source: X
సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం హషీమ్ ఆమ్లా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుతో కలిసి పనిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమ్లాను తమ కోచింగ్ స్టాఫ్‌లోకి తీసుకునేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నవంబర్, డిసెంబర్ నెలల్లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న బంగ్లాదేశ్ జట్టుకు ఆయన తాత్కాలిక బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించే అవకాశముంది.
బంగ్లాదేశ్ జట్టు మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆసియా జట్ల బ్యాటర్లకు సౌతాఫ్రికా పిచ్‌లపై ఆడటం సవాలుగా ఉంటుంది. ముఖ్యంగా ఈసారి జట్టులోని పలువురు ఆటగాళ్లకు అక్కడ ఆడిన అనుభవం లేకపోవడంతో ఆమ్లా సేవలు ఉపయోగపడతాయని బంగ్లాదేశ్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆమ్లా ఘనతలు
హషీమ్ ఆమ్లా 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టుల్లో 9282 పరుగులు, వన్డేల్లో 8113 పరుగులు, టీ20ల్లో 1277 పరుగులు సాధించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 55 సెంచరీలు నమోదు చేశాడు.
రిటైర్మెంట్ తర్వాత కామెంటేటర్‌గా పనిచేస్తూనే కోచింగ్, మెంటార్ బాధ్యతలు కూడా చేపట్టాడు. కేప్‌టౌన్ బ్లిట్జ్, పెషావర్ జల్మీ జట్లతో పనిచేసిన అతడు.. 2022లో ఎంఐ కేప్‌టౌన్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2023లో లయన్స్ జట్టుకు కూడా బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.
నవంబర్ 15 నుంచి టెస్ట్ సిరీస్
బంగ్లాదేశ్ పర్యటన నవంబర్ 15 నుంచి జోహన్నెస్‌బర్గ్‌లో తొలి టెస్టుతో ప్రారంభం కానుంది. అనంతరం సెంచూరియన్‌లో రెండో టెస్టు జరగనుంది. డిసెంబర్ 13న జరిగే చివరి టీ20తో పర్యటన ముగుస్తుంది.
ఇదీ చదవండి: కోహ్లి, బుమ్రాకు షాకిచ్చిన రహానే


