కేరళలో విస్తరిస్తున్న ‘షిగెల్లా : ఇప్పటికే 75 కేసులు | Shigella infections spread in Keralam Malappuram 75 cases reported | Sakshi
Sakshi News home page

కేరళలో విస్తరిస్తున్న ‘షిగెల్లా : ఇప్పటికే 75 కేసులు

Nov 12 2026 3:21 PM | Updated on Nov 12 2026 3:24 PM

Shigella infections spread in Keralam Malappuram 75 cases reported

కేరళలో  మలప్పురం జిల్లాలో  మరోసారి  షిగెల్లా (Shigella)  ఇన్ఫెక్షన్ల వ్యాప్తి ఆందోళన  రేపుతోంది. జిల్లాలో మూడు ప్రాంతాల్లో షిగెల్లా ఇన్ఫెక్షన్లు నిర్ధారణ కావడంతో, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఉత్తర మలప్పురంలో కేరళ ఆరోగ్య శాఖ నిఘా , నివారణ చర్యలను ముమ్మరం చేసింది.

పీటీఐ రిపోర్ట్‌ ప్రకారం కేరళ ఆరోగ్య శాఖ చర్యలను ముమ్మరం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. తాజాగా అరీకోడ్, పుల్పట్ట, ఎడవన్న ప్రాంతాల్లో ఈ ఇన్ఫెక్షన్లను గుర్తించారు.పరిస్థితిని సమీక్షించి, వ్యాధి వ్యాప్తిని అరికట్టే చర్యలను బలోపేతం చేసేందుకు జిల్లా స్థాయి రాపిడ్ రెస్పాన్స్ టీమ్ (RRT) అత్యవసర సమావేశం నిర్వహించింది.

ఈ ఏడాది జిల్లాలో ఇప్పటివరకు ఎనిమిది కాంటాక్ట్ కేసులతో సహా 75 కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య అధికారి డాక్టర్ వి వినోద్ తెలిపారు. వీటిలో వ్యాధి సోకిన వారితో సన్నిహితంగా ఉండటం వల్ల వచ్చిన 8 కేసులు కూడా ఉన్నాయని ఆయన ఒక ఒక ప్రకటనలో తెలిపారు. ఆహార తయారీ, నిల్వ ,పంపిణీ కేంద్రాల్లో ఆరోగ్య శాఖ, స్థానిక స్వపరిపాలన సంస్థల విభాగం, ఆహార భద్రతా విభాగం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించ నున్నాయి.  నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రభావిత ప్రాంతాల్లో సామూహిక విందులను కూడా నిషేధించారు.

ఇదీ చదవండి: రూ. 7 కోట్లు కట్టండి : కేజ్రీవాల్‌కు, ఆయన కుమార్తెకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ బెదిరింపు!

షిగెల్లా - లక్షణాలు 
విరేచనాలకు కారణమయ్యే  షిగెల్లా  బాక్టీరియా ఇన్ఫెక్షన్  ఎక్కువగా పిల్లలను ప్రభావితం చేస్తుంది.  కలుషితమైన నీరు, నిల్వ ఉన్న లేదా సరిగ్గా ఉడకని ఆహారం ద్వారా ఇది వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి మలంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్‌  సోకుతుంది

ఇన్ఫెక్షన్ సోకిన ఒకటి లేదా రెండు రోజుల్లోనే లక్షణాలు కనిపిస్తాయి. వీటిలో విరేచనాలు, మలంలో రక్తం, చీము పడటం, తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరం, వాంతులు, డీహైడ్రేషన్ లాంటి లక్షణాలుంటాయి. ఎలాంటి లక్షణాలు కనిపించని వ్యాధిగ్రస్త పిల్లల మలం ద్వారా కూడా ఈ బాక్టీరియా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది. చికిత్స ఆలస్యమైతే మెదడు, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపే సమస్యలు తలెత్తవచ్చని, తీవ్రమైన సందర్భాల్లో మరణానికి కూడా దారితీయవచ్చని వైద్య  నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: 15 ఏళ్ల కొడుక్కి, రూ. 1.6 కోట్ల కారు గిప్ట్‌ : ఎందుకో తెలుసా?

ముందు జాగ్రత్తలు
ఆరోగ్య శాఖ  ప్రకటన ప్రకారం తాగడానికి,  వంట చేయడానికి కాచి చల్లార్చిన నీటిని మాత్రమే ఉపయోగించాలి. తాజాగా తయారు చేసిన , బాగా ఉడికించిన ఆహారాన్ని మాత్రమే తినాలి.  నిల్వ ఉన్న, మూత పెట్టని, బయటి ఆహారాన్ని వీలైనంత వరకు నివారించాలి. తాగునీటి వనరులను క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేయాలి. వాడకానికి ముందు పండ్లు, కూరగాయలను బాగా కడగాలి. ఈగలు , ఇతర కీటకాల ద్వారా కలుషితం కాకుండా ఆహారంపై ఎప్పుడూ మూతలు ఉంచాలి. ఆహారం తినడానికి ముందు, వంట చేయడానికి ముందు మరియు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. 

విరేచనాలతో బాధపడేవారికి డీహైడ్రేషన్ రాకుండా వెంటనే ఓఆర్ఎస్ (ORS) ద్రావణం, ఉప్పు కలిపిన గంజి లేదా కొబ్బరి నీళ్లు ఇవ్వాలి. ప్రజలు వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.

ఇన్ఫెక్షన్ మరింత వ్యాపించకుండా నిరోధించేందుకు ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య అధికారులు తనిఖీలు, ఆంక్షలను కఠినతరం చేయడంతో పాటు, సురక్షితమైన ఆహారం, నీరు, పరిశుభ్రత పద్ధతులను పాటించాలని ప్రజలకు అధికారులు సూచించారు.

ఇదీ చదవండి: 10 ఏళ్లలో అద్భుతం : క్యాన్సర్‌, అల్జీమర్స్‌ ఇక చరిత్రే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement