source: X
యూఏఈలో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో జింబాబ్వేపై 4 వికెట్లు తీసి జట్టు విజయానికి దోహదపడిన అతడు.. తాజాగా బంగ్లాదేశ్‌పై కూడా అదే తరహా ప్రదర్శనను రిపీట్ చేశాడు. ఈ మ్యాచ్‌లోనూ 4 వికెట్లు తీసిన రషీద్ తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ ఓటమితో బంగ్లాదేశ్ ఇంటిముఖం పట్టగా.. జింబాబ్వే ఫైనల్‌కు అర్హత సాధించింది. రేపు జరుగబోయే తుది పోరులో జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొంటుంది.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ రషీద్ ఖాన్ (4-31) ధాటికి 41.2 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. ఒమర్‌జాయ్ (2-27), అహ్మద్‌జాయ్ (2-21), బిలాల్ (1-23), నబీ (1-35) బంగ్లా పతనంలో తమవంతు పాత్ర పోషించారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (70) అర్ద సెంచరీతో రాణించగా.. సైఫ్ హసన్ (41) పర్వాలేదనిపించాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో నలుగురు ఖాతా కూడా తెరవలేకపోయారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఆడుతూపాడుతూ ఛేదించింది. కెప్టెన్ రహ్మత్ షా (67 నాటౌట్), హష్మతుల్లా షాహిది (36 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇబ్రహీం జద్రాన్ 34, గుర్బాజ్ 6, సెదిఖుల్లా అటల్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, ముస్తాఫిజుర్ ఓ వికెట్ పడగొట్టారు.
ఇదీ చదవండి: రషీద్ మాయాజాలం.. ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం


