నీటి ఎద్దడితో బాసర ట్రిపుల్ ఐటీలో దసరా సెలవుల పొడిగింపు
అక్టోబర్ 26 నుంచి ఆన్‌లైన్ తరగతులు..
తగ్గిన గోదావరి నీటి సరఫరా..
రోజుకు 25 లక్షల లీటర్ల నీరు అవసరం.. అందుతున్నది 15 లక్షల లీటర్లే
భైంసా: పక్కనే గోదావరి.. అయినా నీళ్లు లేని పరిస్థితి.. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీపై నీటి ఎద్దడి ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దసరా సెలవులను పొడిగించిన ట్రిపుల్ ఐటీ యాజమాన్యం..ఇప్పుడు ఆన్‌లైన్ దారి పట్టింది. తాజాగా 2026–27 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్‌కు సంబంధించిన సవరించిన అకడమిక్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. వర్షాభావంతో ఏర్పడిన పరిస్థితులు, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పీయూసీ–1 నుంచి ఈ–4 వరకు విద్యార్థులకు అక్టోబర్ 26 నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. నవంబర్ 17 నాటికి ఆన్‌లైన్ బోధన ద్వారా సిలబస్ పూర్తి చేయాలని షెడ్యూల్లో పేర్కొంది. అనంతరం దశలవారీగా విద్యార్థులను క్యాంపస్‌కు రప్పించనున్నారు.
చదువుకు ఆటంకం..
యూనివర్సిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పీయూసీ–1, పీయూసీ–2 విద్యార్థులు నవంబర్ 10న క్యాంపస్‌కు చేరుకోవాలి. నవంబర్ 10 నుంచి 18 వరకు వీరికి క్యాంపస్‌లో తరగతులు నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ ఈ–1 నుంచి ఈ–4 వరకు విద్యార్థులు నవంబర్ 18న క్యాంపస్‌కు రిపోర్ట్ చేయాలి. ఆన్‌లైన్ తరగతుల సమయంలో విద్యార్థులు క్లాస్‌రూమ్ అప్‌డేట్స్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలని యాజమాన్యం సూచించింది. ఆన్‌లైన్ బోధనతో తరగతులు కొనసాగనున్నప్పటికీ ప్రయోగశాలలపై ఆధారపడే ప్రాక్టికల్ శిక్షణ, అధ్యాపకులతో ప్రత్యక్ష పరస్పర చర్చలకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. నవంబర్ 17లోగా సిలబస్ పూర్తి చేయడం, ఆ తర్వాత క్యాంపస్‌లో తరగతులు, పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం యాజమాన్యానికి కీలకం కానుంది.
మరమ్మతులు చేపట్టి ఉంటే..
బాసర రాజీవ్‌గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయంలో సుమారు 9 వేల మంది విద్యార్థులకు తాగునీరు, వంటశాలలు, స్నానాలు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య అవసరాలకు రోజుకు 25 లక్షల లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం 15 లక్షల లీటర్లు మాత్రమే సరఫరా అవుతోంది. అయితే, గోదావరి నుంచి నీటిని తోడే పంప్‌హౌస్‌లోని ప్రధాన మోటార్లు రెండు నెలలుగా పనిచేయడం లేదని సమాచారం. ప్రత్యామ్నాయ మోటారు కూడా పనిచేయకపోవడంతో క్యాంపస్‌లోని సమ్మర్ స్టోరేజ్ చెరువులో నిల్వ ఉన్న నీటిని వినియోగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెరువులో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరడంతో ఇబ్బందులు తీవ్రమయ్యాయని సమాచారం. మోటార్లు చెడిపోయిన వెంటనే మరమ్మతులు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నీటి సమస్య పరిష్కారానికి చర్యలు
ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్
బాసర: ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ శనివారం గోదావరి నది వద్ద ఉన్న పంప్‌హౌస్‌ను సందర్శించారు. ప్రస్తుత స్థితి, వాటి పనితీరు, మరమ్మతుల అవసరాలపై అధికారులతో చర్చించారు. విశ్వవిద్యాలయంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు పంపింగ్ వ్యవస్థ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైన మరమ్మతులు త్వరగా పూర్తిచేసి నీటి సరఫరా సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.


