కన్నీటి పర్యంతమవుతున్న గ్రామస్తులు, నిర్వాసితులు
తమ ఊళ్లకు వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు కన్నీటి వీడ్కోలు
దేవుళ్లకు, గ్రామ దేవతలకు చివరి పూజలు
పుట్టిన ఊరిని వదిలి వెళ్లలేక కన్నీటి పర్యంతం
మార్కాపురం : తరతరాలుగా తమను కంటికి రెప్పలా కాపాడిన పుట్టిన ఊరు.. బాల్యం నుంచి జీవితంలోని ప్రతి మధుర జ్ఞాపకానికి వేదికైన ఇళ్లు.. కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన దేవాలయాలు.. ఇక కనిపించవనే ఆలోచనతో వెలిగొండ నిర్వాసిత గ్రామాల ప్రజలు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో మార్కాపురం జిల్లాలోని 11 గ్రామాలు ఒక్కరోజులో కనుమరుగుకానున్న నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో గ్రామస్తులు తమ ఇళ్లు, పొలాలు, పుట్టిన గడ్డను వదిలి కొత్త ప్రాంతాలకు తరలిపోతున్నారు.
చివరిసారిగా తమ గ్రామంలోని ప్రతి వీధిని, ఇంటిని, ఆత్మీయ ప్రదేశాలను చూసుకుంటూ భారమైన హృదయాలతో వీడ్కోలు పలుకుతున్నారు. విడదీయరాని అనుబంధం ఉన్న దేవాలయాల వద్ద చివరి పూజలు నిర్వహిస్తున్నారు. గొట్టిపడియలోని సీతారాముల దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి, తరతరాలుగా తమ కుటుంబాలను కాపాడిన స్వామిని వదిలి వెళ్లాల్సి వస్తోందని పలువురు కన్నీళ్లు పెట్టుకున్నారు.
సుంకేశులలోని పీర్లచావిడి వద్ద కూడా గ్రామస్తులు ప్రార్థనలు నిర్వహించారు. కొత్త ప్రాంతంలో తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. కలనూతల, చింతలముడిపి, సుంకేశుల, గుండంచర్ల, కాటంరాజు తండా, అక్కచెరువు, గొట్టిపడియ, సాయిరాంనగర్, రామలింగేశ్వరపురం, కృష్ణానగర్, పొట్టి బసవాయిపల్లి (లక్ష్మీపురం) గ్రామాలు రేపు (సోమవారం) కనుమరుగుకానున్నాయి.
ఊరు పోయె.. జ్ఞాపకాలు మిగిలె
పండుగలు, పెళ్లిళ్లు, వేడుకలతో కళకళలాడిన గ్రామాలు ఇప్పుడు ఖాళీ అవుతున్న దృశ్యాలు చూపరులను కలచివేస్తున్నాయి. పుట్టి పెరిగిన ఇళ్లు, ఆడుకున్న వీధులు, పంటలు పండించిన పొలాలు, చిన్ననాటి స్నేహితులు, గ్రామ దేవతలతో ముడిపడిన జ్ఞాపకాలను గుండెల్లో పదిలంగా దాచుకుని నిర్వాసితులు ఊరును వీడుతున్నారు. ‘ప్రాజెక్టు కోసం ఊరును వదులుతున్నాం.. కానీ మా ఊరి జ్ఞాపకాలను ఎలా వదులుకోగలం? మా పూర్వీకులు బతికిన నేల, మా పిల్లలు పెరిగిన ఇల్లు, తరతరాలుగా కొలిచిన దేవుళ్లను విడిచిపెట్టడం ఎంతో బాధగా ఉంది’ అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పునరావాసం కల్పించినా.. పుట్టిన ఊరు, పూర్వీకుల జ్ఞాపకాలు, దేవుళ్లతో ఉన్న అనుబంధాన్ని ఎక్కడికి తీసుకెళ్లగలమని 7 వేలకు మందికి పైగా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమ గ్రామాలకు ప్రజలు కన్నీటి వీడ్కోలు పలుకుతూ.. జమ్మనపల్లి, నికరంపల్లి, తిప్పాయిపాలెం, చింతకుంటలోని తాత్కాలిక నివాసాలకు తరలుతున్నారు. ఇక నిర్వాసితుల గుండెల్లో మిగిలేది ఊరు జ్ఞాపకాలే.


