సూపర్ మార్కెట్లపై దాడి
యూరప్‌లో ఏసీ ఉష్ణోగ్రతలు జంప్
రష్యా, ఉక్రెయిన్లలో ఎమర్జెన్సీ యాప్‌లపై...
నిన్నమొన్నటివరకూ వ్యక్తులపై ఫ్రాడ్, కంపెనీ నెట్‌వర్క్‌ల హైజాక్ లేదంటే మిలటరీకి పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు రూటు మారాయి. యూరోపియన్ దేశాల్లో కొన్ని సూపర్‌మార్కెట్లలో సైబర్ దాడుల పుణ్యమా అని ఏసీ ఉష్ణోగ్రతలు వాటంతట అవే భరించలేనంత స్థాయికి చేరుకోగా.. ఐదేళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యా, ఉక్రెయిన్లలో ఎమర్జెన్సీ యాప్‌లపై హ్యాకర్లు దాడికి దిగారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. సైబర్ దాడులు మిలటరీకి మాత్రమే పరిమితం కాకుండా సామాన్యుల దైనందిన జీవితాలపై కూడా ప్రభావం చూపే స్థాయికి చేరుతూండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
స్వీడన్, బెల్జియం, లక్సంబర్గ్, ఐర్లాండ్, ఈస్టోనియా దేశాలలోని పలు సూపర్ మార్కెట్లలో నవంబర్ ఒకటవ తేదీన అనూహ్యమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఐసీఏ, కోఆప్, డెల్హాజే, క్యారీఫోర్, స్పార్, సూపర్ వాలు సూపర్‌మార్కెట్లలోని శీతలీకరణ యంత్రాలు, రిఫ్రిజరేటర్ల ఉష్ణోగ్రతలు ఎకాఎకిన 50 డిగ్రీలసెల్సియస్ దాటిపోయాయి. కొన్ని స్టోర్స్‌లో పనిచేయకుండా పోయాయని తెలిసింది. ఎక్కడి నుంచో ఈ మార్పులు చేసినట్లు అనుమానిస్తున్నారు. వేడి ఎక్కువవడంతో ఆహారం పెద్ద ఎత్తున చెడిపోయినట్లు సమాచారం. సైబర్ దాడులని అర్థం చేసుకున్న భద్రత నిపుణులు ఇప్పుడు విచారణ మొదలుపెట్టారు.
దాదాపు ఇరవై రోజుల క్రితం ఫ్రాన్స్‌లోనూ దాదాపు 700 స్టోర్ల శీతలీకరణ వ్యవస్థలు కూడా ఇలాగే సైబర్ దాడులకు గురయ్యాయి. అక్టోబర్ 11, 12 తేదీల్లో జరిగిన ఈ దాడుల కారణంగా ఫ్రీజర్లు డీఫ్రాస్ట్ మోడ్‌లోనే ఎక్కువ సమయం కొనసాగేలా చేశారు. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఇంటర్‌మార్చ్, నెట్టో, క్యారీఫోర్, మోనోప్రిక్స్, కో–ఆపరేటివ్ యూ, ఈ–లెక్‌లెర్క్‌లు ఎక్కువగా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. కొన్ని స్టోర్లలో రిఫ్రిజిరేటర్లు విపరీతంగా వేడెక్కి మంటలు కూడా వచ్చినట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌కు అనుసంధానమైన రిఫ్రిజిరేటర్ల వాడకం ఎక్కువ కావడం, భవనాల్లోని విద్యుత్తు, రిఫ్రిజిరేషన్ వ్యవస్థల నియంత్రణకు నెట్, ఏఐలను వాడుతూండటం ఈ దాడులకు కారణం కావచ్చునని అంచనా.
రష్యా, ఉక్రెయిన్లలో మరో రకంగా...
యూరప్ దేశాల్లో రిఫ్రిజిరేషన్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు జరిగితే రష్యా, ఉక్రెయిన్లలో ప్రధాన లక్ష్యం అత్యవసర పరిస్థితుల్లో హెచ్చరికలు జారీ చేసే మొబైల్ అప్లికేషన్లు! ఉక్రెయిన్‌లో ఈ యాప్‌లు తప్పుడు అలర్ట్‌లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రాజధాని కీవ్‌లో రేడియోధార్మికత విపరీతంగా పెరిగిపోయిందని, ప్రజా సంక్షోభం, విష రసాయన ప్రభావం అంటూ రకరకాల తప్పుడు సందేశాలు వచ్చాయి. ఎవరో అనధీకృతంగా ఈ మెసేజీలు పంపారని, అనుమానాస్పద లింకులను తెరవవద్దని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు.
ఆ తరువాత కొంత సమయానికి లోపాలను సరిదిద్దామని, సైబర్ దాడుల వల్ల మిలటరీ వ్యవహారాలకు ఎలాంటి నష్టమూ జరగలేదని అధికారులు వివరించారు. సమస్య కొనసాగుతూంటే సోషల్‌మీడియాను ఫాలో కావాలని, భౌతిక అలారమ్‌లను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రసారమైన తప్పుడు సందేశాల్లో అచ్చుతప్పులున్నాయని, రష్యా, ఉక్రెయిన్ భాషలు కలగలసిపోయాయని తెలిపారు. ఇదిలా ఉంటే రష్యా కూడా తాము కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నామని తెలిపింది. తప్పుడు నోటిఫికేషన్ల పంపిణీ జరిగిందని తెలిపారు. కాకపోతే ప్రజలకు హెచ్చరికలు జారీ చేసేందుకు ఉద్దేశించి మూల వ్యవస్థ.. ఎస్‌ఎంఎస్, బ్రాడ్‌కాస్ట్, సైరన్‌లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్లు తెలిపారు.


