పోలీసుల పేరుతో రిటైర్డ్ ఉద్యోగినికి సైబర్ నేరగాళ్ల బెదిరింపులు
సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ అరెస్ట్’పేరుతో ఓ వృద్ధురాలిని బురిడీ కొట్టించారు. నాసిక్ పోలీసు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అధికారులమని నమ్మించారు. ఆ పేర్లతో నకిలీ పత్రాలు పంపి, అరెస్టు చేస్తామని బెదిరించి ఏకంగా రూ.1,17,20,000 కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మెట్టుగూడకు చెందిన ఓ మహిళ (71) ఈసీఐఎల్‌లో సీనియర్ పర్చేజ్ అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈమెకు గత నెల 9న ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను నాసిక్‌లోని పంచవటి పోలీసుస్టేషన్ ఎస్సై సంజయ్ పీసేనని పరిచయం చేసుకున్నాడు.
వాట్సాప్ వీడియో కాల్‌లో పోలీసు యూనిఫాంలో కనిపిస్తూ మరో వ్యక్తిని ఎన్‌ఐఏ విచారణ అధికారి జార్జ్ మాథ్యూస్‌గా పరిచయం చేశాడు. బాధితురాలి ఆధార్, వ్యక్తిగత వివరాలను దుర్వినియోగం చేసి మనీలాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారని, దానికి సంబంధించిన కేసులో ఆమె పేరును చేర్చారని నమ్మించారు. ఆమె పేరుతో రూ.2 కోట్ల లావాదేవీలు జరిగాయని, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిజిటల్ అరెస్టు చేశామని, తాము వచ్చి నేరుగా అరెస్టు చేస్తామని, ఆస్తులు స్తంభింపజేస్తామని బెదిరించారు.
ఈ మేరకు సుప్రీంకోర్టు, ఈడీ, ఆర్‌బీఐ పేర్లతో నకిలీ పత్రాలు పంపారు. పూర్వాపరాలు తనిఖీ చేయడం కోసం నిర్దేశిత ఖాతాలకు తాము సూచించిన మొత్తం బదిలీ చేస్తే మూడు బ్యాంకింగ్ పని దినాల్లో వెరిఫికేషన్ పూర్తి చేసి తిరిగి ఇస్తామని నమ్మించారు. దీంతో బాధితురాలు తన ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉపసంహరించుకోవడంతోపాటు బంగారంపై రుణం తీసుకుని, మూడు బ్యాంకు ఖాతాల నుంచి ఆరు విడతల్లో వాళ్లు డిమాండ్ చేసిన డబ్బు బదిలీ చేశారు. ఇలా మొత్తం రూ.1.17 కోట్లకు పైగా పంపిన తర్వాత మోసపోయినట్లు గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.


