పీఎస్‌లో టీస్టాల్‌ నిర్వాహకుడి ఆత్మహత్యాయత్నం | Tea Stall Owner Attempts Suicide Alleging SI Harassment | Sakshi
Sakshi News home page

పీఎస్‌లో టీస్టాల్‌ నిర్వాహకుడి ఆత్మహత్యాయత్నం

Oct 6 2026 7:57 AM | Updated on Oct 6 2026 8:50 AM

Tea Stall Owner Attempts Suicide Alleging SI Harassment

నిజామాబాద్‌ జిల్లా: తనపై పోలీసులు తరచూ కేసులు నమోదు చేస్తూ జరిమానాలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ టీ స్టాల్‌ నిర్వాహకుడు భీమ్‌గల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. భీమ్‌గల్‌ పట్టణానికి చెందిన పొలాస సుధాకర్‌(55) పాత బస్టాండ్‌ సమీపంలో టీ స్టాల్‌ నడుపుతున్నాడు. రాత్రి వరకు హోటల్‌ నడుపుతున్నాడంటూ పోలీసులు పలుమారు హెచ్చరించి, మూడుసార్లు జరిమానా విధించారు.

తాజాగా మరోసారి జరిమానా విధించడంతోపాటు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలని, కోర్టుకు వెళ్లి జరిమానా చెల్లించి రావాలని సూచించారు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన సుధాకర్‌.. ఇతర దుకాణాలు కూడా రాత్రివేళల్లో తెరిచి ఉంటున్నప్పటికీ తన విషయంలోనే ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తూ సోమవారం ఉదయం 10 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు, ఇతరులు అప్రమత్తమై మంటలను ఆర్పారు. అనంతరం అంబులెన్స్‌లో నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

పోలీసుల వేధింపుల వల్లే సుధాకర్‌ ఆత్మహత్మకు యత్నించాడని ఆరోపిస్తూ అతడి కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో బైఠాయించారు. వివిధ పార్టీల, సంఘాల నేతలు వారికి మద్దతుగా నిలిచారు. రాత్రి వేళల్లో టీ విక్రయిస్తున్నాడనే కారణంతో పోలీసులు పలుమార్లు ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఇప్పటికే పలుమార్లు పెట్టీ కేసులు, జరిమానాలు విధించారని, తాజా గా మరోసారి పోలీస్‌ స్టేషన్‌కు రావాలని చెప్పడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడని పేర్కొన్నారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పోలీసులకు తప్పేది లేదు: సీపీ సాయి చైతన్య
బీహెచ్‌ఎల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి అత్యాచారాయత్నానికి పాల్పడిన ఘటనలో పోలీసుల తప్పేమీ లేదని పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సుదాకర్‌ తన వద్ద సిగరెట్లు కొనడం లేదని అక్కసుతో ఓ కిరాణా దుకాణ యజమాని ఇద్దరు వ్యక్తులతో కలిసి బీడీలు కొనడం లేదని చెప్పినట్లు, అలాగే తనను పోలీసులకు వరకు చేర్చాలని చెప్పడంతో పోలీసులకు నైట్‌ డ్యూటీలో భాగంగా పెట్టి కేసు నమోదు చేశారని తెలిపారు. రిపోర్టర్‌ బెదిరించిన విషయాన్ని మనసులో పెట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో దూషణకు పాల్పడినట్లు, ఈ ఘటనలో పోలీసుల తప్పేమీ లేదని స్పష్టం చేశారు. 

ఎస్సై వేధింపుల కారణంగానే..
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): ఎస్సై వేధింపుల కార ణంగానే టీస్టాల్‌ ని ర్వాహకుడు సుధాకర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌ నుంచి స్థానిక మీడియాతో మాట్లాడారు. భీమ్‌గల్‌ ఎస్సై తిరుపతి విచ్చలవిడిగా డ బ్బులు వసూలు చేయడం, ఇసుక అక్రమ వ్యాపారులతో చేతులు కలిపి దందాలు నడపడం, అమాయకులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి చితకబాది బూతులు తిట్టడం నిత్యకృత్యంగా మార్చుకున్నారని ఆరోపించారు. 

ఎస్సై అరాచకాలను గతంలోనే సీపీ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోకపోవడంతో మరింత బరితెగించారని ఆరోపించారు. టీస్టాల్‌ నిర్వాహకుడి ఆత్మహత్యాతయ్నం ఘటనలో పోలీసు ప్రమేయం లేదని సీపీ వ్యాఖ్యానించడం బాధ్యతారాహిత్యమని అన్నారు. సీపీ వ్యాఖ్యలకు నిరసనగా, ఎస్సై తి రుపతిపై కేసు నమోదు చేయడంతోపాటు అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం భీమ్‌గల్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. సుధాకర్‌ ప్రస్తుతం ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, తన వంతుగా రూ.50వేలు అందజేసినట్లు ప్రకటించారు. మిగతా ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం, పోలీసులు భరించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement