అమ్మతో గొడవ పడి వెళ్లిపోయిన బాలిక.. అడవిలో విగత జీవిగా.. | Decomposed body of missing girl found in forest a month later | Sakshi
Sakshi News home page

అమ్మతో గొడవ పడి వెళ్లిపోయిన బాలిక.. అడవిలో విగత జీవిగా..

Nov 16 2026 5:14 PM | Updated on Nov 16 2026 5:14 PM

Decomposed body of missing girl found in forest a month later

త్రిపురలో నెల రోజుల క్రితం అదృశ్యమైన 17 ఏళ్ల బాలిక మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో అడవిలో కనిపించింది. దక్షిణ త్రిపుర జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాలిక ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతురాలు దక్షిణ త్రిపుర జిల్లాలోని బెలోనియా ప్రాంతం మైచర ఘాటి పారా గ్రామానికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఓ పోలీసు అధికారి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 11న తల్లితో గొడవ జరిగిన తర్వాత బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియకుండా పోయింది. దీంతో అక్టోబర్ 15న బాలిక కుటుంబ సభ్యులు బెలోనియా పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆమె కోసం గాలింపు కొనసాగింది. అయితే ఆదివారం స్థానికులు అడవిలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. బాలిక మరణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

కాగా, గత ఏడాది నవంబర్‌లోనూ దక్షిణ త్రిపుర జిల్లాలో ఓ బాలిక అపహరణ కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అపహరణకు గురైన బాలికను అనంతరం నేపాల్‌లో గుర్తించారు. గత ఏడాది అక్టోబర్ 19న ఆమె అదృశ్యమైంది. మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆమె దేశ సరిహద్దు దాటి నేపాల్‌లోకి వెళ్లినట్లు గుర్తించి ఆచూకీ కనుగొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement