ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): ఉన్న ఊరిలో ఉపాధి లేక రష్యాకు వెళ్లిన యువకుడు ఏజెంట్ చేసిన మోసంతో అక్కడి ఆర్మీలో పనిచేయాల్సి వస్తోంది. ఏజెంట్ మాటలు నమ్మి వెళ్లిన పాపానికి యుద్ధ వాతావరణంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు. తన భర్తను ఇండియాకు రప్పించాలని, ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య పోలీసులను ఆశ్రయించింది. ఎల్లారెడ్డిపేట ఎస్సై రమేశ్‌గౌడ్ తెలిపిన వివరాలు.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన దొమ్మాటి కిషన్–రక్షిత దంపతులు గ్రామంలో కులవృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారు.
కిషన్‌కు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో రష్యాలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని సిరిసిల్ల పట్టణానికి చెందిన ఆదిత్య మ్యాన్‌పవర్ ఏజెంట్ దార్నం శ్రీనివాస్ చెప్పడంతో ఆయన మాటలు నమ్మి రూ.2.50 లక్షలు చెల్లించారు. గత నెల 5న కిషన్ రష్యాకు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత తన భర్త మోసపోయాడని వాపోయింది. బలవంతంగా రష్యా ఆర్మీలో చేర్పించి ఉక్రెయిన్ సరిహద్దులోని యుద్ధ ప్రాంతానికి పంపినట్లు కిషన్ ఫోన్ చేసి చెప్పినట్లు భార్య రజిత తెలిపింది. రష్యాలో ఉద్యోగం పేరుతో పంపించి మోసానికి పాల్పడ్డ ఏజెంట్‌పై చర్యలు తీసుకోవడంతోపాటు తన భర్తను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ఆమె పోలీసులను కోరింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్‌గౌడ్ తెలిపారు.


