జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో లతీఫ్ భట్ అనే లష్కరే ఉగ్రవాదితో పాటు అతడి అనుచరుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత వారం మిర్ బజార్‌లోని సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై జరిగిన దాడితో వీరికి సంబంధం ఉన్నట్టు సమాచారం.
కాగా నవంబర్ 11న జరిగిన ఈ దాడిలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. దాడి అనంతరం ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. అయితే అంతకుముందు అనంత్‌నాగ్, కుల్గామ్ ప్రాంతాల్లో జరిగిన పలు ఉగ్రదాడుల్లోనూ లతీఫ్ భట్ ప్రమేయం ఉన్నట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు కిష్త్వార్ జిల్లాలో ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (SPOలు) బాబీ చంద్, యశ్‌పాల్ కుమార్‌లను ఉగ్రవాదులు హతమార్చారు. వరుస దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సీఆర్‌పీఎఫ్ స్పెషల్ డీజీ సందీప్ ఖిర్వార్ తెలిపారు.
ఇదీ చదవండి: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి


