త్రిసూర్: కేరళలో వైద్యుల నిర్లక్ష్యానికి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన 21 ఏళ్ల మహిళకు అక్కడి వైద్య సిబ్బంది నిర్లక్క్ష్యం కారణంగా నరకం చూసింది. త్రిసూర్ జిల్లా కడప్పురం ప్రాంతానికి చెందిన మహిళ ఆగస్టు 18న చావక్కాడ్ తాలూకా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సాధారణ ప్రసవం కావడంతో ఆమెను వార్డుకు తరలించారు. అయితే గంటలోపే రక్తస్రావం కావడంతో తిరిగి లేబర్ రూమ్‌కు తీసుకెళ్లారు. అక్కడ కుట్లు తొలగించి, రక్తస్రావాన్ని నియంత్రించేందుకు ఉపయోగించిన కాటన్‌ను తొలగించినట్లు బాధితురాలు తెలిపింది.
అయితే ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆమెకు సమస్యలు తగ్గలేదు. నిరంతరం నొప్పి, రక్తస్రావ సంబంధిత ఇబ్బందులు, తీవ్రమైన దుర్వాసన వేధించాయి. దాదాపు పది రోజుల తర్వాత తిరిగి అదే ఆసుపత్రికి వెళ్లి ప్రసవం చేసిన వైద్యుడిని సంప్రదించింది. ఇన్ఫెక్షన్ వచ్చిందనే అనుమానంతో మందులు ఇచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. సెప్టెంబర్ 29న కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేటు క్లినిక్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు పరీక్షించగా కడపులో కాటన్ మిగిలిపోయినట్లు గుర్తించారు. అనంతరం దాన్ని బయటకు తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది.
ఈ ఘటనపై బాధితురాలు ఆరోగ్యశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది. మరోవైపు ప్రసవం నిర్వహించిన డాక్టర్ డిటో టామ్ స్పందించారు. రక్తస్రావం కారణంగా కాటన్ ఉపయోగించామని, రక్తస్రావం ఆగిన తర్వాత దాన్ని తొలగించామని తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని, కాటన్ పెట్టడం, తొలగించడం సహాయకుల బాధ్యత అని పేర్కొన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ. షాజ్‌కుమార్ జిల్లా వైద్యాధికారికి నివేదిక సమర్పించారు. దీంతో విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు.
ఇదీ చదవండి: ఛత్ పూజకు ‘దీపావళి పొగ’.. ఊపిరి ఆడక..


