కుటుంబం కోసం భర్త పడుతున్న శ్రమను తగ్గించాలని భావించిన ఓ మహిళ వినూత్నంగా ఆలోచించింది. పెనిమిటి కోసం పైసా పెసా కూడబెట్టింది. భర్తకు ద్విచక్ర వాహనం కొనిచ్చేందుకు కొంచెం కొంచెంగా డబ్బు దాచింది. అదృష్టం కూడా కలిసి రావడంతో అనుకున్న సమయానికంటే ముందే ఇంటాయనకు మోపెడ్ కొనిపెట్టి ఆయన కళ్లలో ఆనందాన్ని నింపింది.
ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ కార్యాలయం ఎదుట చిన్న టీ స్టాల్. అక్కడ టీ తయారుచేసి కాలినడకన షాప్‌లకు వెళ్లి విక్రయిస్తూ వైరా మండలం నారపనేనిపల్లికి చెందిన తడికమళ్ల విజయారావు–విజయ దంపతులు జీవనం సాగిస్తున్నారు. అయితే, ఎంత దూరమైనా కాలినడకన వెళ్తున్న విజయారావు కష్టాన్ని గమనిస్తున్న ఆయన భార్య ఎలాగైనా మోపెడ్ కొనివ్వాలని నిర్ణయించుకుంది. ధర రూ.50 వేలకు పైగా ఉంటుందని తెలుసుకుంది.

దీంతో కొన్నాళ్లుగా షాప్‌లో టీ తాగేవారు ఇచ్చే రూ.10 నాణేలను పోగేస్తూ వచ్చింది. మొన్నటి దసరా నాటికి 5వేల నాణేలతో రూ.50వేలు జమయ్యాయి. ఇంతలోనే దసరా సందర్భంగా వైరాలోని ఓ షోరూం బాధ్యులు ఎక్సెల్ మోపెడ్‌పై రూ.10వేల తగ్గింపు ప్రకటించారు. ఇంకేముంది తాను పోగేసిన నాణేలు తీసుకుని భర్త, కుమారుడితో షోరూంకు వెళ్లిన విజయ అక్కడ నగదు చెల్లించి మోపెడ్ కొనుగోలు చేసి భర్తకు బహుమతి అందించింది. భార్య ఇచ్చిన దసరా కానుకతో విజయారావు ఆశ్చర్యానికి గురయ్యాడు.
– వైరా
ఇదీ చదవండి: జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు కార్యాచరణ


