గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నామినేషన్ విషయంలో ప్రభుత్వ పెద్దల ఊగిసలాట
వచ్చే నెల 15 నాటికి ముగియనున్న ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం
వీరి స్థానంలో కొత్త వారిని వెంటనే నియమించేది అనుమానమే
ఈ నెలాఖరులోపు కేబినెట్ తీర్మానం చేయకపోతే ఫిబ్రవరి వరకు వాయిదా పడినట్టే..
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే పదవీకాలం ముగియనున్న ముగ్గురు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల స్థానంలో కొత్త వారిని నామినేట్ చేసే విషయంలో ప్రభుత్వ పెద్దలు ఇంకా ఓ నిర్ణయానికి రానట్టు తెలుస్తోంది. వచ్చే నెల 15 నాటికి ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్యల పదవీకాలం ముగుస్తోంది. వీరి స్థానంలో కొత్తగా మరో ముగ్గురిని మంత్రిమండలి తీర్మానం ద్వారా నామినేట్ చేసి గవర్నర్‌కు సిఫారసు చేయాల్సి ఉంది. అయితే, వీరి స్థానంలో కొత్త వారిని నియమించే సమయంలో సామాజిక న్యాయం పాటించాలని, రెండు బీసీ, ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎప్పుడు నామినేట్ చేయాలన్న దానిపై ఇంకా ఊగిసలాట సాగుతోందనే చర్చ జరుగుతోంది.
వెంటనే చేస్తారా... జాప్యం చేస్తారా?
ఈ ముగ్గురి స్థానంలో కొత్తగా మరో ముగ్గురిని నామినేట్ చేసేందుకు ఫిబ్రవరి వరకు వేచి చూసే అంశం ప్రభుత్వ పెద్దల పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. గవర్నర్ కోటా కింద నామినేట్ చేసే ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసే లోపు కొత్తవారిని నామినేట్ చేయాలనే కచ్చితమైన నిబంధన లేదు. ఎమ్మెల్యేల కోటా, స్థానిక సంస్థల కోటా అయితే ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిర్వహిస్తుంది కాబట్టి నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. కానీ, గవర్నర్ కోటాలో ఈ నిబంధన లేనందున ఇప్పటికిప్పుడే మరో ముగ్గురిని నామినేట్ చేసేది అనుమానమేనని సమాచారం. ఇటీవల ఈ అంశంపై ప్రభుత్వ పెద్దల మధ్య చర్చ జరిగిన సందర్భంగా ఇప్పుడు తొందరేం లేదని, అన్ని సమీకరణలను క్షుణ్ణంగా పరిశీలించి సరైన సమయంలో నామినేట్ చేద్దామనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నవంబర్ 1 కల్లా మంత్రిమండలి సమావేశమై కొత్తగా ముగ్గురి పేర్లను తీర్మానం చేస్తే తప్ప గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం ఫిబ్రవరి వరకు వాయిదా పడినట్టేననే చర్చ జరుగుతోంది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల కోణంలో..
వాస్తవానికి, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో పూర్తిస్థాయిలో సామాజిక న్యాయం పాటించాలనేది ప్రభుత్వ పెద్దల ఆలోచన. వచ్చే మార్చిలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓసీ (రెడ్డి) వర్గానికి చెందిన నేతలను పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాలో మిగిలిన సామాజిక వర్గాలకు అవకాశం కల్పించనున్నారు. ఈ కోణంలోనే పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని త్వరలోనే శాసనమండలికి పంపుతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు కూడా. దీంతో ఆశావహుల జాబితాలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారితోపాటు ఇతర బీసీ, ఎస్సీ వర్గాలతోపాటు బ్రాహ్మణ, వైశ్య, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన వారి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పటికిప్పుడు బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన నేతలను గవర్నర్ కోటాలో మండలికి సిఫారసు చేయడం ద్వారా ఉపయోగం లేదని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ముందు సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా సామాజిక న్యాయం పాటించామనే సంకేతాలను ప్రజల్లోకి పంపాలనే ప్రతిపాదన వచ్చిందని సమాచారం. ఫిబ్రవరి వరకు వేచి చూసేందుకే మొగ్గు చూపారని, కానీ దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది.


