విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ ప్రభుత్వంపై రాజకీయ పార్టీలు బురదజల్లే ప్రయత్నాలు చేయడం విచారకరమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్షాలు సహకరించాలని.. ప్రభుత్వంపై విమర్శలు మాని ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు నీటి సంరక్షణపై ప్రజలకు ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. శనివారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమూరు గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గణనీయంగా విద్యుత్ వినియోగం
పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి, సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని భట్టి తెలిపారు. 2014 రాష్ట్ర విభజన సమయంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 6,648 మెగావాట్లు ఉంటే ప్రస్తుతం 20,018 మెగావాట్లకు చేరిందని వివరించారు. గతేడాది అక్టోబర్‌లో రోజువారీ విద్యుత్ వినియోగం 245.35 మిలియన్ యూనిట్లు ఉంటే, ఈ ఏడాది అక్టోబర్‌లో 335.05 మిలియన్ యూనిట్లకు చేరినా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో విద్యుత్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తోందని తెలిపారు. సాధారణంగా రాత్రివేళ గరిష్ట డిమాండ్‌ను తట్టుకునేందుకు అందుబాటులో ఉండే 3,500 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి నీటి కొరతతో ప్రభావితం అవుతోందన్నారు. ఉన్న నీటిని పొదుపుగా వాడాలన్నారు.
రైతులకు అండగా ఉపాధి పనులు
వ్యవసాయ పనులు తగ్గే పరిస్థితి ఏర్పడితే కూలీలు, రైతులకు ఇబ్బంది రాకుండా ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే 9.1 లక్షల పనులను గుర్తించామని.. అదనంగా మరో 8 లక్షల పనులను గుర్తించేలా చర్యలు చేపట్టామని భట్టి తెలిపారు. 17 లక్షల పనులను కల్పిస్తామన్నారు. సమావేశంలో ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, ఖమ్మం కలెక్టర్ దివాకర టి.ఎస్. పాల్గొన్నారు.
బీసీలకు కొత్తగా 66 కాలేజీ హాస్టళ్లు మంజూరు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న బీసీ విద్యార్థుల కోసం రాష్ట్రంలో కొత్తగా 66 వసతిగృహాలు మంజూరు చేస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ, బీసీ సంఘాల ప్రతినిధుల బృందం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో వేర్వేరుగా భేటీ అయింది.
ఈ సందర్భంగా బీసీ విద్యార్థులకు 100 వసతిగృహాలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు చెరో 50 వసతిగృహాలు మంజూరు చేయాలని కోరారు. 14 లక్షల మంది కాలేజీ విద్యార్థులకు సంబంధించిన రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలన్నారు. దీనిపై భట్టి స్పందిస్తూ 4 రోజుల్లో మంత్రులు, అధికారులతో సమావేశమై హాస్టళ్ల నిర్వహణను సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో నీల వెంకటేశ్, జిల్లపల్లి అంజి, రాజేందర్, అనంతయ్య పాల్గొన్నారు.


