మేడిగడ్డ బరాజ్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల బృందం
లేకుంటే సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల డిమాండ్
నీటిని సముద్రంలోకి వదిలేస్తూ హైదరాబాద్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తారా?
సమస్య పరిష్కరించకపోతే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని వెల్లడి
మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి సమీప గోదావరి వద్ద నీటిమట్టం పరిశీలన
కాళేశ్వరం: హైదరాబాద్‌లో తాగునీటి సంక్షోభాన్ని నివారించేందుకు కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి వెంటనే ప్రాణహిత జలాలను ఎత్తిపోయాలని, లేనిపక్షంలో సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే హైదరాబాద్ ప్రజలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల నివాసాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్‌హౌస్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందగౌడ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సందర్శించారు.
అనంతరం కన్నెపల్లి పంపుహౌస్ గేటు వద్ద లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నీళ్లు ఎత్తిపోయకుంటే సీఎం రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. గేటు వద్ద ఇరిగేషన్ ఈఈ సురేశ్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. జూన్ నుంచి ఇప్పటివరకు 750 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు సముద్రంలో కలిశాయన్నారు. కనీసం 250 టీఎంసీల నీటిని ఎత్తిపోసినా జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వలు పెరిగేవని, భూగర్భ జలమట్టాలు మెరుగుపడటంతోపాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరేవని ఎమ్మెల్యేలు చెప్పారు.
ప్రభుత్వానికి పట్టదా?
ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మాట్లాడుతూ జూలైలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి వెళ్తున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్‌లో తలెత్తే నీటి సమస్యలపై అప్పుడే హెచ్చరించినట్లు తెలిపారు. నీటి సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ప్రజలే సీఎంకు బెల్టు ట్రీట్‌మెంట్‌తో తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. హైదరాబాద్‌కు ఏడాదికి తాగునీరు అందించేందుకు 10 టీఎంసీల నీరు సరిపోతుందని, కన్నెపల్లి నుంచి వెంటనే నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా కనీసం ఇప్పటికైనా గోదావరి జలాలను ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మూడు రోజులకు ఒకసారి తక్కువ పీడనంతో నీరు సరఫరా అవుతోందని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ముందస్తుగా జలాశయాల్లో తగినంత నీటిని నిల్వ చేసుకుని ఉంటే హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రస్తుత పరిస్థితిని నివారించగలిగే వారన్నారు. ఎమ్మెల్యే డి.సు«దీర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారంతో తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు.


