర్నూలు జిల్లా ఏపీ మోడల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న ధనరాజ్ పాఠశాల తెరిచిన తర్వాత ఎప్పుడెప్పుడు బ్యాగులు ఇస్తారా? అని ఆశగా ఎదురు చూశాడు. ఆలస్యంగా చేతికి రాగానే పుస్తకాలన్నీ సర్ది సంబరపడ్డాడు. కానీ ఆ ఆనందం ఒక్క రోజు కూడా నిలవలేదు. పుస్తకాల బరువుకు బ్యాగు బెల్టులు చేతికొచ్చేశాయి. అడుగు భాగం ఊడిపోయింది. దీంతో మళ్లీ జగనన్న ఇచ్చిన పాత బ్యాగు దుమ్ము దులిపి పుస్తకాలు సర్దుకొని స్కూల్‌కు వెళుతున్నాడు.
సగం బ్యాగులో.. సగం చేతిలో
ప్రకాశం జిల్లా మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాల్లో ఏ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చూసినా ఒకటే దృశ్యం. పిల్లల భుజాన బ్యాగు కనిపిస్తున్నా సగం పుస్తకాలు చేతుల్లోనే ఉంటున్నాయి. నాసిరకం బ్యాగు కాడలు తెగిపోయి పుస్తకాలు రోడ్డున పడతాయనే భయంతో మోసుకుని వెళ్తున్నారు. బ్యాగులకు జిప్పులు ఊడిపోవడంతో పిన్నీసులు పెడుతున్నారు. అధ్వానంగా ఉండటంతో జిల్లాలో 24 శాతం (40 వేల కిట్లు) పాఠశాలల్లోనే మూలుగుతున్నాయి. కొందరు పిల్లలు మూడేళ్ల క్రితం నాటి జగనన్న బ్యాగులనే వినియోగిస్తున్నారు.
బుజ్జి బాబుకు బూట్లు షాక్..!
అనంతపురం రూరల్ రాజీవ్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న చిన్నారి శశికి ‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌విద్యార్థి మిత్ర’ కిట్ అందింది. ఎంతో సంబరంగా కొత్త షూస్ తొడుక్కోవడానికి ప్రయత్నిస్తే ఒకే దాంట్లో రెండు కాళ్లు దూరిపోయేంత పెద్దవిగా ఉండటంతో బిక్కమొహం పెట్టాడు. వాటిని ధరించి నడవడానికి యత్నిస్తే కాళ్ల నుంచి ఊడిపోతుండటంతో ఇంట్లో పక్కన పెట్టి పాత చెప్పులతో బడి బాట పట్టాడు.
బ్యాగులకు పిన్నీస్ టెక్నాలజీ..!
టెక్కలికి చెందిన ఒక విద్యార్థి ఉదయాన్నే బడికి బయల్దేరేందుకు సిద్ధమయ్యాడు. కొత్త బ్యాగులో పుస్తకాలు సర్ది భుజాన వేసుకోబోయాడు. అంతే.. జిప్ ఊడిపోయింది. కాడలు తెగిపోయాయి. అంచులు చిరిగిపోయాయి. బ్యాగ్ లోపలి నుంచి కిందకి పడిపోతున్న పుస్తకాలను గమనించిన విద్యార్థి తల్లి ఉపాయంగా పిన్నీస్ టెక్నాలజీ అమలు చేసింది! బ్యాగు అంచులకు, జిప్పు భాగానికి పిన్నీసులు అమర్చి ఎలాగోలా పిల్లాడిని స్కూలుకు పంపించింది!!
చేతిలో బూట్లు.. జేబులో పిన్నీసులు..!
ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిల్లలకు పంపిణీ చేసిన కిట్లలో నాణ్యత లోపించడమే కాకుండా బూట్ల సైజులు తలనొప్పిగా మారాయి. విద్యార్థుల పాదాల కొలతలతో సంబంధం లేకుండా ఇష్టమొచ్చిన సైజుల్లో షూలు పంపిణీ చేయడంతో పిల్లలు వాటిని ధరించలేక చేతుల్లో పట్టుకుని ఇళ్లకు వెళ్తున్నారు.
⇒ శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, నరసన్నపేట మండలాల్లో బ్యాగులు పంపిణీ చేసిన మూడు వారాలకే కుట్లు విడిపోయాయి. దీంతో విద్యార్థులు పిన్నీసులు పెట్టుకుని బడికి వెళ్తున్నారు. గుండవల్లిపేట ప్రాథమిక పాఠశాలలో 40 మందికి పంపిణీ చేసిన బూట్ల సైజులు సరిపోక కొత్త షూలు కొనుక్కోవాల్సి వచ్చింది.
⇒ విశాఖపట్నం జిల్లాలోని 594 పాఠశాలల పరిధిలో 70 వేల మంది విద్యార్థులకు ఇచ్చిన మెజారిటీ బ్యాగులకు బెల్టులు, జిప్పులు ఊడిపోయాయి. బయట మార్కెట్లో రూ.800 నుంచి రూ.1,000 పెట్టి కొనుక్కోలేక ‘జగనన్న’ బ్యాగులనే తెచ్చుకుంటున్నారు.
⇒ అనకాపల్లి జిల్లాలో కొత్తగా చేరిన 8 వేల మంది విద్యార్థులకు ఇప్పటికీ అసలు కిట్లే అందలేదు. ఇచ్చిన బ్యాగులు కూడా వారం రోజుల్లోనే పిగిలిపోవడంతో పాతవాటికే కుట్లు వేయించుకుని పాఠశాలలకు వస్తున్నారు.
నాసిరకం మెటీరియల్..
గోదావరి జిల్లాల్లో విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా వేలాది మంది విద్యార్థులకు కిట్లు పంపిణీ కాలేదు.
⇒ ఏలూరులో గతేడాది 1,19,118 మంది విద్యార్థులు ఉండగా ఈసారి ఐదు వేల బ్యాగులు తగ్గించి 1,14,575 బ్యాగులకే ఇండెంట్ పెట్టారు. తీరా ఇచ్చిన అరకొర బ్యాగులు కూడా రెండు నెలలకే జిప్పులు ఊడిపోయి నిరుపయోగంగా మారాయి.
⇒ తూర్పు గోదావరి జిల్లాలో 1,148 పాఠశాలల్లో చదువుతున్న 93,849 మంది విద్యార్థులకు కిట్లు పూర్తిస్థాయిలో అందలేదు. ఇచ్చిన బ్యాగులూ చిరిగిపోవడంతో విద్యార్థులు సివిల్ డ్రెస్‌లు, సొంత బ్యాగులతో బడికి రాక తప్పడం లేదు.
⇒ కాకినాడ జిల్లాలో 1,28,988 మంది విద్యార్థులకు ఇచ్చిన బ్యాగుల్లో నాణ్యత లేకపోవడంతో రెండు నెలలకే పాడైపోయాయి. దీంతో సొంత డబ్బులతో కొత్త బ్యాగులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది.
⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 85,207 మంది విద్యార్థులకు కిట్లు ఇవ్వాల్సి ఉండగా ఆగస్టు ముగుస్తున్నా ఇంకా 900 మందికి అందలేదు. ఇచ్చిన హ్యాండిల్స్ ఊడిపోతుండటంతో నెల రోజులకే బ్యాగులు మూలనపడ్డాయి.
బుక్స్ బరువుకు బ్యాగులు ‘ఫట్’..
కోస్తాంధ్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు దాటినా కిట్లు అరకొరగానే అందాయి. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 3 జతల యూనిఫాంను కూటమి సర్కారు 2 జతలకు కుదించి కుట్టు కూలి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయకుండా ఎగ్గొట్టింది.
⇒ నెల్లూరు జిల్లాలోని 3,221 ప్రభుత్వ పాఠశాలల్లో 1.54 లక్షల మంది విద్యార్థుల్లో 6,677 మందికి ఇప్పటికీ బ్యాగులు అందలేదు. మరో 40 వేల మందిని బెల్టులు, బూట్లు, సాక్స్ కొరత వేధిస్తోంది. టెన్త్ విద్యార్థులు రోజూ మోసే 32 పుస్తకాల బరువుకు నాసిరకం బ్యాగులు ‘ఫట్’ మంటున్నాయి.
⇒ ఉమ్మడి ప్రకాశం జిల్లావ్యాప్తంగా 1.71 లక్షల మందికి కిట్లు ఇవ్వాల్సి ఉండగా తీవ్ర నాణ్యతా లోపంతో ఏకంగా 24 శాతం (40 వేల కిట్లు) పాఠశాలల్లోనే మూలుగుతున్నాయి. బ్యాగుల జిప్పులు ఊడిపోవడం, కాడలు తెగిపోవడంతో విద్యార్థులు పిన్నీసులు పెట్టుకుని, సగం పుస్తకాలు చేతుల్లో పట్టుకుని దయనీయంగా బడిబాట పడుతున్నారు.
లెక్కలు దేవుడెరుగు
కృష్ణా జిల్లాలో అధికారికంగా పంపిణీ సంఖ్య స్పష్టంగా వెల్లడించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం విద్యార్థులకు బ్యాగులు, బూట్లు సరిగ్గా అందలేదని, ఇచ్చిన కొన్నింటిలో తీవ్ర నాణ్యతా లోపాలు ఉన్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
సీఎం సొంత జిల్లాలో సగం మందికే..!
సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో పిల్లల దుస్థితి మరింత దయనీయంగా ఉంది. బడి తెరిచి నెలలు కావస్తున్నా డీఈవో ఆఫీసు పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే బ్యాగుల పంపిణీ పూర్తి కాలేదు. చిత్తూరు నగరంలోని గిరింపేట మున్సిపల్ స్కూల్‌లో పిల్లలు బ్యాగుల ముఖమే చూడలేదు.
⇒ తిరుపతి జిల్లాలో పంపిణీ చేసిన 60 శాతానికి పైగా బ్యాగుల హ్యాండిళ్లు, బెల్టులు అప్పుడే తెగిపోయాయి. పుస్తకాల బరువును ఆ బ్యాగులు మోయలేక చిరిగిపోతుంటే.. సమగ్ర శిక్ష అధికారులు మాత్రం అంతా బాగుందంటూ ఏసీ రూముల్లో కూర్చుని ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు పంపుతున్నారు.
కిట్లు ఆలస్యం.. అందినవి ఖేల్ ఖతం!
కర్నూలు జిల్లాలో 1,445 పాఠశాలల్లో 2,63,521 మంది విద్యార్థులకు గాను 1.83 లక్షల మందికే బ్యాగులందాయి. జూలై చివరి వరకు పంపిణీ ఆలస్యమవడమే కాకుండా 30–40 శాతం బ్యాగులు వారం రోజుల్లోనే చిరిగిపోయాయి. కోడుమూరు బాలికల స్కూలులో మూడు నెలలైనా కిట్లు అందలేదు.
⇒ అనంతపురంలో 1,91,905 మందికి పంపిణీ చేసినట్లు చెబుతున్నా నెల రోజుల్లోనే బ్యాగులకు చిరుగులు పడ్డాయి. సైజులు సరిపోని బూట్లతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.
నాడు ‘జగనన్న కానుక’
నేడు బాబు సర్కారు ‘శిక్ష’!
వైఎస్సార్‌సీపీ హయాంలో ‘జగనన్న విద్యా కానుక’ కింద బడి తెరిచిన తొలిరోజే అత్యుత్తమ నాణ్యతతో 3 జతల యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, ఏడాదంతా చెక్కుచెదరని బ్యాగ్, సైజులకు తగ్గ షూస్, బెల్టు, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఇచ్చారని పిల్లలు, తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పేరు మార్చి ఇస్తున్న నాసిరకం కిట్లు వారికి శిక్షలా మారాయి. దీంతో విద్యార్థులు మళ్లీ ‘జగనన్న బ్యాగులు’ దుమ్ముదులిపి భుజాన వేసుకుంటున్నారు.
నాసిరకం కిట్లకు రూ.867.56 కోట్లు
సాక్షి, అమరావతి: సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర 2 పథకం కోసం రూ.867.56 కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు నాణ్యతపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పైగా నాణ్యత తనిఖీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం మరో విడ్డూరం. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ స్వయంగా వ్యక్తిగత పర్యవేక్షణతో విద్యార్థులకు అత్యంత నాణ్యమైన స్కూల్ బ్యాగులు, విద్యా కానుక కిట్లను అందించారని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు గుర్తు చేస్తున్నారు.
రూ.92 కోట్ల బ్యాగుల్లో నాణ్యత డొల్ల..
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర–2 పథకం కింద 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు బ్యాగులు సరఫరా చేశారు. అధికారిక లెక్కల ప్రకారం 33,07,036 మంది విద్యార్థులకు ఒక్కో బ్యాగ్‌కు రూ.278 చొప్పున మొత్తం రూ.91,93,56,008 ఖర్చు చేశారు. రూ.91.93 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి కొనుగోలు చేసిన బ్యాగులు విద్యార్థులకు కనీసం విద్యా సంవత్సరం పాటు ఉపయోగపడేలా ఉండాలి. కానీ అవి ఇలా తీసుకోగానే చిరిగిపోతున్నాయని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి.
నాణ్యత తనిఖీలకు రూ.4.38 కోట్లు..
ప్రభుత్వం కేవలం కిట్లు కొనుగోలు చేయడమే కాకుండా థర్డ్‌పార్టీ క్వాలిటీ అష్యూరెన్స్ (టీపీక్యూఏ) కోసం మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 0.5 శాతం కేటాయించింది. ఈ లెక్కన రూ.4,38,11,650 ఖర్చు చేసినట్లు చూపించారు. ఇంత మొత్తం నాణ్యత తనిఖీలకు కేటాయించిన తర్వాత కూడా బ్యాగుల నాణ్యతపై ఫిర్యాదులు రావడం గమనార్హం. అంటే తనిఖీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, రూ.4.38 కోట్లు వృథా చేశారని స్పష్టమవుతోంది.
అదనంగా రూ.37.52 కోట్లు కేటాయించినా
2026–27 విద్యా సంవత్సరానికి కిట్ల కొనుగోలుకు తొలుత రూ.830.04 కోట్లకు పరిపాలనా అనుమతి పొందగా.. అనంతరం దానిని రూ.867.56 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం సవరించినా అనుమతి ఇచ్చింది. అంటే అదనంగా రూ.37.52 కోట్లు కేటాయించారు. ఇంత భారీ బడ్జెట్ కేటాయించిన పథకంలో విద్యార్థులకు అందే బ్యాగుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. ఏకంగా రూ.867 కోట్ల విలువైన పథకం.. బ్యాగులకు రూ.91.93 కోట్లు.. నాణ్యత తనిఖీలకు మరో రూ.4.38 కోట్లు.. కేటాయించినా సరే బ్యాగులు చిరిగిపోవడం, కిట్ల పంపిణీ అస్తవ్యస్థంగా జరగటాన్ని బట్టి నాణ్యతకు తిలోదకాలిచ్చారని స్పష్టమవుతోంది.


