అప్పు తెచ్చి ఇల్లు కట్టాం.. బిల్లులు ఇవ్వండి మహాప్రభో! | Indiramma House Incident In Warangal District | Sakshi
Sakshi News home page

అప్పు తెచ్చి ఇల్లు కట్టాం.. బిల్లులు ఇవ్వండి మహాప్రభో!

Oct 6 2026 7:31 AM | Updated on Oct 6 2026 7:33 AM

Indiramma House Incident In Warangal District

వీర్నపల్లి ప్రజావాణిలో పురుగుల మందు డబ్బాతో బట్టు రోజా, ఆమె భర్త మన్య

రాజన్న సిరిసిల్ల జిల్లా: అప్పు చేసి ఇందిరమ్మ ఇంటిని పూర్తి చేశామని.. బిల్లులు ఇప్పించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో రోజా–మన్య దంపతులు పురుగులమందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు. బాధితులు మీడియాతో మాట్లాడుతూ తమ ఖాతాను అధికారులు ఫ్రీజింగ్‌లో పెట్టారని.. బిల్లులు అందక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. గొన్యానాయక్‌తండాకు చెందిన బట్టు రోజాకు 2025, మే నెలలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, బేస్‌మెంట్‌ లెవల్‌ వరకు పూర్తయినప్పుడు రూ.లక్ష లబ్ధిదారు ఖాతాలో జమచేశారు. 

ఆ తర్వాత వారం రోజుల్లోనే గోడల నిర్మాణానికి సంబంధించిన మరో రూ.లక్ష కూడా ఆమె ఖాతాలో జమైంది. అయితే ఇల్లు బేస్‌మెంట్‌ స్థాయిలోనే ఉందని గుర్తించిన అధికారులు.. లబ్ధిదారు బ్యాంకు ఖాతాను ఫ్రీజింగ్‌లో పెట్టారు. అయితే రోజా–మన్య దంపతులు అప్పు చేసి ఇంటిని పూర్తి చేశారు. ఈ విషయంపై మండల పరిషత్‌ అధికారి శ్రీలేఖను వివరణ కోరగా, ఖాతాపై ఉన్న ఫ్రీజింగ్‌ను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు, వారం లేదా పది రోజుల్లో లబ్ధిదారురాలికి రావాల్సిన ఇందిరమ్మ ఇంటి బిల్లులు ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

న్యూశాయంపేట: వరంగల్‌ జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఓ వ్యక్తి తన భూ సమస్య పరిష్కారం కావడం లేదనే ఒంటిపై పెట్రోల్‌ పోసు కుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు వెంటనే స్పందించి అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. దుగ్గొండి మండలం పొనకల్‌ గ్రామానికి చెందిన గట్ల సురేందర్‌ తన కుటుంబ సభ్యులతో ఉన్న భూ వివాద సమస్యను పరిష్కరించాలని ఓసారి ఎడ్ల బండిపై, మరోసారి హనుమకొండ అంబేడ్కర్‌ జంక్షన్‌ నుంచి పొర్లుదండాలు చేస్తూ కలెక్టరేట్‌కు వచ్చి నిరసన తెలిపారు. సోమ వారం కూడా కలెక్టరేట్‌ ఆవరణలో జరుగుతున్న ప్రజావాణికి వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు అతని చేతిలోని బాటిల్‌ను లాక్కుని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద వద్దకు తీసుకెళ్లారు. భూ వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో విచారణలో ఉందని అధికారులు కలెక్టర్‌కు చెప్పారు. ఆత్మహత్యాయత్నం చేయడం సరైన పద్ధతి కాదని ఆ వ్యక్తిని కలెక్టర్‌ మందలించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement